Virat -Rohit: టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ వచ్చే నెలలో భారత జట్టులో తిరిగి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నీ సెట్ అయితే ఆగస్టు నెలలో ఇద్దరూ బ్లూజెర్సీలో కనిపించే సూచనలు ఉన్నాయి. అయితే, ఇదంతా బీసీసీఐ చేతుల్లోనే ఆధారపడి ఉంది. ఇదే విషయమై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో బీసీసీఐ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. అన్నీ సానుకూలంగా జరిగితే, ఆగస్టులో శ్రీలంక జట్టుతో భారత జట్టు వన్డే సిరీస్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు బీసీసీఐ ముందు శ్రీలంక క్రికెట్ (SLC) బోర్డు ఒక ప్రతిపాదన పెట్టింది. ఈ ప్రతిపాదనకు అంగీకరించి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, రోహిత్, కోహ్లీ వన్డే జట్టులో కనిపించనున్నారు.
నిజానికి ఆగస్టు 17 నుంచి 31 వరకు టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అనూహ్యంగా ఆ పర్యటన రద్దు కావడంతో షెడ్యూల్‌లో ఖాళీ ఏర్పడింది. ఈ సమయంలో తమతో వన్డే సిరీస్ ఆడాలని బీసీసీఐని శ్రీలంక క్రికెట్ బోర్డు అభ్యర్థించింది. మొత్తం ఆరు మ్యాచ్‌లు ప్రతిపాదించగా, అందులో మూడు వన్డేలు, మూడు టీ20లు ఉన్నాయి. బంగ్లాదేశ్‌తో ఆడాల్సిన సంఖ్యలోనే శ్రీలంక ప్రతిపాదన చేసింది. కాగా, బంగ్లాదేశ్‌తో జరగాల్సిన వన్డే, టీ20 సిరీస్‌లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ప్రాంతీయ భద్రతా సమస్యలు, షెడ్యూల్ ఇబ్బందుల కారణంగా వాయిదా వేశారు.
Read Also- Viral News: రెజ్యూమ్ ఇలా కూడా తయారు చేస్తారా?.. షాక్‌లో కంపెనీ యజమానులు
ఇక, శ్రీలంక క్రికెట్ బోర్డు చేసిన ప్రతిపాదనపై బీసీసీఐ ఇంకా అధికారికంగా స్పందించలేదని అంతర్గత వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ సర్దుబాటు ఆసియా కప్‌తో ముడిపడి ఉన్నందున, దానిపై కీలక సంప్రదింపులు జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. ఆసియా కప్‌తో పాకిస్థాన్‌తో ఆడే విషయంపై కేంద్ర ప్రభుత్వ అనుమతిపై సందేహాలు నెలకొన్నాయి. శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రతిపాదన ఒకటి పెండింగ్‌లో ఉందని, దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తొలుత ఆసియా కప్ పరిస్థితి చూడాల్సి ఉందని, ప్రతిదీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉందని ఆయన పేర్కొన్నారు.
Read Also- Buck Moon 2025: మరికాసేపట్లో అద్భుతం ఆవిష్కృతం.. చూడకుంటే బాధపడాల్సిందే!
త్వరలోనే పునరాగమనం!
శ్రీలంక సిరీస్ ఖరారైతే ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ వన్డేల్లో మెరవడం ఖాయంగా కనిపిస్తోంది. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇద్దరూ టెస్ట్, టీ20 ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పారు. వన్డే ఫార్మాట్‌పై మాత్రమే ఇద్దరూ దృష్టి సారించారు. కాబట్టి, వన్డే ఫార్మాట్ మ్యాచ్‌లు జరిగినప్పుడు మాత్రమే ఇద్దరికీ కాల్ వస్తుంది. టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇంగ్లాండ్ టెస్ట్ పర్యటనలో ఆడడం లేదు. కాబట్టి, వన్డే మ్యాచ్‌ల షెడ్యూల్ ఖరారైతే ఇద్దరి పునరాగమనం సాధ్యమవుతుంది. ఆసియా కప్ ఉన్నందున శ్రీలంక టూర్ సాధ్యాసాధ్యాలపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో బీసీసీఐ సంప్రదింపులు జరుపుతోంది.