Charla mandal: గిరిజన యువతిపై సామూహిక అఘాయిత్యం
కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి దారుణం
కొత్తగూడెం బాలిక సంరక్షణ కేంద్రానికి బాధితురాలి తరలింపు
చర్ల, స్వేచ్ఛ: చట్టాల్లో ఎన్ని మార్పులు వచ్చినా, కఠిన శిక్షలు అమలు చేస్తున్నా అత్యాచారాలు ఆగడంలేదు. అఘాయిత్యాలకు సంబంధించిన కేసులపై వేగవంతమైన విచారణలు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటైనప్పటికీ స్త్రీలపై లైంగిక హింస కొనసాగుతూనే ఉంది. పట్టణాలు, నగరాల్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాలు, అడవి ప్రాంతాల్లోనూ భయానక ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ తరహా ఘటనలు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. ఇలాంటి దారుణమే మరొకటి తెలంగాణ రాష్ట్రంలో (Charla mandal) వెలుగుచూసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఓ గిరిజన యువతిపై ఆటో డ్రైవర్లు సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఏజెన్సీ ప్రాంతాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మాయమాటలు చెప్పి కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి యువతికి ఇచ్చారు. తాగిన ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆటో డ్రైవర్ల దుశ్చర్య తెలుసుకున్న గిరిజన ప్రాంతవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమాయక గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం జరిపిన ఘటనపై ఆదివాసి సంఘాలు కూడా స్పందించాయి. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. బాధితురాలికి మాయమాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకున్న ఆటో డ్రైవర్లు, నిర్దేశిత ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలిని కొత్తగూడెం బాలిక సంరక్షణ కేంద్రానికి తరలించారు.
Read Also- Madarasi Movie Update: ఇలాంటి సాంగ్ పడితే శివ కార్తికేయన్ దొరకడు.. ఇలా ఎలా అనిరుద్?
ఈ తరహా దారుణ ఘటనలు సమాజంలోని ఇతర మహిళలు, వారి కుటుంబ సభ్యుల్లో అభద్రతా భావాన్ని కలిగిస్తున్నాయి. బాధితులకు న్యాయం చేయడం కంటే ముందుగా రక్షణ అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చట్టాలను తీసుకురావడమే కాదు, వాటి అమలులో ఉన్న లోపాలు, పోలీస్ వ్యవస్థ వైఫల్యాలు, సమాజంలో ఉన్న దృష్టికోణం కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు.