Off beat News: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘స్నాప్‌చాట్’లో (Snapchat) వైరల్‌గా మారిన ఒక వీడియో ఓ యువకుడి అరెస్టు వరకు దారితీసింది. ఒక పదునైన కత్తితో షార్క్‌ను పదేపదే పొడుస్తున్న వీడియో వైరల్‌గా (Viral Video) మారి, అదికాస్త పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో, జంతు హింస చట్టాల కింద నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది.
నిందిత యువకుడి పేరు జేన్ గారెట్ అని, అతడి వయసు 26 సంవత్సరాలని పోలీసులు వెల్లడించారు. గత నెల చివరిలో వీడియో ఫుటేజీని పోస్ట్ చేశాడని, తీవ్రమైన జంతు హింసకు పాల్పడడంతో కేసు నమోదు చేశామని వివరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మే 22న కీ వెస్ట్ తీరంలో నౌక శిథిలమైన ప్రదేశంలో ఈ ఘటన జరిగిందని గుర్తించారు. “బడ్ బ్రోక్ మై రాడ్’’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేశాడు. భారీ షార్క్‌ను జేన్ గారెట్ పదేపదే పొడిచి చంపినట్టు వీడియోలో కనిపించింది. జనాలకు హాని కలిగిస్తుందనే ఆందోళనతో షార్క్‌ను చంపానంటూ ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ కన్సర్వేషన్ కమిషన్‌కు కూడా నిందితుడు తెలియజేశాడు.
Read this- Viral News: భార్య తల, మొండాన్ని వేరు చేసి.. భర్త కిరాతకం
‘సెకండ్ నేచర్ చార్టర్స్’ అనే వెబ్‌సైట్‌లో తాను బోట్ కెప్టెన్ అని, టిప్‌స్టర్ అని గారెట్ పేర్కొన్నాడు. నేరానికి పాల్పడ్డట్టు ఒప్పుకున్నాడు. 9-11 అంగుళాల పొడవున్న పదునైన ఆయుధంతో పొడిచి చంపానని తెలిపాడు. తనది హింసాత్మక ప్రవర్తనే కాదనను, కానీ, జనాలకు అపాయం జరగక ముందే చంపాలని భావించానని చెప్పాడు.
లైసెన్స్ కూడా లేదు
బోట్ కెప్టెన్‌గా గారెట్‌కు సరైన లైసెన్స్ కూడా లేదని పోలీసులు గుర్తించారు. గతంలో కూడా ఇదే విధంగా తన ఐటెంటినీ తప్పుగా చూపించాడని, ఆ వ్యవహారం కూడా దర్యాప్తులో ఉందని అధికారులు పేర్కొన్నారు. షార్క్‌పై దాడి చేస్తున్న వీడియోను తొలుత పోస్ట్ చేసింది గారెట్ అని పోలీసు అధికారులు ధృవీకరించారు. సముద్రంలో తమ వేటకు అడ్డురాకుండా షార్క్‌లను పొడిచి చంపడం మత్స్యకారుల ఎత్తుగడ అని, తద్వారా మిగతా షార్కులను భయపెడతారని పేర్కొన్నాడు. షార్క్ తన చేపలను దొంగిలించి, ఇబ్బంది పెట్టిందని, అందుకు ప్రతీకారంతో దానిని చంపానని చెప్పాడని తెలిపారు. షార్క్‌ను తలపై పొడిచి చంపడం కాస్త శ్రమతో కూడుకున్నదని, అందుకే పదేపదే పొట్టపై పొడిచినట్టు ఒప్పుకున్నాడన్నారు.
Read this- Election Commission: రాహుల్ గాంధీపై ఎలక్షన్ కమిషన్ ఫుల్ సీరియస్
గతంలో కూడా తాను చాలా షార్క్‌లను చంపినట్టు గారెట్ అంగీకరించాడు. చాలా చంపానని, తుపాకీలు ఉపయోగించి చంపానని పేర్కొన్నాడు. కాగా, ఇది అత్యంత దారుణమైన చర్య అని ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కమిషన్ అభివర్ణించింది. జంతువుకు అనవసరంగా హాని కలిగించినట్టు విచారం వ్యక్తం చేసింది. గారెట్ ప్రస్తుతం 10 వేల డాలర్ల వ్యక్తిగత పూచికత్తుతో బెయిలుపై ఉన్నాడు. జూన్ 26న కేసు విచారణ జరగనుంది.