Guinness Record: మార్షల్ ఆర్ట్స్ స్పెషలిస్ట్ విస్పీ ఖరాడీ (Vispy Kharadi).. ఇండియన్ స్టీల్ మ్యాన్ గా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అయితే తనకున్న శక్తిని ప్రదర్శించి.. ఆయన యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఏకంగా గిన్నిస్ రికార్డు సాధించి దేశం గర్వపడేలా చేశారు. గిన్నిస్ బుక్ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం.. విస్పీ ఖరాడీ 261 కిలోల బరువున్న హెర్క్యులీస్ పిలర్స్ ఛాలెంజ్ (Hercules Pillars challenge)లో విజయం సాధించారు.
వివరాల్లోకి వెళ్తే..
గిన్నిస్ బుక్ నిర్వాహకుల ప్రకారం.. 2025 ఆగస్టు 17న ఈ ఛాలెంజ్ జరిగింది. పంజాబ్ లోని అటారీ సరిహద్దుల్లో ఇండియన్ స్టీల్ మ్యాన్ కు ఈ కఠిన పరీక్షను నిర్వహించారు. ఒక ధ్రువపు ఎలుగుబంటి (Polar bear) బరువులో దాదాపు సగం ఉన్న ఒక్కో పిల్లర్ ను రెండు చేతులతో చేరొక వైపు పడిపోకుండా విస్పీ ఖరాడీ పట్టుకున్నారు. వాటి బరువు దాదాపు 261 కేజీలు (575.4 పౌండ్లు) కావడం గమనార్హం. వేలాది మంది చూస్తుండగా దాదాపు 67 సెకన్ల పాటు ఖరాడీ వాటిని పడిపోకుండా నియంత్రించాడు. తద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు (Guinness World Record)లో చోటు దక్కించుకున్నాడు.
17వ గిన్నిస్ రికార్డు
కాగా తాను సాధించిన ఈ ఘనతను భారత సైన్యానికి అంకితం చేస్తున్నట్లు విస్పీ ఖరాడీ ప్రకటించారు. తనను ప్రోత్సహించిన శిహాన్, హాన్షి గురువులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు ఇది తనకు లభించిన 17వ గిన్నిస్ వరల్డ్ రికార్డు అని చెప్పుకొచ్చారు. గతేడాది నవంబరులో ఆయన 166.7 కిలోలు, 168.9 కిలోల బరువు కలిగిన హెర్క్యులీస్ పిల్లర్లను 2 నిమిషాల 10 సెకన్ల పాటు పట్టుకొని గిన్నిస్ రికార్డ్ సాధించాడు.
Also Read: Harish Rao: సీఎం రేవంత్ కరెక్టా?.. మంత్రి ఉత్తమ్ కరెక్టా?.. హరీశ్ రావు సూటి ప్రశ్నలు!
మెడతో 21 ఇనుప రాడ్లు వంచి..
2019లో విస్పీ ఖరాడీ మరో రికార్డు సృష్టించాడు. తన మెడ సాయంతో ఒక నిమిషంలో 21 ఇనుపరాడ్లను ఆయన అలవోకగా వంచాడు. 2022లో గోమేధిక కడ్డీ (bed of nails)పై 528 కిలోల కాంక్రీట్‌ను పగులగొట్టడం.. 2025లో తన శరీరంపై దాదాపు జిరాఫీ బరువుతో సమానమైన 1,819 కిలోలు భరించడం చేశాడు. సాధారణ మానవులకు సాధ్యం కానీ సాహసాలను ఏంతో తేలిగ్గా చేసేస్తూ చాలా మందికి విస్పీ ప్రేరణగా నిలుస్తున్నారు. ఆయన్ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానిస్తుండటం విశేషం.