Divya Bharathi: దివ్యభారతి.. ఈ పేరు ఇప్పుడున్న జనరేషన్‌కి తెలియకపోవచ్చు. కోలీవుడ్‌లో ఇప్పుడో యంగ్ హీరోయిన్ పేరు కూడా దివ్యభారతినే. కాకపోతే ఇక్కడ స్టోరీలో ఉన్న దివ్యభారతి 90స్ హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్య, మోహన్ బాబు వంటి వారి సరసన నటించి మంచి హిట్స్ సొంతం చేసుకుంది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగా.. 19 ఏళ్ల వయసులో నటి దివ్యభారతి మరణం బాలీవుడ్‌ని, ఆమె అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె అకాల మరణంపై ఇప్పటికీ అనేక అనుమానాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. దివ్యభారతితో ‘శోలా ఔర్ షబ్నమ్’ చిత్రానికి పని చేసిన నిర్మాత పహ్లాజ్ నిహలానీ (Pahlaj Nihalani) తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె గురించి మాట్లాడారు. ఆమె మరణించిన రోజు, ఆమెతో వర్క్ ఎక్స్‌పీరియెన్స్‌ను పహ్లాజ్ నిహలానీ గుర్తుచేసుకున్నారు. తన హృదయాన్ని కలచివేసిన క్షణం గురించి ఆయన ఈ విధంగా చెప్పుకొచ్చారు.
1993, ఏప్రిల్ 5న సాయంత్రం దివ్యభారతి (Divya Bharathi) తన ఐదవ అంతస్తులోని అపార్ట్‌మెంట్ కిటికీ నుంచి కిందపడి మరణించారు. అప్పటికి దర్శకుడు సాజిద్ నదియాద్వాలాను వివాహం చేసుకున్న ఆమెను ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆమె చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఫైనల్‌గా ఆమె మరణం ప్రమాదవశాత్తు జరిగిందని నిర్ధారించారు. ఆసుపత్రిలో చోటుచేసుకున్న సంఘటన గురించి పహ్లాజ్ నిహలానీ మాట్లాడుతూ.. ‘‘ఆమె పూర్తిగా ఒంటరిగా ఉంది, అప్పటికి అక్కడ ఎవరూ లేరు. ఏం జరిగిందో అప్పటికి ఎవరికీ తెలియదని, ఆమె కుటుంబ సభ్యులు ఇంకా అక్కడికి చేరుకోలేదని’’ ఆయన చెప్పుకొచ్చారు. ‘అప్పటి వరకు ఎవరూ రాలేదు. నాకు విషయం తెలిసిన వెంటనే, ఆసుపత్రికి పరిగెత్తాను’ అని తెలిపారు.
ఆమెతో పరిచయం గురించి చెబుతూ.. సంగీత దర్శకుడు జతిన్ పండిట్ ఆమెను నాకు పరిచయం చేశారు. “జతిన్ ఆమెను నా దగ్గరకు తీసుకువచ్చాడు. ఆమె మొదటిసారి వచ్చినప్పుడు, ఆమె ఫోటోలలో కాస్త లావుగా కనిపించింది. ఆమె ఫోటోలు నాకు నచ్చలేదు, దివ్యభారతి ముఖం చాలా పెద్దదిగా కనిపించింది. బరువు తగ్గి మళ్లీ కలవమని ఆమెకు సలహా ఇచ్చాను. తర్వాత, అతను మళ్లీ ఆమెను తీసుకువచ్చినప్పుడు, అప్పటికే ‘శోలా ఔర్ షబ్నమ్’ (Shola Aur Shabnam) షూటింగ్ ప్రారంభమైంది. అందులో ఆమె హీరోయిన్ కాదు. ఆమె ఇప్పుడు బాగా కనిపిస్తోందని చెప్పి జతిన్ దివ్యభారతిని ఫిల్మ్ సిటీకి తీసుకువచ్చాడు. అప్పుడు నేను ఆమె మరుసటి రోజు నుంచి షూటింగ్ మొదలుపెట్టవచ్చని చెప్పాను’’ అని దివ్యభారతిని అవకాశం ఇచ్చినట్లుగా వెల్లడించారు.
Also Read- Tanikella Bharani: ‘మటన్ సూప్’ మూవీకి ఆ విఘ్నేశ్వరుడి దయతో ఏ విఘ్నాలు కలగకూడదు
పహ్లాజ్ నిహలానీ దివ్యభారతికి పని పట్ల ఉన్న అంకితభావాన్ని కూడా ప్రశంసించారు. ‘‘షూటింగ్‌లో ఆమె కాలికి మేకు గుచ్చుకుంది, దీంతో మరుసటి రోజు షూటింగ్ రద్దు చేశాము. ఆమె గాయపడినా పని చేయాలని పట్టుబట్టింది. ఆమె పని చేస్తూనే ఉంది, ఆమె కాలికి మేకు గుచ్చుకుంది. రాత్రి 3 గంటలయ్యింది, కానీ ఉదయం 6 గంటలకల్లా ఆమె పాట షూటింగ్ కోసం సిద్ధమైంది. నేను ఆమెకు షూటింగ్ రద్దు చేశామని చెప్పాను. ఈ సమయంలో విశ్రాంతి అవసరమని చెప్పాను. అయినా సరే నా మాట వినలేదు. ఉదయం షూటింగ్ రద్దు చేసి నేను నా గదిలో నిద్రపోతున్నాను, కానీ ఆమె నా గదిలోకి వచ్చి, హౌస్ కీపింగ్ ద్వారా తలుపులు తెరిపించి, లేవండి అంటూ నా ఛాతీపై కూర్చుంది. నా భార్య, ‘ఈ అమ్మాయి ఎవరు?’ అని అడిగింది. నేను, నా భార్య ఇద్దరం నిద్రపోతున్నప్పుడు ఆమె వచ్చి నా ఛాతీపై కూర్చుంది. వర్క్ పట్ల అంత డెడికేషన్ ఉండేది’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు