ఒక్క ఊరు.. మూడు మండలాలు, మూడు జిల్లాలు
వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో విచిత్ర పరిస్థితి
మండలాల మార్పులతో తీవ్ర ఇబ్బందులు
ఒక్కో పనికి ఒక్కో మండలానికి వెళ్లాల్సిన దుస్థితి
ఓట్లు ఒకచోట.. అభివృద్ధి పనులు మరోచోట
రెవెన్యూ గ్రామంగా మార్చాలంటూ ప్రజల డిమాండ్
Hanumakonda District: ఏ గ్రామానికైనా ఒకే జిల్లా, ఒకే నియోజకవర్గం, ఒకే మండలం ఉండటం సహజం. కానీ, హనుమకొండ జిల్లా(Hanumakonda District) నడికూడ మండలం పరిధిలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామంVenkateswarlapalli village) పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా గందరగోళంగా తయారైంది. తరుచూ జిల్లాలు, మండలాలు మారుతుండటంతో గ్రామానికి సంబంధించిన పాలనా వ్యవహారాలు చిక్కుముడిగా మారాయి. రెవెన్యూ, పంచాయతీ, పోలీస్( Police) కార్యకలాపాలు వేర్వేరు మండలాల్లో కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
❄️మూడు జిల్లాల్లో తిరిగిన గ్రామం..
పూర్వపు వరంగల్ జిల్లా(Warangal District)లోని పరకాల మండలం నార్లపూర్ రెవెన్యూ గ్రామ పరిధిలో వెంకటేశ్వర్లపల్లి ఉండేది. 2017లో జిల్లాల పునర్విభజన తర్వాత ఈ గ్రామాన్ని వరంగల్ అర్బన్ జిల్లాలోని కమలాపూర్ మండలంలో కలిపారు. ఆ తర్వాత అది హనుమకొండ జిల్లా (Hanumakonda District) గా మారినప్పుడు, కొత్తగా ఏర్పడిన నడికూడ మండలంలో చేర్చారు. ఇలా కేవలం ఆరు సంవత్సరాల కాలంలో ఈ గ్రామం మూడు జిల్లాలు, మూడు మండలాలను మార్చుకుంటూ వచ్చింది.
Also Read: Narayankhed: రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వర్షంలో నానా అవస్థలు
ఒక్కో పనికి ఒక్కో మండలానికి..
సుమారు 1,300 మంది ఓటర్లు, 3,000 పైగా జనాభా కలిగిన వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి సంబంధించిన పరిపాలన గందరగోళంగా సాగుతుంది. గ్రామ పంచాయతీ కార్యకలాపాలు కమలాపూర్ మండలంలో నిర్వహిస్తుండగా, రెవెన్యూ వ్యవహారాలు నడికూడ మండలంలో, పోలీస్ స్టేషన్ వ్యవహారాలు పరకాల మండలంలో నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఒక్కో పనికి ఒక్కో మండలానికి వెళ్లాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా మార్చి, అన్ని వ్యవహారాలు ఒకే మండలంలో ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నా, పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
❄️ఓటు ఇటు.. సీటు అటు..
ఈ గ్రామంలో ఓటు వేసే విధానం కూడా అస్తవ్యస్తంగా ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు పరకాల నియోజకవర్గం, వరంగల్ పార్లమెంట్ స్థానాలకు ఓట్లు వేస్తున్నారు. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానం కమలాపూర్ మండలం మర్రిపల్లి ఓటర్లతో కలిపి ఉంటుంది. దీంతో మండల పరిషత్ నడికూడ పరిధిలో ఉన్నా, ఓట్లు మాత్రం కమలాపూర్‌కు వేయాల్సి వస్తుంది. ఈ గందరగోళ పరిస్థితి ఓటర్లకు, పోటీ చేయాలనుకునే ఆశావహులకు ఆందోళన కలిగిస్తుంది.
❄️అభివృద్ధికి ఆటంకాలు..
గ్రామానికి స్పష్టమైన పరిపాలనా పరిధి లేకపోవడం వల్ల అభివృద్ధిలో కూడా అదే పరిస్థితి నెలకొంది. గ్రామంలో కనీసం రహదారి సౌకర్యం కూడా సరిగా లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా గుర్తించి, ఒకే మండలంతో సంబంధం ఉండేలా పునర్విభజన చేయాలని, ప్రత్యేక ఎంపీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
❄️గందరగోళం నుంచి గట్టెక్కించాలి..
మా గ్రామం హనుమకొండ జిల్లా, నడికుడి మండలం వెంకటేశ్వర్లపల్లి తరచూ జిల్లాలు, మండలాలు మారాయి. రెవెన్యూ గ్రామం ఒకచోట, గ్రామపంచాయతీ మరొకచోట ఉన్నాయి. పరకాల అసెంబ్లీకి, వరంగల్ పార్లమెంటు స్థానాలకు మేము ఓట్లు వేస్తున్నాం. కానీ గ్రామపంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఓట్లు మాత్రం కమలాపూర్ మండలానికి వేయాల్సి వస్తుంది. ఈ గందరగోళ పరిస్థితి నుంచి మా గ్రామాన్ని ప్రభుత్వం వెంటనే గట్టెక్కించాలి.
❄️బత్తిని ప్రశాంత్, గ్రామస్తుడు
❄️రెవెన్యూ గ్రామంగా గుర్తించాలి..
మా గ్రామం మండలం నడికూడలో ఉండగా, పోలీస్ స్టేషన్ (Police station) పరకాల మండలంలో ఉంది. రెవెన్యూ వ్యవహారాలు కమలాపూర్Kamalapur) మండలంలో ఉన్నాయి. పనుల కోసం మేము గిరగిర తిరగాల్సి వస్తుంది. జిల్లాల పునర్విభజన తర్వాత మా గ్రామం పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మేము ఓట్లు ఎవరికి వేస్తున్నాము, రేపు మా పనుల కోసం ఎవరిని ప్రశ్నించాలి అనే దానిపై స్పష్టత లేకుండా పోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, పాలకులు స్పందించి మా గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా గుర్తించి, ప్రత్యేక ఎంపీటీసీ స్థానాన్ని కేటాయించాలి.
Also Read: Venkata Ramana Reddy: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది: గండ్ర వెంకటరమణారెడ్డి