Harish Rao: కృష్ణాజలాల్లో 299 టీఎంసీల వాటాను ఒప్పుకుందే కాంగ్రెస్ ప్రభుత్వం అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. కృష్ణా జలాల్లో వాటాపై మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మల్లా పాత పాటే పాడిండు అని ఆరోపించారు. బుధవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ఉత్తమ్ కు బేసిన్ల గురించి బేసిక్స్ తెల్వదు, నీళ్ల వాటా గురించి నీళ్లు నములుతారని అన్నారు. కనీస అవగాహన లేని, తెలంగాణ సోయి లేని వ్యక్తి నీళ్ల మంత్రి కావడం మన దౌర్భాగ్యం అన్నారు. కృష్ణా జలాల్లో 763 టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్ చేశామని గొప్పగా చెప్పిండని, రైట్ షేర్ కోసం నేనే స్వయంగా ట్రిబ్యునల్ ముందు అటెండ్ అయినట్లు చెప్పుకున్నాడన్నారు.
‘పరువు తీస్తున్నారు’
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏడాది జూన్ 18న కృష్ణా బేసిన్ మీద 500 టీఎంసీలకు బ్లాంకెట్ ఎన్ ఓ సీ ఇవ్వండి, ఆ తర్వాత ఏ ప్రాజెక్టులైన కట్టుకోండి అని చంద్రబాబుకు ఆఫర్ ఇచ్చారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ‘సెప్టెంబర్ 13న జరిగిన నీటి పారుదల శాఖ సమీక్షలో ఇదే ముఖ్యమంత్రి.. కృష్ణా జలాల్లో 904 టీఎంసీల వాటా సాధించి తీరాలె అంటడు. ఉత్తం ఏమో 763 టిఎంసీల రైట్ షేర్ అంటడు. ముఖ్యమంత్రి ఏమో ఓ సారి 500 టీఎంసీ అంటడు. ఓసారి 904 టీఎంసీలు అంటడు. పూటకో మాట మాట్లాడి పరువు తీసుకొంటున్నారన్నారు’ అని హరీశ్ రావు ఆరోపించారు.
‘కనీస అవగాహన లేదు’
వీళ్ల అజ్ఞానం వల్ల తెలంగాణ రాష్ట్రం హక్కుగా రావాల్సిన నీటి వాటాను కోల్పోయే పరిస్థితి ఉందని హరీశ్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి చెప్పింది కరెక్టా? లేదా నీళ్ల మంత్రి చెప్పింది కరెక్టా? అసలు ఎవరిది కరెక్టు? అని నిలదీశారు. ‘కనీస అవగాహన లేకుండా ఎట్ల మాట్లాడుతున్నారు. కనీసం ప్రిపరేషన్ లేకుండా ఇలా ఎన్నాళ్లు ఉంటారు. కేసీఆర్ కృష్ణా జలాల్లో రైట్ ఫుల్ షేర్ సాధించేందుకు సెక్షన్ 3 కోసం పోరాటం చేశారు’ అని హరీశ్ రావు అన్నారు. సుప్రీం కోర్టు గడప తొక్కి, నిర్విరామ పోరాటం చేసి సెక్షన్ 3 సాధించారన్నారు.
పూటకో మాట ఘడియకో లెక్క.
763 టీఎంసీలు అనేది కేసీఆర్ పట్టుబట్టిన విషయమని, ఇప్పుడు తామేదో కొత్తగా 763 టీఎంసీలు డిమాండ్ చేసినట్లు.. ఉత్తం డబ్బా కొడుతున్నాడని హరీశ్ రావు మండిపడ్డారు. ‘ఇప్పుడు వీళ్లు ఓసారి 500, ఓసారి 763, ఓసారి 904 టీఎంసీలు మా వాటా అంటున్నారని పూటకో మాట ఘడియకో లెక్క. ఒక బాధ్యత లేదు, రాష్ట్రం మీద ప్రేమ లేదు. నీటి ప్రయోజనాలు పట్టడం లేదు’ అని హరీశ్ రావు దుయ్యబట్టారు.
ద్రోహం చేసిందే కాంగ్రెస్: హరీశ్
ఏపీ తెలంగాణకు 299:512 గా నీటి పంపిణిని విభజించి ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణకు తీరని చారిత్రక ద్రోహం చేసింది కాంగ్రెస్ అని మండిపడ్డారు. 2013అక్టోబర్ 18న ఉమ్మడి ఏపీ జస్టిస్ శ్రీ కృష్ణ కమిటికి రిపోర్టు ఇచ్చింది. ఇదే రిపోర్టును శాసనసభలోనూ పెట్టారు.. తెలంగాణకు కృష్ణాలో 299, ఏపీకి 512 ఇచ్చినం అని అందులో క్లియర్ గా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రాంత హక్కులకు ఉమ్మడి రాష్ట్రంలోనే మరణ శాసనం రాసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. 2015 జున్ 26లో చేసుకున్న అగ్రిమెంట్ తాత్కాలిక ఒప్పందం అని లేఖలో స్పష్టంగా ఉంది.. ఇప్పుడున్న మీ అడ్వైజర్ ఆదిత్యానాథ్ కూడా అందులో సంతకం పెట్టారన్నారు. కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ పెట్టిందని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. ఆల్మట్టి హైట్ పెంపు పై ఎందుకు మౌనం అని ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్ కలిసి చేస్తున్న ద్రోహం ఇదని మండిపడ్డారు.
Also Read: Foreign Cars Smuggling Case: లగ్జరీ కార్ల స్మగ్లింగ్.. తెరపైకి కేటీఆర్ పేరు.. లిస్టులో అందరూ ప్రముఖులే!
‘ఆల్మట్టి ఎత్తు పెంచితే ఏం చేస్తున్నారు?
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాస్తుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి, బీహార్ కు వెళ్లి రాజకీయాలు చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచాలని కర్ణాటక మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. కేవలం 100 టీఎంసీల కోసమే ఆల్మట్టి ఎత్తు పెంచడం లేదని కృష్ణా జలాల్లోని తెలంగాణ హక్కును బొందపెట్టి ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డిలను ఎడారులుగా మార్చేందుకు కర్ణాటక కాంగ్రెస్ పన్నుతున్న కుట్ర ఇది అని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ పార్టీకి జాతీయ విధానమే లేదన్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని, ఇక్కడి రైతులను బలిస్తారా? అని ప్రశ్నించారు.