Wife Marriage: భార్య మనసుకు నచ్చిన వ్యక్తితో స్వయంగా భర్తే దగ్గరుండి పెళ్లి చేయించిన పలు ఆసక్తికర ఘటనలు ఈ మధ్య కాలంలో వెలుగుచూశాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి తెరపైకి వచ్చింది. ఏకంగా 15 ఏళ్లుగా సంసారం చేస్తున్న తన భార్యను ఓ వ్యక్తి.. తాము నివాసం ఉంటున్న గ్రామానికే చెందిన మరో వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఉత్తరప్రదేశ్‌లోని గొండా జిల్లా ఖోడారే స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
భార్య కరిష్మా (36 ఏళ్లు), అదే గ్రామానికి చెందిన శివరాజ్ చౌహాన్ అనే పరాయి వ్యక్తితో సన్నిహితంగా ఉన్న సమయంలో భర్త హరిశ్చంద్ర (42 ఏళ్లు) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. మంగళవారం ఇద్దరినీ పట్టుకోగా గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించారు. అక్కడ వాదులాట జరగడంతో ఎలాంటి పరిష్కారం లభించలేదు. దీంతో, గురువారం సాయంత్రం భార్య కరిష్మా, శివరాజ్‌ను స్థానికంగా ఉన్న ఒక ఆలయానికి తీసుకెళ్లిన హరిశ్చంద్ర దగ్గరుండి వివాహం జరిపించాడు. హరిశ్చంద్ర చూస్తుండగా పూజారి సమక్షంలో పెళ్లి జరిగింది. భార్య నుదుటిపై సిందూరాన్ని కడగడాన్ని, ఆమె మరో వ్యక్తితో దండలు మార్చుకోవడాన్ని హరిశ్చంద్ర ప్రత్యక్షంగా చూశాడని స్థానికులు తెలిపారు.
Read this- Rishabh Pant: పంత్ సెన్సేషనల్ బ్యాటింగ్.. ధోనీ రికార్డులు బద్దలు
విషమిచ్చి చంపేందుకు ప్రయత్నం!
కరిష్మాతో 15 ఏళ్లుగా సంసారం చేస్తున్నప్పటికీ, ఇకపై ఆమెతో సంబంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నట్టు హరిశ్చంద్ర వెల్లడించాడు. కరిష్మా తనకు విషం ఇచ్చి చంపేందుకు ప్రయత్నించిందని వాపోయాడు. తన కొడుకుకు కూడా మాదకద్రవ్యాలు (డ్రగ్స్) ఇచ్చేందుకు ప్రయత్నించిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ధాన్ని తెగదెంచుకోవాలనే ఉద్దేశంతోనే పెళ్లి చేశానని పేర్కొన్నాడు. సుదీర్ఘ పంచాయితీ జరిగినప్పటికీ అక్కడ పరిష్కారం లభించలేదని ఆయన వివరించాడు.
నేను ఏ తప్పూ చేయలేదు
ఈ మొత్తం వ్యవహారం తనపై బలవంతంగా రుద్దారని కరిష్మా చెబుతోంది. భర్తతో తనకు నిరంతరం ఘర్షణలు జరుగుతున్న విషయం నిజమేనని, అయితే, శివరాజ్‌తో తనకు ఎలాంటి సంబంధంలో లేదని పేర్కొంది. తనపై వచ్చినవన్నీ ఆరోపణలేనని ఆమె చెప్పింది. బలవంతంగా తనకు వివాహం చేశారని ఆమె పేర్కొన్నారు.
Read this- Viral News: కోడలు పారిపోయిందన్నారు.. దర్యాప్తులో సంచలనం!
ఈ ఘటనపై ఖోడారే స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) ప్రబోధ్ కుమార్ స్పందించారు. ఇరు పక్షాల నుంచీ ఇప్పటివరకు అధికారిక ఫిర్యాదు అందలేదని తెలిపారు. అయితే, ఫిర్యాదు అందితే సమగ్ర దర్యాప్తు జరిపి, తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా, హరిశ్చంద్ర, కరిష్మా పెళ్లి జరిగి 15 ఏళ్లు అయ్యింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆలయంలో పెళ్లి జరిగిన తర్వాత, కరిష్మా కుమార్తెను తనతో తీసుకెళ్లిందని, వారి కొడుకు హరిశ్చంద్ర వద్దే ఉన్నాడని స్థానికులు తెలిపారు. కరిష్మాతో ఇకపై తనకు ఎలాంటి సంబంధం అక్కర్లేదని హరిశ్చంద్ర స్పష్టం చేశారు.