Singur Project: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టు గండిపడే అవకాశం ఉన్నట్లు డ్యాం సేఫ్టీ రివ్యూ ప్యానెల్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో ఇరిగేషన్‌శాఖకు చెందిన ఇంజనీర్ ఇన్ ఛీఫ్ స్థాయి అధికారి జిల్లాస్థాయి ఉన్నత అధికారులతో ఆఘమేఘాల మీద శుక్రవారం సందర్శించి అనుకున్నంతగా ప్రమాద పరిస్థితి ఏమీలేదని ప్రకటించారు. బీఆర్‌ఎస్,(brs) సీపీఎం పార్టీకి చెందిన నాయకులు సైతం ప్రాజెక్టును సందర్శించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని కూడా డిమాండ్ చేశారు.
సింగూరు ప్రాజెక్ట్(Singur Project)కు ఎడమవైపు ఉన్న కట్టకు 400 మీటర్ల పొడగునా, కుడివైపు 200 మీటర్ల పొడగునా కుండిపోవడంతో గత నాలుగేళ్ల క్రితమే రూ.3 లక్షల విలువ చేసే 40వేలకు పైగా సిమెంట్ బస్తాల్లో ఇసుక నింపి అడ్డంగా పేర్చి ఉంచారు. ఆ బస్తాలు సైతం చిరిగిపోయి కయ్యలుగా ఏర్పడే పరిస్థితి ఉండటంతో మరమ్మత్తులు చేపట్టాలని ఇటీవల ప్రాజెక్టును సందర్శించిన డ్యాం సేప్టి రివ్యూ ప్యానెల్ ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ఈ విషయం బయటకు పొక్కడంతో ప్రాజెక్టు వద్ద హల్‌చల్ మొదలైంది. మీడియా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రాజెక్టు వద్దకు చేరుకొని పరిశీలించారు. ప్రస్తుతం వర్షాలతో భారీగా వరద నీరు పోటెత్తుతోంది. 29.917 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్‌లో ప్రస్తుతం 19.5 టీఎంసీల నీరు చేరడంతో మళ్లీ రిజర్వాయర్‌లో అలల తాకిడి పెరిగింది. ఇక వర్షాలకు భారీగా వరద ప్రవాహం సింగూరుకు పోటెత్తుండటంతో ప్రమాదం జరగవచ్చునని భావిస్తున్నారు.
పొంచి ఉన్న ప్రమాదం
వాస్తవ డిజైన్ల ప్రకారం జలాశయంలో నీటి నిల్వలు 517.8 మీటర్లకు మించకుండా నిర్వహించాలని, దీనికి విరుద్దంగా మిషన్ భగీరథ అవసరాల కోసం 520.5 మీటర్లకు తగ్గకుండా నిల్వలను నిర్వహించాలని 2017లో ప్రభుత్వం 885 జీఓ జారీ చేసింది. సామర్థానికి మించి నీటి నిల్వల వల్ల ప్రాజెక్టు దెబ్బతింటుందన్న ఆరోపణలున్నాయి. రెండేళ్ల క్రితం ప్రాజెక్ట్ ఆయాకట్టకు గండి ఏర్పడడంతో ప్రాజెక్ట్ పూర్తిగా నిండి మరమ్మతులు చేపట్టేందుకు అవకాశం లేకపోవడంతో అధికారులు తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టి వదిలేశారు. దీంతో క్రమంగా కట్ట రివెంట్‌మెంట్ దెబ్బతిన్నది. దెబ్బతిన్న రివెంట్‌ను అత్యవసరంగా సరిచేయకపోతే ఏక్షణాల్లో గండి పడే అవకాశాలు లేకపోలేదు.
రూ.16 కోట్లతో ప్రతిపాదనలు
ప్రాజెక్టుకు కుడి, ఎడమవైపున ఉన్న కట్టలు ప్రమాదకరంగా మారడంతో డ్యాం సేప్టి రివ్యూ ప్యానెల్ పరిశీలన అనంతరం డ్యాం మరమ్మతుల కొరకు ప్రభుత్వానికి రూ.16 కోట్ల నిధులతో ప్రతిపాదనలు పంపాం. మరమ్మతుల చేపట్టేందుకు రెండేళ్లుగా ప్రాజెక్ట్‌లో నీరు తగ్గకపోవడంతో మరమ్మతులు చేపట్టేందుకు అవకాశం లేకుండా పోతోంది.ప్రాజెక్ట్‌లో నీటిని తగ్గించుకోని మరమ్మతులు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి మరమ్మతులు పంపాం. ప్రభుత్వం నుండి అనుమతి రాలేదు. – మహిపాల్‌రెడ్డి, సింగూర్ ప్రాజెక్ట్ ఏఈ
ఢోకా లేదు
ప్రాజెక్టు కుంగిపోకుండా యుద్దప్రాతిపదికన వెంటనే తాత్కాలిక మరమ్మత్తులు చేపడతామని ఇంజనీర్ ఇన్ ఛీఫ్ (జనరల్) అమ్జద్ హుస్సేన్ తెలిపారు. ప్రాజెక్ట్‌కు ఎటువంటి ప్రమాదంలేదు. రాబోయే రోజుల్లో ప్రాజెక్టులోని నీటి శాతం తగ్గిపోయిన తర్వాత పర్మినెంట్‌గా పనులు చేపడతామన్నారు. డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ ప్రభుత్వానికి నివేదికకు ఇంకా తాను చూడలేదని తెలిపారు. ప్రాజెక్ట్‌కు అత్యవసరంగా ఖర్చు చేసేందుకు ఈఈకి రూ.5 లక్షలు, ఎస్‌ఈకి రూ.25 లక్షలు, సీఈకి రూ.50 లక్షలు ఖర్చు వెచ్చించేందుకు అధికారం ఉంటుందన్నారు. ప్రాజెక్టు విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇంజీనీర్ ఇన్ ఛీఫ్ (మెయింటనెన్స్, ఆపరేషన్), శ్రీనివాస్, ఛీఫ్ ఇంజనీర్ (సెంట్రల్ డిజైనర్), సెంట్రల్ డిజైన్స్ ఇఇ ఎంఎన్‌వి చంద్రశేఖర్, ఏఈ మహిపాల్‌రెడ్డిలు ఆయన వెంట ఉన్నారు.
Also Read: BRS on BC Candidate: బీసీలపై గురిపెట్టిన బీఆర్ఎస్.. ఆర్మూర్ నుంచే స్టార్ట్.. వారి సీట్లు గల్లంతే!
