Ganesh Navratri 2025: గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సర్వంసిద్ధం
బుధవారం నుంచి గణేష్ ఉత్సవాలు
గల్లీ గల్లీలో వెలసిన గణనాథుల మండపాలు
మండపాల వద్ద స్పెషల్ బందోబస్తు
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఖైరతాబాద్ వినాయకుడు
స్వర్ణగిరి క్షేత్రంలో దర్శనమివ్వనున్న బాలాపూర్ గణేష్
దూల్ పేట్ నుంచి మండపాలకు తరలుతున్న భారీ గణపతి విగ్రహాలు
గణేష్ విగ్రహాల తరలింపునకు స్పెషల్ రూట్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: విఘ్నాలన్నీ తొలగించే ఆది దేవుడైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు (Ganesh Navratri 2025) బుధవారం నుంచి భక్తిశ్రద్ధలతో ఘనంగా మొదలుకానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని గల్లీ గల్లీలో వినాయకుడ్ని ప్రతిష్టించి ఘనంగా పూజలు నిర్వహించేందుకు గతేడాది కన్నాఈ సారి ఎక్కువ సంఖ్యలో మండపాలు వెలిశాయి. ముఖ్యంగా పాతబస్తీలోని దాదాపు అన్ని ప్రాంతాలతో పాటు, సికింద్రాబాద్, ఇతర ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లోనూ ఈసారి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఎంతో ఆకర్షనీయంగా మండపాలను తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఇండ్లలో, వీధుల్లో, అపార్ట్‌మెంట్లతో పాటు సర్కారు, ప్రైవేటు ఆఫీసుల్లో కూడా వినాయకులను ప్రతిష్టించేందుకు ప్రత్యేకంగా మండపాలను ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే సిద్దమైన వినాయక మండపాల్లో గణనాథుడు కొలువుదీరగా, గడిచిన మూడు రోజుల నుంచి దూల్‌పేట నుంచి గణేష్ విగ్రహాలు భారీగా తరలుతున్నాయి. ముఖ్యంగా బేగంబజార్, చప్పల్ బజార్, బాలాపూర్, సికిందరాబాద్ ప్రాంతాల్లో జరిగే వినాయక ఉత్సవాల్లో భారీగా భక్తులు ఆది దేవుడ్ని దర్శించుకోనున్నారు.
Read Also- Divya Bharathi: దివ్యభారతి నా గదిలోకి వచ్చి ఏం చేసిందంటే? నిర్మాత పహ్లాజ్ నిహలానీ షాకింగ్ కామెంట్స్!
భారీ సైజు విగ్రహాల తరలింపులో ఎలాంటి లోటుపాట్లు, ఆటంకాలు ఎదురుకాకుండా పోలీసులు ప్రత్యేకంగా రూట్ ను ఏర్పాటు చేశారు. ఈ రూట్ లో భారీ సైజులో ఉన్న విగ్రహాల తరలింపునకు వీలుగా చెట్ల కొమ్మలను ట్రిమ్మింగ్ చేయటంతో పాటు విద్యుత్ తీగలు అడ్డురాకుండా ముందస్తుగా చర్యలను చేపట్టారు. బుధవారం రాత్రి వరకు కూడా వినాయక విగ్రహాలు నగరంలోని వివిధ ప్రాంతాలకు తరలించే అవకాశముండటంతో గణనాధులను తీసుకుని వెళ్లేందుకు వస్తున్న భారీ వాహానాల కోసం దూల్ పేటలోకి ఎంట్రీ, ఎగ్జిట్ లను వేర్వేరుగా ఏర్పాటు చేసి జాగ్రత్తగా గణనాథుడి విగ్రహాలను తరలిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలోని అన్ని ప్రాంతాల్లో జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఒక ఎత్తైతే ఖైరతాబాద్ భారీ గణపయ్య వద్ద జరిగే ఉత్సవాలు మరో ఎత్తుగా నిలుస్తాయి. ముఖ్యంగా ఈ భారీ గణపయ్యకు బుధవారం ఉదయం ప్రత్యేకంగా నిర్ణయించిన ముహూర్తంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆ తర్వాత భక్తులను దర్శనం కోసం అనుమతించనున్నట్లు తెలిసింది. సిటీలో జరిగే గణేష్ ఉత్సవాల్లో బాలాపూర్ వినాయకుడు మరో ప్రత్యేక ఆకర్షణ కాగా, ఈ సారి బాలాపూర్ వినాయకుడు స్వర్ణగిరి క్షేత్రంలో దర్శనమివ్వనున్నారు.
Read Also- Hanumakonda District: భూభారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలి.. కలెక్టర్ కీలక అదేశాలు
ముందస్తుగా నిమజ్జన ఏర్పాట్లు
బుధవారం నుంచి మొదలుకానున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తుల నుంచి మూడు, అయిదు, ఏడు, తొమ్మిది, పద కొండు రోజుల పాటు ఘనమైన పూజలందుకునే గణనాథుడి నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ చుట్టూ ఈ సారి కాస్త ముందుగానే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. మూడు రోజులు పూజలందుకున్న తర్వాత చాలా విగ్రహాలు నిమజ్జనం కోసం వచ్చే అవకాశముండటంతో ఎన్టీఆర్ మార్గ్ వైపు రెండు క్రేన్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి తోడు సిటీలోని 30 జీహెచ్ఎంసీ సర్కిళ్లలోనూ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు బేబీ పాండ్లను, ఎస్క్యులేటర్ పాండ్లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు సరూర్ నగర్ చెరువు వద్ద కూడా నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ భారీ ఏర్పాట్లు చేసింది. పాండ్ లలో ఒక అడుగు మొదలుకుని అయిదు అడుగుల ఎత్తు కల్గిన విగ్రహాలను నిమజ్జనం చేసేలా, అప్పటికపుడు అవశేషాలను బయటకు తీసేలా నిమజ్జనం ఏర్పాట్లను చేశారు. పదకొండు రోజుల్లో జరిగే నిమజ్జనం తుది ఘట్టంలో భాగంగా బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 21 కిలోమీటర్ల పొడువున జరిగే శోభయాత్ర రూట్ ను ఇప్పటికే వివిధ విభాగాల అధికారులు ఒక దఫా క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.