Rath Yatra: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. గోల్‌వాడ ప్రాంతంలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. మొత్తం 18 గజరాజుల ఊరేగింపు జరుగుతుండగా, ఓ ఏనుగు అకస్మాత్తుగా భక్తులపైకి దూసుకెళ్లింది. దీంతో, కాసేపు తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ పరిణామంతో ఆ ప్రాంతంలో స్వల్ప తొక్కిసలాటకు దారితీసింది. తొమ్మిది మంది భక్తులు గాయపడినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. బీభత్సం సృష్టించింది మగ ఏనుగుగా గుర్తించారు. ఈ ఘటనపై కమ్లా నెహ్రూ జువాలజికల్ గార్డెన్ సూపరింటెండెంట్ ఆర్కే సాహూ స్పందించారు. ఊరేగింపు కోసం 18 ఏనుగులను తీసుకురాగా, అందులో ఒకే ఒక్క మగ ఏనుగు ఉందని, భక్తులపైకి దూసుకెళ్లింది అదేనని వెల్లడించారు. భక్తులను చూసి కంగారుపడినట్టుగా ఉందని, నిర్దేశించిన మార్గంలో కాకుండా భక్తుల మీదకు పరిగెత్తిందని వివరించారు. దీంతో, ప్రొటోకాల్ ప్రకారం, ఏనుగుకు వెంటనే మత్తు ఇంజెక్షన్ ఇచ్చామని సాహూ తెలిపారు. భక్తుల రద్దీ ప్రాంతం నుంచి ఆ ఏనుగును జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లేందుకు రెండు ఆడ ఏనుగులను ఉపయోగించామని ఆయన వివరించారు. తగు జాగ్రత్తలు తీసుకొని అక్కడి నుంచి తరలించామని వివరించారు.
Read this- Rashmika Mandanna: తొలిసారి అలాంటి పాత్రలో రష్మిక.. కత్తి పట్టుకుని అతి భయంకరంగా..?
ఏనుగును వెంటనే నియంత్రించడంత స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా, భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉందని, ప్రస్తుతం కొనసాగుతున్న రథయాత్రలో తిరిగి ప్రవేశపెట్టబోమని అధికారి సాహు వివరించారు. ఊరేగింపులో పాల్గొన్న మిగతా 17 ఏనుగులు ఆడవి అని, ఘటన తర్వాత కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రథయాత్రలో కొనసాగుతున్నాయని వివరించారు. కాగా, అహ్మదాబాద్‌లో జరిగే జగన్నాథ యాత్రకు విశిష్ఠ ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. పెద్ద ఎత్తులో భక్తులు తరలి వస్తుంటాయి. రథయాత్రలో పాల్గొనే ఏనుగులు, రథాలను చూసేందుకు భక్తులు వస్తుంటారు. దీంతో, భక్తుల రద్దీ ఏర్పడుతుంది.