UPSC Aspirant: జార్ఖండ్ రాష్ట్రంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. గత ఏడేళ్లుగా ఐఏఎస్ (IAS) అని చెప్పుకొని తిరుగుతున్న మోసగాడ్ని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. తమదైన శైలిలో నకిలీ అధికారిని ప్రశ్నించగా.. అతడు చెప్పిన సమాధానాలు విని దర్యాప్తు అధికారులు సైతం అవాక్కయ్యారు. తాను యూపీఎస్సీ పరీక్ష (UPSC Aspirant)ల్లో ఫెయిల్ అయ్యానని, తన తండ్రి కోరిక తీర్చేందుకు ఇలా నకిలీ ఐఏఎస్ అవతారమెత్తానని పేర్కొన్నాడు.
వివరాల్లోకి వెళ్తే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడ్ని 35 ఏళ్ల రాజేశ్ కుమార్ (Rajesh Kumar)గా గుర్తించారు. తొలుత రాజేశ్.. జార్ఖండ్ లోని పాలము జిల్లా (Palamu District) హుస్సేనాబాద్ పోలీస్ స్టేషన్ (Hussainabad Police Station)కు వెళ్లాడు. తాను 2014 బ్యాచ్ ఒడిశా కేడర్ కు చెందిన ఐఏఎస్ (IAS) అధికారినని అక్కడి పోలీసు అధికారికి చెప్పాడు. భువనేశ్వర్ లో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నట్లు నమ్మించాడు. ప్రస్తుతం సెలవుల్లో ఉన్నానని, బంధువుతో ఉన్న ఓ భూ వివాదంలో తనకు సాయం చేయాలని కోరారు.
నిజమేనని నమ్మి..
హుస్సేనాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ సోను కుమార్ దీని గురించి మాట్లాడుతూ తొలుత రాజేశ్ కుమార్ చెప్పినదంతా నిజమేనని భావించినట్లు చెప్పారు. ఐఏఎస్ అధికారికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ను పాటించినట్లు తెలిపారు. మాటల మధ్యలో తాను ఒడిశా కేడర్ కు చెందిన అధికారి అని చెబుతూనే హైదరాబాద్, డెహ్రాడూన్ లో కూడా పనిచేసినట్లు రాజేష్ చెప్పాడు. దీంతో తనకు అనుమానం వచ్చిందని.. రాజేష్ వెళ్లిన వెంటనే సీనియర్ అధికారులకు సమాచారం చేరవేశానని ఇన్ స్పెక్టర్ స్పష్టం చేశారు. సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) స్థాయిలో దీనిపై దర్యాప్తు చేయగా.. అతడు చెప్పినవన్నీ అబద్దాలేనని నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు.
Also Read: Indian Railways: గుడ్ న్యూస్.. వందే భారత్ స్లీపర్‌లో.. నోరూరించే ప్రాంతీయ వంటకాలు!
నకిలీ ఐఏఎస్ అరెస్టు..
ఐఏఎస్ అని అబద్దాలు చెప్పిన రాజేశ్ ను సమీప ప్రాంతంలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. తదుపరి విచారణలో రాజేష్ తన తప్పును అంగీకరించినట్లు పేర్కొన్నారు. నిందితుడి వాంగ్మూలం ప్రకారం.. తన గ్రామంతో పాటు చుట్టు పక్కల ఏరియాల్లో ఐఏఎస్ గా రాజేష్ చెప్పుకొని తిరిగాడు. వాస్తవానికి రాజేష్ యూపీఎస్సీ సివిల్స్ పరీక్షను 4 సార్లు రాశాడు. అందులో ఒకసారి ప్రిలిమినరీ క్లియర్ చేసి.. మెయిన్స్ కు సైతం వెళ్లాడు. తీరా పరీక్షల్లో విఫలమవడంతో ఐఏఎస్ అవ్వాలన్న అతడి తండ్రి కల నీరుగారిపోయింది. దీంతో ఎలాగైనా తన తండ్రి కోరికను నెరవేర్చాలన్న ఉద్దేశంతో ఇలా నకిలీ ఐఏఎస్ అవతారమెత్తాడు. ప్రస్తుతం అతడ్ని అరెస్టు చేసిన పోలీసులు.. రిమాండ్ కు తరలించారు. ఐఏఎస్ అని చెప్పుకొని అతడు చేసిన మోసాల గురించి ఆరా తీస్తున్నట్లు విచారణాధికారి తెలిపారు.
#IAS की परीक्षा में चार बार शामिल हुआ, लेकिन सफल नहीं हो सका।
परिवार और समाज के सामने "नाकामी का ठप्पा" लगने से बचने के लिए फर्जी अधिकारी बनने का नाटक शुरू किया।
घटना पलामू की है जहां राजेश नाम का व्यक्ति पिछले कई वर्षों से फर्जी आईकार्ड और 'भारत सरकार' लिखी कार लेकर घूम रहा… pic.twitter.com/iQ5YggGXef
— NEERAJ PANDEY (@NeerajPaandey) January 3, 2026

