CPI: సిపిఐ పార్టీతో కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పొత్తులను విరమించుకుంది. గత అసెంబ్లీ సమయంలో కాంగ్రెస్(Congress) పార్టీతో సిపిఐ(CPI) పార్టీ కలిసి పనిచేసింది. అదే దృక్పథంతో కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీని మున్సిపాలిటీ ఎన్నికల్లో కలుపుకోవాలని భావించింది. అయితే స్థానిక వార్డుల్లో ఇరు పార్టీలు ప్రత్యేకమైన దృష్టి సారించడంతో పొత్తులు విఫలమయ్యాయి. సిపిఐ పార్టీకి తమ పాత స్థానాల్లో రిజర్వేషన్స్ అనుకూలించకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్న స్థానాలను సిపిఐ పార్టీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో తమతో కలిసి పనిచేసిన సిపిఐ పార్టీకి ఎలా వార్డులను సర్దాలో అర్థం కాక చాలా మార్లు ఇరు పార్టీల పెద్దలతో చర్చలు జరిగాయి.
పెద్దల సమక్షంలో చర్చలు
తొలుత సిపిఐ పార్టీ 13 స్థానాలను ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని కోరింది. అయితే కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలు ఇవ్వడానికి సుముఖంగా లేదు. దీంతో మరికొంత తగ్గి సిపిఐ పార్టీ 10 స్థానాలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయినప్పటికీ పది స్థానాలను సిపిఐ పార్టీకి ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వార్డ్ స్థానాలు సరిపోకపోవడంతో అందుకు కూడా అంగీకరించలేదు. అనంతరం గురువారం రాత్రి 9:30 గంటల వరకు కాంగ్రెస్(Congress), సిపిఐ(CPI) పార్టీ పెద్దల సమక్షంలో చర్చలు జరిగాయి. చివరికి 9 స్థానాలు ఇవ్వాలని అందులో 36వ వార్డు తమ సిపిఐ పార్టీకి కేటాయించాలని కాంగ్రెస్ పార్టీని కోరింది. 36వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉండడంతో ససేమిరా అంటూ, 9 స్థానాలను కూడా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఎనిమిది స్థానాలు ఇవ్వాలని, అప్పటికి ఒప్పుకోకపోవడంతో ఏడు స్థానాలు ఇవ్వాలని సిపిఐ పార్టీ కోరినట్లుగా విశ్వసనీయ సమాచారం.
Also Read; Konda Surekha: మేడారానికి దూరంగా దేవాదాయశాఖ మంత్రి.. మంత్రుల మధ్య విభేదాలే కారణమా?
సిపిఎం పార్టీకి నాలుగు సీట్లు
ఈ మేరకు ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలకు విషయాన్ని వివరించినట్లుగా సమాచారం. దీంతో సిపిఐ పార్టీతో కలిసి పనిచేయకుండానే కాంగ్రెస్ పార్టీ గతంలో అలయన్స్ కుదుర్చుకున్న సిపిఎం పార్టీకి నాలుగు సీట్లు కేటాయించి మునిసిపల్ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో సిపిఐ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం సిపిఎం పార్టీకి నాలుగు వార్డు స్థానాలను కేటాయించి మిగతా 32 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీలో నిలిపేందుకు స్పష్టమైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తోంది. ఈ మేరకు శుక్రవారం నామినేషన్ల ప్రక్రియకు లాస్ట్ తేదీ కాబట్టి 32 వార్డుల్లో తమ పార్టీకి అనుకూలమైన అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.
Also Read: Medigadda Barrage: అత్యధిక ప్రమాదకర జాబితాలో మేడిగడ్డ.. తక్షణ జోక్యం అవసరం అంటూ కేంద్రం హెచ్చరిక..!

