Viral News: ఓ గ్రామంలో ఒక ఆవు చనిపోయింది. ఆ విషయం తెలిసిన గ్రామస్థులు పొలోమంటూ సమీపంలోని హాస్పిటల్‌కు పరుగులు పెట్టారు. అదేంటి.. ఆవు చనిపోతే జనాలు ఆస్పత్రికి పరుగులు తీయడం ఏమిటి? అనే సందేహం వచ్చిందా?. అయితే, ఈ ఘటనకు (Viral News) సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే.
ఉత్తరప్రదేశ్‌లోని (Uttara Pradesh) బదౌన్ జిల్లా పిప్రౌలి గ్రామంలో ఆసక్తికరమైన ఘటన జరిగింది. ఆ గ్రామానికి చెందిన సుమారుగా 200 మంది ఒకేసారి గవర్నమెంట్ హాస్పిటల్‌కు వెళ్లారు. యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కోసం కావాలంటూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద పట్టుబట్టి మరీ ఒక్కో డోస్ చొప్పున తీసుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వీరిలో ఎవరినీ కుక్క కరవలేదు. అయితే, దీని వెనుక పెద్ద కారణమే ఉంది. డిసెంబర్ 23న ఆ గ్రామంలో జరిగిన ఒక అంత్యక్రియల సందర్భంగా భోజనాలు పెట్టగా, ఆ విందులో రైటా (పెరుగు పచ్చడి) తయారు చేసి వచ్చినవారికి వడ్డించారు. రేబిస్ వ్యాధి లక్షణాలతో ఇటీవలే ఒక గేదె చనిపోగా, అది మరణించడానికి కొన్ని రోజుల ముందు తీసిన దాని పాలను అంత్యక్రియల కార్యక్రమంలో రైటా తయారీకి వాడారు. దీంతో, గేదె రేబిస్‌తో చనిపోవడంతో, దాని వైరస్ పాల ద్వారా తమకు కూడా వ్యాపించి ఉండొచ్చనే ఆందోళన ఆ గ్రామస్థులను హాస్పిటల్‌కు పరిగెత్తేలా చేసింది. పిప్రౌలి గ్రామస్థుల భయాందోళనలను గమనించిన వైద్యాధికారులు వీకెండ్‌లో కూడా ఆరోగ్య కేంద్రాన్ని తెరిచి ఉంటారు. మరిగించిన పాల ద్వారా రేబిస్ వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువంటూ గ్రామస్థులకు ధైర్యం చెప్పారు.
Read Also- January Bank Holidays: జనవరిలో భారీగా బ్యాంక్ హాలిడేస్.. ముందే జాగ్రత్త పడండి మరి.. తేదీలు ఇవే
పాల ద్వారా రేబిస్ వ్యాపిస్తుందా?
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనతో.. రేబిస్ వ్యాధి సోకిన జంతువుల పాలు తాగితే, మనుసులకు కూడా వ్యాపి చెందుతుందా? అనే ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది. అయితే, గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న అధ్యయనాల ప్రకారం, రేబిస్ వైరస్ తీరు చాలా విభిన్నంగా ఉన్నట్టు గుర్తించారు. బ్లడ్, మాంసం, ఇతర శరీర ద్రవాల ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్ల కంటే రేబిస్ వైరస్ చాలా భిన్నంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రేబిస్ వ్యాధి న్యూరోట్రోపిక్ (neurotropic) వైరస్ అని, ఇది ప్రధానంగా నరాల ద్వారా ప్రయాణిస్తుందని, కానీ, రక్తప్రవాహం ద్వారా మాత్రం ప్రయాణించదని నిపుణులు అంటున్నారు. అందుకే, రేబిస్ వైరస్ సోకిన జంతువు మెదడు, లాలాజల గ్రంథులలో ఎక్కువగా వైరస్ కేంద్రీకృతమై ఉంటుందని అంటున్నారు. ఇక, పొదుగు వంటి అవయవాలలో వైరస్ ఉండదని చెబుతున్నారు. పాలు తయారయ్యే గ్రంథులలోకి రేబిస్ వైరస్ సహజంగా ప్రవేశించే అవకాశంలేదని పలు వైద్య పరిశోధనలు చెబుతున్నాయి.
Read Also- The Raja Saab Trailer: ‘ది రాజా సాబ్’ ట్రైలర్ 2.ఓ వచ్చేసింది. ఇది కదా కావాల్సింది!
చికిత్స అవసరం లేదు!
మన దేశానికి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) కూడా పాల ద్వారా రేబిస్ వ్యాపించదని చెబుతోంది. పాలు, పాలతో తయారైన ఉత్పత్తులను తినడం వల్ల రేబిస్ వ్యాపించినట్లుగా ఎలాంటి ప్రయోగశాల ఆధారాలు, ఎపిడెమియోలాజికల్ ఆధారాలు లేవని ఈ సంస్థ స్పష్టం చేసింది. వ్యాధి సోకిన జంతువు పాలు తాగినంత మాత్రాన రేబిస్ వ్యాధికి చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదని గతంలోనే క్లారిటీ ఇచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఇదే చెబుతోంది. పాల నుంచి రేబిస్ వైరస్ ఎప్పుడూ వేరు కాలేదని, అలాగే పచ్చి పాలు తాగినంత మాత్రాన మనుషులకు రేబిస్ వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక రిపోర్టులో పేర్కొంది.

