Woman panipuri Demand: పానీపూరీ అంటే కొంతమందికి చెప్పలేనంత ఇష్టం ఉంటుంది. మన దేశంలో చాలా ఫేమస్ అయిన ఈ స్ట్రీట్ ఫుడ్‌ను ప్రతిరోజూ తినేవారు కోట్ల సంఖ్యలోనే ఉంటారనడంలో అతిశయోక్తిలేదు. గుజరాత్‌లోని వడోదరలో కూడా పానీపూరీలకు వీరాభిమాని అయిన ఓ మహిళ ఉంది. రూ.20 పట్టుకొని పానీపూరీ తినడానికి వెళ్లింది. 6 పానీపూరీలు వస్తాయేమో ఎంచక్కా లాగించేయొచ్చు అని అనుకుంది. కానీ, స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి కేవలం 4 పానీపూరీలు మాత్రమే ఇవ్వడంతో ఆమె తీవ్ర నిరాశలో కూరుకుపోయింది.
తనకు ఆరు పానీపూరీలు రావాల్సి ఉండగా నాలుగు మాత్రమే ఇచ్చారంటూ (Woman panipuri Demand) భోరున విలపిస్తూ నడిరోడ్డుపై కూర్చొని నిరసన తెలిపింది. చివరకు పోలీసులు వచ్చి ఆమెను అక్కడి నుంచి తరలించాల్సి వచ్చింది.
మనదేశంలోని పలు ప్రధాన నగరాల్లో ట్రాఫిక్‌కు నిత్యం అవాంతరాలు ఎదురవుతూనే ఉంటాయి. రాజకీయ ర్యాలీలు, ఊరేగింపులు, బీభత్సమైన వర్షాలు, వరదలు ఇందుకు కారణం అవుతుంటాయి. అయితే, గుజరాత్‌లోని వడోదరలో ట్రాఫిక్‌ను అడ్డుకున్న కారణం పానీపూరీ తెలిసి వాహనదారులు షాక్‌కు గురయ్యారు.
వడోదర సిటీలోని సుర్‌సాగర్ లేక్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. రూ.20లకు రావాల్సిన పానీపూరీల కంటే తక్కువ ఇచ్చారంటూ రోడ్డుపై ఆమె బైఠాయించింది. ఆరు పూరీలు రావాల్సి ఉండగా, కేవలం నాలుగు మాత్రమే ఇచ్చారని ఆమె ఆరోపించింది. తనకు అన్యాయం జరిగిందంటూ భగ్గుమన్నది.
‘‘ఇంకా రెండు పానీపూరీలు కావాలి” అనే డిమాండ్‌తో నడిరోడ్డుపై కూర్చొని ధర్నా చేసింది. తన డిమాండ్ నెరవేర్చేవరకు అక్కడ నుంచి లేవబోనని తెగేసి చెప్పింది. దీంతో, ఆ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
రోడ్డుపై బైఠాయించిన ఆమెను చూసి పలువురు వాహనదారులు తమ వెహికల్స్ ఆపారు. పానీపూరీ కోసం ధర్నా చేస్తోందని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఆమెను చాలామంది వీడియోలు కూడా తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహిళ రోడ్డుపై కూర్చుని ఉండడం, ఏడవడం వీడియోలో కనిపించాయి. పలువురు వాహనదారులు ఆమెను జాగ్రత్తగా తప్పించుకొని ముందుకు వెళ్లాల్సి వచ్చింది. ఆమెను చూసేందుకు ఆగినవారి సంఖ్య కొన్ని నిమిషాల్లోనే పెరిగిపోయింది. ఒకవైపు ఫోన్లలో రికార్డ్ చేసేవారితో ఆ రోడ్డు బ్లాక్ అయింది. ఆఖరికి పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆ ప్రయత్నం కూడా మరింత నాటకీయంగా మారింది.
Read Also- Gadwal District: గద్వాలలో చెలరేగిపోతున్న ఆకతాయిలు.. పోలీసులను సైతం లెక్కచేయని రౌడీ మూకలు
పోలీసుల వద్ద కూడా సదరు మహిళ ఏడుస్తూ, “నాకు రూ.20కి ఆరు పానీపూరీలు కావాలి. అంతకుమించి ఇంకేమీ వద్దు” అంటూ అధికారుల్ని పట్టుబట్టింది. చివరికి, పోలీసులు ఆమెను అక్కడి నుంచి తరలించి రోడ్డుపై ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఇంతకీ ఆమె డిమాండ్ నెరవేరిందా?, లేదా? అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.