Silver jubilee celebrations: భారత రాష్ట్ర సమితి పార్టీ 25 సంవత్సరాల వ్యవస్థాపక దినోత్సవం సిల్వర్ జూబ్లీ వేడుకలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వైభవంగా నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, కార్యకర్తలను ఒక్క చోటికి చేర్చి వేడుకలు నిర్వహించేందుకు అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉండే ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించారు.
సభ కోసం బీఆర్ఎస్ నేతలు రైతుల భూములు చదును చేశారు. చదును చేసిన క్రమంలో హద్దులు చెరిపేసి, కాల్వలు పూడ్చివేసి, మట్టి, మోరం పోసి తాత్కాలిక రోడ్లు వేశారు. సభ ప్రధాన వేదిక సహా పలు చోట్ల కాంక్రీట్ వేశారు. వాహనాల రాకపోకలతో వ్యవసాయ భూములు గట్టి పడ్డాయి. సభ నిర్వహణ తరువాత ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకు పోయాయి. సభ అయితే ముగిసింది కానీ భూములు వ్యవసాయ యోగ్యంగా మార్చుకోవడం ఇప్పుడు రైతులకు సమస్యగా మారింది.
బాగు చేసుకోవడం ఆర్థిక భారమే
చింతలపల్లి, ఎల్కతుర్తి గ్రామాల రైతుల అంగీకారం, సహకారంతో సభ సజావుగా నిర్వహించారు. సభ ఏర్పాట్లలో భాగంగా 1213 ఎకరాల్లోని రైతుల భూములు చదును చేశారు. 154 ఎకరాల్లో ప్రధాన సభ, 1059 ఎకరాల్లో పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు వ్యవసాయ భూములను సభకు అనుకూలంగా మార్చే క్రమంలో హద్దురాళ్లు, ఒడ్లు చెరిపి కాలువలు పూడ్చి తాత్కాలిక రోడ్ల నిర్మాణ పనులను చేపట్టడంతోపాటు గట్టితనం కోసం పలు చోట్ల కాంక్రీట్ వేశారు.
Also read: Google In AP: విశాఖలో గూగుల్.. జాబ్స్ వేలల్లో.. మీరు సిద్ధమా!
ఇప్పుడు ఆ భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చుకోవడం సవాల్ గా మారిందని రైతులు అంటున్నారు.
ముందుగా మాట ఇచ్చినట్టు పూర్తిగా బాధ్యత తీసుకుని బీఆర్ఎస్ నేతలు వ్యర్ధాలను తొలగించి హద్దులు నిర్ణయించి గట్లను ఏర్పాటు చేసి పోసిన మట్టిని కాంక్రీట్ ని తొలగించి కాలువలను పునరుద్ధరించాల్సి ఉంది. బీఆర్ఎస్ పార్టీ తరుపున పనులు చేయకుంటే ఆర్థిక భార మాపై పడుతుందని రైతులు అంటున్నారు.
గత అనుభవాలు పునరావృతం కాకుండా చూడాలి
గతంలో నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభలు నిర్వహించిన సమయంలో తీసుకున్న భూములు చదును చేసి సరిచేయకుండా వదిలేయడంతో భూ యజమానులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. భూ కబ్జాదారులు అందులో చొరబడి సృష్టించిన సమస్యలు పరిష్కారం కాక భూ యజమాలు ఏండ్లు గడిచిన సమస్య పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నారు.
2010 డిసెంబర్ నెలలో వరంగల్ ప్రకాష్ రెడ్డి పేటలో టీఆర్ఎస్ పార్టీ ప్లాట్ లన్ని చదును చేసి భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఆ తర్వాత ఎవరి హద్దులు వారికి నిర్ణయించకపోవడంతో కబ్జాదారులు చొరబడి భూ యజమానులను ఇబ్బందులు పాలు చేశారు ఇప్పటికీ ఆ సమస్యల పరిష్కారం కాకపోవడంతోపాటు తమ విలువైన భూములు పోయి అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు.
Also read: Samantha Temple: సమంతకు గుడి కట్టి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న అభిమాని.. ఎందుకంటే?
ఆ అనుభవం నేపథ్యంలో 2022 హనుమకొండ జిల్లా దేవన్నపేటలో భారీ బహిరంగ సభ నిర్వహణకు భూమి సేకరించేందుకు ప్రయత్నించిన భూయజమానులు భూమి ఇవ్వడానికి నిరాకరించారు. బీఆర్ఎస్ వాళ్లు ఎక్కడ సభ నిర్వహించిన ఇలాంటి భూ సమస్యలు తలెత్తుతాయి అనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఎల్కతుర్తిలో పునరావృతం కాకుండా చూడాలని రైతుల కోరుతున్నారు.
మేము సహకరించాం మాకు ఇబ్బంది లేకుండా చేయండి
జాతీయ రహదారి చేరువలో అనుకూలంగా ఉందని భావించి సభ నిర్వహణ కోసం ముందుకు వస్తే వారికి ఇబ్బంది అయిన, రైతులు బీఆర్ఎస్ నేతలకు పూర్తి సహకారం అందించారు. రైతుల సహకారంతో సభ సజావుగా సాగింది. ఈ క్రమంలో మీకు అన్ని విధాల మేము భూములు ఇచ్చి సహకరించాం మాకు ఇబ్బంది కలుగకుండా హద్దులు, కాలువలు సరి చేసి, వ్యర్థాలు తొలగించి మా భూములు వ్యవసాయ యోగ్యంగా మార్చి ఇవ్వాలని రైతులు బీఆర్ఎస్ పార్టీ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
పూర్తి బాధ్యత తీసుకుని రైతులకు సమస్య లేకుండా చేస్తాం
రైతులు అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థన మేరకు తమ భూములను సభ నిర్వహణకు ఇచ్చి అన్ని విధాల సహకరించారు. సభ నిర్మాణం కోసం అవసరమైన పనులు వారి భూముల్లో చేపట్టాం. తాత్కాలిక రోడ్ల నిర్మాణం, అవసరమైన చోట మొరం, మట్టి, కాంక్రీట్ వేయాల్సి వచ్చింది. అన్ని విధాల శుభ్రం చేసి రైతులకు ఇబ్బంది కలుగకుండ పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ తెలిపారు.