UP Maharajganj: ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ కలెక్టర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. విద్యాశాఖ అధికారులతో మహారాజ్ గంజ్ జిల్లా కలెక్టర్ నిర్వహించిన ఆన్ లైన్ మీటింగ్ లో అశ్లీల వీడియోలు కలకలం సృష్టించాయి. గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా మీటింగ్ లోకి ప్రవేశించి అసభ్యకర వీడియోలతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
మహారాజ్‌గంజ్ జిల్లా కలెక్టర్ (Maharajganj district magistrate) సంతోష్ కుమార్ శర్మ (Santosh Kumar Sharma).. జిల్లాకు చెందిన ప్రాథమిక విద్యాధికారి, బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, హెడ్‌మాస్టర్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులతో ఆన్ లైన్ సమావేశం నిర్వహించారు. పాఠశాలలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు నేరుగా కలెక్టర్‌తో మాట్లాడేలా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశం జరుగుతున్న సమయంలో ‘జేసన్ జూనియర్’ (Jason Junior) అనే పేరుతో లాగిన్ అయిన వ్యక్తి.. తన స్క్రీన్‌ను షేర్ చేసి అసభ్యకర వీడియోను ప్రదర్శించాడు. దీంతో అవాక్కైన అధికారులు.. సమావేశం నుంచి ఎగ్జిట్ అయ్యారు. మరోవైపు ‘అర్జున్’ (Arjun) పేరుతో పాల్గొన్న ఓ వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు అధికారులు తెలిపారు.
రంగంలోకి పోలీసులు…
ప్రాథమిక విద్యాధికారి రిద్ధి పాండే (Riddhi Pandey) ఆదేశాల మేరకు ఫరెండా బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సుదామా ప్రసాద్ (Sudama Prasad).. మహారాజ్‌గంజ్ కోట్వాలి పోలీస్ స్టేషన్ (Kotwali police station)లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. దీనిపై కోట్వాలి ఎస్‌హెచ్ఓ (SHO) సత్యేంద్ర రాయ్ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ నిపుణుల (Cyber Crime Experts) సహాయంతో దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. BNS సెక్షన్ 221 (ప్రభుత్వ ఉద్యోగి పనిని అడ్డుకోవడం), 352 (ఉద్దేశపూర్వక అవమానం), IT యాక్ట్ 2000లోని 67A సెక్షన్ (ఎలక్ట్రానిక్ రూపంలో అసభ్యకర కంటెంట్ ప్రసారం) కింద కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.
Also Read: Kazana jewellers Robbery: హైదరాబాద్‌లో బరితెగించిన దోపిడి ముఠా.. జ్యువెలరీ షాపులో కాల్పులు!
కలెక్టర్ ఆఫీసు స్పందన ఇదే!
‘తాము సాంకేతిక పద్ధతులతో నిందితులను గుర్తిస్తున్నాం. ఈ సంఘటన ఒక పరిపాలనా సమావేశాన్ని మాత్రమే కాకుండా సైబర్ నేరాన్ని కూడా సూచిస్తోంది. నిందితులను గుర్తించి, తగిన చర్య తీసుకుంటాం’ అని ఎస్‌హెచ్ఓ సత్యేంద్ర రాయ్ (Satyendra Rai) హామీ ఇచ్చారు. మరోవైపు ఈ ఘటనపై కలెక్టర్ కార్యాలయం సైతం స్పందించింది. దీనిని పరిపాలనా మర్యాదల ఉల్లంఘనగా.. అలాగే సైబర్ నేరంగా అభివర్ణించింది. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని.. పరిపాలనా సమావేశాల గౌరవాన్ని కాపాడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.