Viral Video: మధ్యప్రదేశ్‌లో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. శివ్‌పురి జిల్లాలోని సిర్సౌద్ గ్రామ మార్కెట్‌లో ఒక వ్యక్తి చేతిలో IV డ్రిప్ (సెలైన్ బాటిల్)పెట్టుకుని నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చేతికి ఇంజెక్షన్ సూది పెట్టి, సెలైన్ బాటిల్ వేలాడదీసుకుని వీధుల్లో తిరుగుతున్నాడు. అందరూ అతన్ని చూసి గ్రామీణ ఆరోగ్య వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలిసిన సమాచారం ప్రకారం, ఆ రోగికి ఓ నకిలీ వైద్యుడు డ్రిప్ పెట్టి, దానిని గమనించకుండా వదిలేశాడు. దీనిపై స్థానికులు తీవ్రంగా స్పందించడంతో, జిల్లా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (CMHO) డాక్టర్ సంజయ్ రిషేశ్వర్ దీని పై దర్యాప్తు చేయాలని ఆదేశించారు. “సరైన విచారణ తర్వాతే వ్యాఖ్యానించగలం. రోగికి డ్రిప్ వేసి నిర్లక్ష్యంగా వదిలేసిన విషయం నిజమైతే, అది తీవ్రమైన వైద్య నిర్లక్ష్యంగా పరిగణిస్తాం,” అని డాక్టర్ రిషేశ్వర్ తెలిపారు. ప్రైవేట్ క్లినిక్‌లో ఈ ఘటన జరిగి ఉంటే, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇటీవలి కాలంలో శివ్‌పురి జిల్లా ఆరోగ్య వ్యవస్థ వరుస వివాదాల్లో చిక్కుకుంది. కొన్ని రోజుల క్రితం జిల్లా ఆసుపత్రి నుండి నవజాత శిశువు దొంగిలించబడిన ఘటన సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ వీడియో మరోసారి గ్రామీణ వైద్య సేవల అసలైన పరిస్థితిని బయటపెడుతోంది.
అధికారిక గణాంకాల ప్రకారం, మధ్యప్రదేశ్‌లో ప్రతి 1,460 మందికి ఒక వైద్యుడు మాత్రమే ఉన్నాడు. ఇది జాతీయ సగటుతో పోలిస్తే చాలా తక్కువ. రాష్ట్ర జనాభా 7 కోట్లకు పైగా ఉండగా, మొత్తం వైద్యుల సంఖ్య ప్రభుత్వ , ప్రైవేట్ రంగం కలిపి 49,730 మాత్రమే. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. గ్రామీణ ఆరోగ్య గణాంకాల నివేదిక ప్రకారం, మధ్యప్రదేశ్‌లో 94% వైద్య నిపుణుల కొరత ఉంది.
ప్రజలు ఈ వీడియోను షేర్ చేస్తూ “ఇది ఆరోగ్య వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం” అని మండిపడుతున్నారు. ఆరోగ్య సదుపాయాలు బలహీనంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు వరుసగా జరగడం రాష్ట్ర వైద్య రంగంపై నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				