Sehwag Son: ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో (DPL 2025) నవతరం ఆటగాళ్లకు అవకాశాలు లభిస్తున్నాయి. డీపీఎల్ వేలంలో టీమిండియా దిగ్గజ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పెద్ద కొడుకు, భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మేనల్లుడితో పాటు పలువురు యువకులు అవకాశాలు దక్కించుకున్నారు. సెహ్వాగ్ పెద్ద కొడుకు ఆర్యవీర్‌ను సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ ఏకంగా రూ. 8 లక్షల భారీ ధర వెచ్చించి దక్కించుకుంది. ఆర్యవీర్ ప్రస్తుత వయసు 18 సంవత్సరాలు కాగా, ప్రస్తుతం ఢిల్లీ అండర్-19 టీమ్‌కు ఆడుతున్నాడు. సెహ్వాగ్ మాదిరిగానే ఆర్యవీర్ కూడా ఓపెన్ బ్యాటర్. పవర్‌ఫుల్ హిట్టింగ్ చేయగల సామర్థ్యం ఉన్న అతడి కోసం వేలంలో పలు జట్లు పోటీ పడ్డాయి. చివరకు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ జట్టు ఆర్యవీర్‌ను సొంతం చేసుకుంది.
లక్ష పలికిన కోహ్లీ మేనల్లుడు
మరోవైపు, విరాట్ కోహ్లీ మేనల్లుడు ఆర్యవీర్‌ను రూ.1 లక్ష మొత్తంతో గతేడాది డీపీఎల్ రన్నరప్ అయిన సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ కొనుగోలు చేసింది. సెహ్వాగ్ పెద్ద కొడుకు పేరు, కోహ్లీ మేనల్లుడి పేరు ఆర్యవీర్ కావడం యాదృచ్ఛికం.
కోహ్లీ మేనల్లుడు ఆర్యవీర్ లెగ్ స్పిన్నర్. పొదుపు బౌలింగ్ చేస్తూ వికెట్లు తీయగల సామర్థ్యం ఉంది. ఆర్యవీర్‌ను కొనుగోలు చేసిన ‘సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్’ జట్టుకు ఢిల్లీ రంజీ ట్రోఫీ కెప్టెన్, లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ ప్లేయర్ ఆయుష్ బదోని నాయకత్వం వహిస్తున్నాడు.
Read Also- Heart Diseases: గుండె వ్యాధులకు అసలు కారణాలు ఇవేనని మీకు తెలుసా?
రూ.39 లక్షలు పలికిన ఫాస్ట్ బౌలర్
డీపీఎల్ 2025 వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా యువ పేసర్ సిమర్జీత్ సింగ్ (Simarjeet Singh) నిలిచాడు. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ జట్టు ఈ బౌలర్‌ను దక్కించుకుంది. ఇందుకోసం ఏకంగా రూ.39 లక్షలు వెచ్చింది. ఎన్ని జట్లు పోటీ పడినా అస్సలు వెనక్కి తగ్గకుండా తీసుకుంది. సిమర్జీత్ సింగ్ తర్వాత, మిస్టరీ స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న దిగ్వేష్ సింగ్ రెండవ అత్యధిక ధర పలికాడు. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్ జట్టు అతడిని రూ.38 లక్షలకు దక్కించుకుంది. ఇక, ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2024 ఎడిషన్ సెమీ-ఫైనలిస్ట్ అయిన ‘పురాని దిల్లీ 6’ టీమిండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్‌ను నిలుపుకుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. వేలానికి ముందు రిటెయిన్ చేసుకుంటున్నట్టు తెలిపింది.
Read Also- Viral News: బెంగళూరులో వింత పరిస్థితి.. ఆఫీసులు మూసివేయాలంటూ డిమాండ్లు
డీపీఎల్ 2024లో ‘పురాని దిల్లీ 6’ టీమ్ అద్భుత ప్రదర్శన చేసింది. లీగ్ దశలో అదరగొట్టింది. అయితే, దురదృష్టం వెంటాడి వర్షం కారణంగా సెమీ-ఫైనల్ మ్యాచ్ రద్దు కావడంతో ఫైనల్ చేరే దారులు మూసుకుపోయాయి. దీంతో, 2025 సీజన్‌లో ఎలాగని టైటిల్ సాధించిన గట్టి పట్టుదలతో ఉంది. అందుకోసం టీమ్ పటిష్టంగా తయారు చేయాలని యాజమాన్యం భావిస్తోంది. డీపీఎల్‌లో ‘పురాని ఢిల్లీ 6’ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించడంపై హర్షం వ్యక్తం చేస్తూ రిషబ్ పంత్ గతంలో ఒకసారి మాట్లాడాడు. యువత తమ ప్రతిభ, నైపుణ్యాలను ప్రదర్శించడానికి డీపీఎల్ అద్భుతమైన వేదికగా అని మెచ్చుకున్నాడు. డీపీఎల్ ద్వారా దక్కే అవకాశాలను చాలామంది ఉపయోగించుకుంటారని, దిగ్వేష్ రతి, ప్రియాంష్ ఆర్య ఈ కోవకే చెందుతారని పేర్కొన్నాడు.