Blue Mushrooms: విషపూరితం కావొచ్చు.. తినొద్దని అటవీశాఖ సూచన
హెచ్చరించిన ఖమ్మం జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్
ఖమ్మం వ్యవసాయం, స్వేచ్ఛ: పుట్టగొడుగుల పేరు చెబితే చాలామందికి తెల్లరంగువి మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ, విచిత్రంగా, ఖమ్మం జిల్లాలోని పులిగుండాల అటవీ ప్రాంతంలో అరుదైన నీలిరంగు పుట్టగొడుగులను (Blue Mushrooms) అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఇవి ‘బ్లూ పిన్కిగిల్ మశ్రూమ్ ఎంటొలోమా హోచెస్టెటెరి’ అనే జాతికి చెందిన పుట్టగొడుగులు అని ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ నిర్ధారించారు. గతంలో ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో ఈ జాతి పుట్టగొడుగులను గుర్తించగా, ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కనిపించాయి.
ఈ నీలిరంగు పుట్టగొడుగులకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి ఆకర్షణీయంగా ఆకాశ నీలిరంగులో ఉంటాయి. అందుకే వీటిని ‘స్కై బ్లూ మశ్రూమ్’ అని కూడా పిలుస్తారని తెలిపారు. న్యూజిలాండ్‌కు చెందిన ఈ జాతి మనదేశంలో అరుదుగా కనిపిస్తుందని వెల్లడించారు. ఎంటొలోమా జాతికి చెందిన ఈ పుట్టగొడుగులు విషపూరితమని అటవీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి, వీటిని ఆహారంగా వినియోగించవచ్చా.. లేదా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. పులిగుండాల అటవీ ప్రాంతంలో ఈ పుట్టగొడుగులు కనిపించడంతో ఖమ్మం అటవీ ప్రాంతంలో జీవవైవిధ్యం ప్రత్యేకతను సంతరించుకుంది.
Read Also- Telangana: నీటి వనరుల పరిరక్షణలో రోల్ మోడల్ గా తెలంగాణ.. మంత్రి శ్రీధర్ బాబు
అధ్యయనానికి చర్యలు
ఖమ్మం అడవుల్లో అరుదైన పుట్టగొడుగు జాతి కనిపించింది. ఇక్కడి పర్యావరణ ప్రాధాన్యతను సాక్ష్యంగా నిలిచాయి. కాబట్టి, జీవవైవిధ్యం రక్షణ కోసం అటవీశాఖ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే, ఈ జాతి పుట్టుగొడుగులపై మరింతగా అధ్యయనం చేస్తున్నామని అటవీశాఖ అధికారులు వివరించారు. కాబట్టి, ప్రజలు అడవుల్లో తెలియని కొత్త రకపు పుట్టగొడుగులను తాకకూడదు, తినకూడదు. ఎందుకంటే, అవి విషపూరితం కూడా కావొచ్చు.
పుట్టగొడుగులకు ఎన్నో రంగులు
ఆహార పదార్థాల్లో పుట్టగొడుగులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అద్భుతమైన రుచితో పాటు, ఆరోగ్యానికి చాలామంచివి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. ప్రకృతిలో వివిధ రకాల పుట్టగొడుగులు కనిపిస్తుంటాయి. ఇవి ఆకారంలోనే కాదు, రంగులోనూ విభిన్నంగా ఉంటాయి. సాధారణంగా తెలుపు రంగులో ఉండే పుట్టగొడుగులే ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే, ప్రకృతిలో ముదురు గోధుమ, నలుపు, లేత గోధుమ, గోధుమ-తెలుపు మిశ్రమం వంటి ఎన్నో రంగులలో పుట్టగొడుగులు ఉంటాయి. బాగా ప్రకాశవంతంగా కనిపించే కొన్ని రంగుల పుట్టగొడుగులు విషపూరితమైనవి కూడా కావొచ్చు. రంగుతో పాటు వాటి పైభాగం , వాసన, అవి మొలిచిన వాతావరణాన్ని బట్టి అవి తినదగినవా కాదా నిర్ణయించవచ్చు. ప్రకృతి అందించిన ఈ శాకాహార వనరులను తినే ముందు అవగాహనతో జాగ్రత్తగా తినడం ఎంతో సురక్షితం.
