Cigarette Boxes Robbery: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల కేంద్రంలోని జయలక్ష్మి ఏజెన్సీలో ఈనెల 11 న 18 లక్షల విలువ గల 20 సిగరెట్ బాక్సులు దొంగతనం అయ్యిందని అయిజ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అట్టి కేసును పోలీసులు చేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు(SP Srinivasa Rao) వెల్లడించారు. బాధితుడు వినయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అనంతరం అధికారులు నా దృష్టికి తేవడంతో డి.ఎస్.పి మొగులయ్య(DSP Mogulaiah) పర్యవేక్షణలో శాంతినగర్ సిఐ టాటా బాబు ఆధ్వర్యంలో ఐజ ఎస్ ఐ శ్రీనివాసరావు ప్రత్యేక క్రైమ్ స్పెషల్ టీం లను ఏర్పాటు చేసి వివిధ కోణాలలో దర్యాప్తు చేయగా నిందితులను రాయచూర్‌లో ఉన్నట్లు గుర్తించి, ఈ నెల 21 న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రతన్ లాల్ కేసులో ఏ వన్ గా ఉండగా ఎ 3. జగదీష్ లను అదుపులోకి తీసుకున్నారన్నారు. ఎ 2. బీర్బల్ బిస్నయ్ పరారీలో ఉన్నాడని, త్వరలో నిందితున్ని అదుపులోకి తీసుకుంటామన్నారు. రతన్ లాల్ , బీర్బల్ మంచి స్నేహితులని, బీర్బల్ జగదీష్ మామ అల్లుళ్ళవుతారన్నారు.
అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనే దురాశతో
అక్రమ మార్గంలో ఈజీ మనీ కోసం రాజస్థాన్‌కు చెందిన ఈ ముగ్గురు దొంగతనాలు చేయాలనే ఉద్దేశంతో బీర్బల్ పేరిట ఉన్న మారుతి సుజుకి ఎకో వ్యాన్ ను ఉపయోగిస్తూ బెల్గాం నుండి తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణానికి వచ్చారన్నారు. అక్కడ స్థానికంగా సిగరెట్ కాటన్ బాక్స్‌లను షాప్ లకు ఎక్కడి నుంచి సరఫరా చేస్తారో తెలుసుకున్నారన్నారు. జయలక్ష్మి ఏజెన్సీ నుండి సరఫరా జరుగుతుందని నిర్ధారించుకున్నారన్నారు. షాపు చుట్టుపక్కల ఎవరూ లేకపోవడాన్ని గమనించి దొంగతనం చేయడానికి అనువుగా ఉందని భావించి తిరిగి రాయచూరుకు వెళ్లిపోయారన్నారు. ఈనెల 11 న అర్ధరాత్రి ముగ్గురు జయలక్ష్మి ఏజెన్సీ వద్దకు చేరుకోగా కారులో బీర్బల్ ఉండి ఎవరైనా వస్తున్నారో గమనించారన్నారు.
Also Read: Forest Police Stations: భూముల ఆక్రమణ కాకుండా పకడ్బందీ ప్లాన్
ఒకేసారి అమ్మితే అనుమానం వస్తుందని
రతన్ లాల్ షాపు ముందున్న సీసీ కెమెరాల దిశను మార్చాడన్నాడు. తద్వారా వీడియోలో దొంగతనం నమోదు కాకుండా ప్రయత్నించాడన్నారు. ఆ తర్వాత బీర్బల్, జగదీష్ ఇద్దరు కలిసి షాపు పక్కనే ఉన్న ఇంటి తలుపుల తాళాలను ఇనుప రాడ్ సహాయంతో పగలగొట్టి లోపలికి ప్రవేశించారన్నారు. ఇంట్లోనే కిచెన్ రూమ్‌లో ఉన్న సిగరెట్ కాటన్ బాక్స్ లను తీసుకువచ్చి బీర్బల్ సహాయంతో కారులో లోడ్ చేశారన్నారు. అనంతరం అక్కడి నుంచి ఎరిగేర మార్గం ద్వారా రాయచూరుకు పరారయ్యారన్నారు. సరుకును ఒకేసారి అమ్మితే అనుమానం వస్తుందని భావనతో బీర్బల్ ఖర్చుల కోసం కొన్ని సిగరెట్ కాటన్ బాక్స్‌లో తీసుకువచ్చి విక్రయానికి ప్రయత్నించాడన్నారు. రాయచూర్‌లో మారుతి ఎకో కార్లో అనుమానస్పదంగా తిరుగుతుండడంతో పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నారన్నారు.
సిగరెట్ బాక్సులు ఎకో వ్యాన్ ఫోన్లు స్వాధీనం
దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి 15 లక్షల విలువ గల సిగరెట్లను, రెండు మొబైల్ ఫోన్లను, ఒక మారుతి ఏకో వ్యానును స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సిగరెట్ల దొంగతనం కేసులో ముగ్గురు దొంగతనానికి పాల్పడగా ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు, ఒకరు పరారిలో ఉన్నట్టు తెలిపారు. కేసును త్వరితగతిన చేధించిన పోలీసులను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు.
Also Read: Heavy Rains: తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక.. రెండ్రోజులు జర జాగ్రత్త