ACB Raids: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ ఆర్టీఏ చెక్‌పోస్టు(RTA Checkpost)లో అవినీతి మరోసారి బహిర్గతమైంది. వాహనాల చెకింగ్ పేరుతో నెలకొన్న ‘క్యాష్ చెకింగ్’ వ్యవస్థపై ఏసీబీ అధికారులు శనివారం అర్థరాత్రి నుంచి విస్తృత దాడులు నిర్వహించారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య, ఖమ్మం డిఎస్పి వై.రమేష్(DSP Ramesh) ఆధ్వర్యంలో పాల్వంచ మండలం నాగారం చెక్‌పోస్టు పరిసర ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు సట్ల రాజు, లావుడియా రాజు, ఇతర సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. చెక్‌పోస్టులో పనిచేస్తున్న సిబ్బంది వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు ముందుగా గోప్య సమాచారం సేకరించి, ఆ తర్వాత దాడులకు దిగినట్టు సమాచారం.
డీఎస్పీ సాంబయ్య మాట్లాడుతూ..
ఈ చెక్‌పోస్టులో పర్మిట్, ఓవర్‌లోడ్(Over Load), ఫైన్(Fine), టాక్స్ కలెక్షన్(Tax Colection) లాంటి అంశాల్లో ఏ ఒక్కటి సక్రమంగా అమలు కావడం లేదు. అధికారిక రసీదులు ఇవ్వకుండా అనధికారంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు మాకు సమాచారం వచ్చింది. అందుకే శనివారం రాత్రి 12.30 గంటల నుంచి దాడులు ప్రారంభించాం అని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఈ సోదాల్లో ఇప్పటివరకు అనధికారంగా వసూలు చేసిన సుమారు రూ.25100 నగదు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బులు చెక్‌పోస్టు సిబ్బంది వద్ద దొరికాయని, వాటికి సంబంధించి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవిఐ) మనోహర్ ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయారని ఆయన వెల్లడించారు. “ఈ నగదు మూలం, బాధ్యత ఎవరిది అనే విషయంపై పూర్తి స్థాయి విచారణ జరపాల్సి ఉంది. చెక్‌పోస్టులో విధానాలు పూర్తిగా నియమావళి విరుద్ధంగా నడుస్తున్నాయి” అని అన్నారు.
Also Read: Singareni Bonus 2025: సింగరేణి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఉద్యోగులకు భారీగా బోనస్.. ఎంతో తెలిస్తే షాకే!
అన్నింటికీ నిర్దిష్ట రేటు..
ప్రతి వాహనానికి రూ.200 నుంచి రూ.500 వరకు, ఇసుక రవాణాకు రూ.2000 వరకు నిర్దిష్ట రేటు ఉండేదిగా ఏసీబీ గుర్తించింది. డ్రైవర్లు చెబుతున్న వివరాల ప్రకారం డబ్బులు ఇచ్చిన వారినే ముందుకు పంపే పద్ధతి సర్వసాధారణంగా మారిందని తెలిసింది. దాడుల్లో అధికారులు చెక్‌పోస్టు రికార్డులు, రసీదు పుస్తకాలు, కంప్యూటర్ డేటా సీజ్ చేశారు. సిబ్బంది మొబైళ్లను కూడా పరిశీలించి లావాదేవీల ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రాథమికంగా ఇది వ్యక్తిగత లావాదేవీ కాకుండా ఒక వ్యవస్థాత్మక అవినీతిగా మారిందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ప్రతిరోజూ ఈ చెక్ పోస్ట్ మిధుగా వందలాది వాహనాలు ఈ చెక్‌పోస్టు ద్వారా వెళ్తున్నా, లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ పత్రాలు పరిశీలించకుండా డబ్బులు తీసుకుని వదిలేస్తున్నారని సమాచారం.
ఈ వ్యవహారంలో పలువురు ఆర్టీఏ సిబ్బంది పేర్లు ఏసీబీ దృష్టిలోకి వచ్చాయని, వారిని విచారణకు పిలిచే ప్రక్రియ కొనసాగుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పేపర్లు ఉన్నా లేకపోయినా, డబ్బు ఇచ్చినవాళ్లకే వదిలేస్తారు. ఏసీబీ వచ్చి చూసినదే నిజం బయటపడటానికి దారితీసింది అని పలువురు డ్రైవర్లు ప్రజా జ్యోతితో ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు కూడా ఈ దాడులను స్వాగతిస్తూ, ప్రజల కష్టార్జిత డబ్బును అధికార దోపిడీగా మార్చిన చెక్‌పోస్టు వ్యవస్థపై ఏసీబీ చేయివేసింది.. ఇకనైనా సక్రమమైన చెకింగ్ వ్యవస్థ రావాలి అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఏసీబీ అధికారులు చెక్‌పోస్టు రికార్డులు, సిబ్బంది వివరాలు సేకరిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్టు, పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడిస్తామని ఏసీబీ వర్గాలు తెలిపాయి.
Also Read: Onions: పచ్చి ఉల్లిపాయలు తినేవారు .. దీని గురించి తప్పక తెలుసుకోవాల్సిందే!
