Gadwal District: గద్వాల జిల్లాలో గతంతో పోలిస్తే నేరల సంఖ్య తగ్గిందని, ఇందుకు శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ చేపట్టిన చర్యలే కారణమని జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస్ రావు తెలిపారు. సైబర్ నేరాలను తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన వార్షిక మీడియా సమావేశంలో 2025 సంవత్సరానికి సంబంధించిన జిల్లా పోలీస్ వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. నేరాల నియంత్రణ, ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీస్ శాఖ నిరంతరం చర్యలు తీసుకుంటోందన్నారు. 2024 సంవత్సరంతో పోలిస్తే 2025లో జిల్లాలో నేరాలు 11 శాతం తగ్గాయని వెల్లడించారు. 2024లో ఇదే కాలానికి మొత్తం 2,703 కేసులు నమోదు కాగా, 2025లో ఇప్ప టివరకు 2,410 కేసులు నమోదయ్యాయని తెలిపారు.
జిల్లా పోలీస్ విభాగం విజయవంతం
ఈ విధంగా మొత్తం 11శాతం కేసులు తగ్గాయని వివరించారు. జిల్లాలోని ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో జీవించేలా శాంతి భద్రతలను పరిరక్షిస్తూ, “పోలీసులు మనకోసమే” అన్న నమ్మకాన్ని ప్రజల్లో మరింత బలపరిచే విధంగా జిల్లా పోలీస్ యంత్రాంగం సమర్థవంతంగా విధులు నిర్వహించిందని పేర్కొన్నారు. జిల్లాలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు జిల్లా పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యతనిస్తూ, నిరంతర పర్యవేక్షణతో శాంతి-భద్రతలను సమర్థవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతకు ముప్పు కలగకుండా ముందస్తు చర్యలు, క్షేత్రస్థాయి తనిఖీలు, నిరంతర గస్తీ చర్యల ద్వారా జిల్లా లా అండ్ ఆర్డర్ పరిస్థితిని పూర్తి నియంత్రణలో ఉంచడంలో జిల్లా పోలీస్ విభాగం విజయవంతమైందన్నారు.
Also Read: Gadwal District: పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థుల మనోవేదన.. అప్పులపాలై ఆగమాగం అంటూ..!
అంతేకాకుండా వినాయక చవితి, రంజాన్, బక్రీద్ వంటి ముఖ్య పండుగలు, జాతరలు, భారీ జనసమీకరణ జరిగే కార్యక్రమాలను కూడా తగిన బందోబస్తు ఏర్పాట్లతో శాంతియుతంగా, సజావుగా నిర్వహించడం జరిగిందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సమయంలో శాంతిభద్రతలను కాపాడేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎఫ్ఐఆర్ లు జారీ చేస్తూ మొత్తం 88 కేసులు నమోదు కాగ, వాటిలో 84 ఎక్సైజ్ కేసులు, 3 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) కేసులు, ఒక ఫ్రీబీ కేసులో 50 కార్టన్ల ఆయిల్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో కలహాలు తలెత్తకుండా నివారించేందుకు 174 కేసుల్లో మొత్తం 303 మందిని బౌండోవర్ చేయడంతో ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడం జరిగిందన్నారు.
తగ్గిన రోడ్డు ప్రమాదాలు
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు తగ్గాయని జిల్లా ఎస్పీ తెలిపారు. మృతులు, క్షత్రగాత్రులు పెరిగాయన్నారు. తరచుగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టడం, హెల్మెట్ ధరించని వారికి జరిమానాలు విధించామన్నారు. 2024లో 207 యాక్సిడెంట్ కేసులు ఉంటే ఈ ఏడాది 204 కేసులు నమోదయ్యాయన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 3 కేసులు తగ్గాయన్నారు. గత ఏడాది 207 రోడ్డు ప్రమాదాలు జరిగితే, ఇందులో 133 మంది చనిపోయారని తెలిపారు. ఈ ఏడాది 204 రోడ్డు ప్రమాదాలు జరిగితే ఇందులో 135 మంది మృతి చెందారని, గతేడాది కంటే మృతుల సంఖ్య తగ్గిందన్నారు. గాయాల కేసులు నిరుడు 163 ఉంటే ఈఏడాది 189 నమోదు కాగా, గతేడాది కంటే 26 కేసులు పెరిగాయని వివరించారు.
సంచన కేసుల చేదన
1. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మర్డర్ కేసులను జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసులు విజయవంతంగా ఛేదించడం జరిగిందన్నారు. అందులో ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన గద్వాల్ టౌన్ పిఎస్ పరిధిలో గద్వాల్ పట్టణానికి చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ మిస్సింగ్ కేసును పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల ఆధారంగా అత్యంత వేగంగా దర్యాప్తు చేసి హత్య కేసుగా ఛేదించారు. కర్నూలు జిల్లాలో లభ్యమైన మృతదేహాన్ని కుటుంబ సభ్యుల ద్వారా గుర్తించి తేజేశ్వర్ మృతదేహమని నిర్ధారించారు. విచారణలో అతని భార్య ఐశ్వర్య ఇతరులతో కలిసి హత్య చేయించినట్టు తేలడంతో సంబంధితంగా నలుగురు అనుమానితులను పోలీస్ అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.
2. గద్వాల్ టౌన్ పిఎస్ పరిధిలో ఆన్లైన్ బెట్టింగ్స్, గేమ్స్ కు అలవాటు పడి డబ్బుల కోసం మహిళను హత్య చేసి బంగారు గొలుసు దొంగిలించిన ఎలాంటి క్లూస్ లేని కేసును గద్వాల్ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు నిర్వహించి నేరాన్ని నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి అతడి నుంచి రూ.2,33,500 నగదు, ఒక స్కూటీ, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు.
3. శాంతినగర్ పరిధిలో జరిగిన సుఫారి హత్య కేసును అత్యల్ప సమయంలో విజయవంతంగా ఛేదించడం జరిగింది. సొంత తమ్ముడే అన్నాను సుపారీ గ్యాంగ్ తో కలిసి హత్య చేయించి ప్రమాదంగా చిత్రికారించే ప్రయత్నంను పోలీసులు చెధించి తమ్ముడితో సహా సుపారీ గ్యాంగ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
4. ధరూర్ మండల పరిధిలో జాంపల్లి స్టేజ్ వద్ద సుపారీ గ్యాంగ్ తో నందిన్నె మాజీ సర్పంచ్ చిన్న భీమారాయుడును హత్య చేసి, బొలెరో వాహనంతో గుద్ది రోడ్ ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఘటనను పోలీసులు ఛేదించారు. రాజకీయ కక్షలు, భూవివాదాలే హత్యకు కారణమని దర్యాప్తులో నిర్ధారణ అయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మొత్తం 10 మందిని అరెస్ట్ చేసి, రూ.8.50 లక్షల నగదు, 3 కార్లు,2-బైకులు, ఒకబొలెరో వాహనం ను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించడం జరిగింది.
5. శాంతినగర్ పరిధిలోని వ్యక్తిని అప్పు పేరుతో హైదరాబాద్కు పిలిపించి, కిడ్నాప్ చేసి బంధించి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించిన కేసును జోగుళాంబ గద్వాల్ పోలీసులు కేవలం 8 గంటల్లోనే ఛేదించారు. బాధితుడి భార్య ఫిర్యాదు అందగానే సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి హైదరాబాద్ లో బాధితుడిని సురక్షితంగా కాపాడారు. గంటల వ్యవదిలో హైదరాబాద్ లో జరిగిన కిడ్నప్ కేసును చేధించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన విషయం జిల్లా పోలీస్ పని తీరుకు నిదర్శనంగా నిలుస్తుంది.
పెరిగిన రేప్, పోక్సో కేసులు
2025లో రేప్, పోక్స్ కేసులు పెరిగాయని ఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు. 2024లో 31 రేప్ కేసులు నమోదు కాగా, 2025లో 41 కేసులు నమోదయ్యాయన్నారు. నిరుడు 2 వేధింపుల కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 2 కేసులు నమోదు కాగ ఒక కేసు వరకట్నం మర్డర్ నమోదు జరిగిందన్నారు.
దొంగతనాలు.. రివకరీ ఇలా
వివిధ దొంగతనాలను పరిగణలోకి తీసుకుంటే 2024లో 351 కేసులు నమోదు కాగా 161 గుర్తించగా.. రూ.1,94,05,160 చోరీ కాగ రూ.63,11,896 రికవరీ చేసినట్లు వివరించారు. ఈ ఏడాది 241 కేసులు నమో దు కాగా 184 గుర్తించినట్లు పేర్కొన్నారు. రూ.1,43,71,274 చోరీ కాగా.. రూ.96,35,309 రివకరీ చేసినట్లు పేర్కొన్నారు.
పోలీసులకు సవాల్ గా మారిన సైబర్ నేరాలు
ఈ ఏడాది జిల్లా పోలీస్ శాఖకు సైబర్ నేరాలు ప్రధాన సవాలుగా మారాయి. సైబర్ నేరగాళ్లు తమ గుర్తింపు, ఉన్న ప్రదేశాలను దాచడానికి ఆధునిక సాంకేతిక పద్ధతులను తరచుగా వినియోగిస్తున్నారు. ఈ నేరాలు అనేక సందర్భాలలో భౌగోళిక సరిహద్దులను దాటి జరుగుతుండటంతో దర్యాప్తు ప్రక్రియ మరింత క్లిష్టంగా మారుతోంది. సాంకేతికత నిరంతరం మారుతూ ఉండటంతో, పోలీస్ బలగాలు తమ నైపుణ్యాలు, సాధనాలను ఎప్పటికప్పుడు నవీకరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది జిల్లాలో మొత్తం 95 కేసులు ఎఫ్‌ఐఆర్‌లుగా నమోదు చేయబడాయి. ఈ కేసులలో న్యాయస్థానం నుంచి మొత్తం రూ.47,62,561 విలువైన రీఫండ్ ఆదేశాలు పొందడం జరిగింది.
ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ విజయవంతం
మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, షీ టీమ్స్ ద్వారా 136 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. భరోసా కేంద్రం ద్వారా 81 మందికి కౌన్సిలింగ్, 53 మందికి వైద్య సహాయం అందించినట్లు వివరించారు. అలాగే, ఆపరేషన్ స్మైల్ & ముస్కాన్ కింద 97 మంది బాలురు, 19 మంది బాలికలను రక్షించి వారి కుటుంబాలకు చేరవేసినట్లు చెప్పారు
అలాగే డ్రగ్స్ కేసుల్లో 5 గురిని రిమాండ్‌కు తరలించినట్లు, జిల్లాలో 602 సైబర్ ఫిర్యాదులు అందగా, 95 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయడం జరిగిందన్నారు డయల్ 100 ద్వారా ప్రజలకు పోలీస్ సేవలు అందిస్తూ 10,032 కాల్స్ స్వీకరించి, సత్వరమే స్పందించడం జరిగిందన్నారు. టీఎస్ కాప్ యాప్ మరియు సోషల్ మీడియా (ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్) ద్వారా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నట్లు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో సహకరిస్తున్న ప్రజలకు, ప్రజాప్రతినిధులకు మరియు మీడియా మిత్రులకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ జిల్లాను నేర రహితంగా మార్చేందుకు పోలీసులు అంకితభావంతో పని చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శంకర్, డీఎస్పీ వై.మొగయలయ్య, సిఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Gadwal District: గ్రామాల్లో జోరందుకున్న ప్రలోభాల పర్వం.. ఉత్కంఠగా మారిన గద్వాల రాజకీయం

