Viral News: విమానం గాల్లో ఉండగా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సాంకేతికంగా ఎంతో ప్రగతి సాధించినప్పటికీ, గాల్లో ఉన్న విమానం పూర్తిగా నియంత్రణలో ఉందని భావించడం పొరపాటే అవుతుంది. ఎందుకంటే, ఎలాంటి లోపం ఏ క్షణంలో తలెత్తుతుందో చెప్పలేం. పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఇతర కీలక వ్యవస్థల మీదే విమాన భారం ఆధారపడి ఉంటుంది. అందుకే, ప్రయాణికులు కూడా విమాన సిబ్బందికి అన్ని విధాలా సహకరించాలి. లేదంటే, సాధారణంగా జరగాల్సిన ప్రయాణం కాస్తా అత్యవసర ల్యాండింగ్‌కు దారితీస్తుంది. అలాంటి ఘటనే ఒకటి అమెరికాలో జరిగింది.
అమెరికాలోని డెట్రాయిట్ నుంచి ఒమాహాకు వెళ్తున్న ఓ విమానంలో ఓ ప్రయాణికుడు తీవ్ర కలకలం రేపాడు. విమాన సిబ్బంది ఒకర్ని హత్య చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఎమర్జెన్సీ డోర్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించి తీవ్ర కలకలం రేపాడు. దీంతో ‘స్కైవెస్ట్ ఫ్లైట్ 612’ విమానాన్ని మార్గమధ్యంలోనే ఐవా రాష్ట్రం సీడార్ రాపిడ్స్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఫ్లైట్‌లో 67 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్టు ‘న్యూయార్క్ టైమ్స్’ తెలిపింది. విమానంలో హింసాత్మక రీతిలో ప్రవర్తించిన ఆ ప్యాసింజర్ పేరు మరివో నిక్‌ప్రెలాజ్ అని, అతడి వయసు 23 సంవత్సరాలు అని వివరించింది. నిందిత యువకుడు మద్యంలో ఉండి ప్రవర్తించినట్టు పేర్కొంది. విమానంలోని ఎయిర్‌హోస్టెస్ ఒకర్ని పక్కకు నెట్టివేసి బెదిరించడమే కాకుండా, విమానం గాల్లో ఉంగడానే ఎమర్జెన్సీ డోర్‌ను తెరవడానికి ప్రయత్నించినట్టు తెలిపింది.
Read Also- Rahul Gandhi: ట్రంప్ వ్యాఖ్యలపై మోదీని నిలదీసిన రాహుల్ గాంధీ
విమానం ల్యాండింగ్ అయిన వెంటనే ఎయిర్‌పోర్టులో అప్పటికే సిద్ధంగా ఉన్న పోలీసులు నిందిత యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. విమాన సిబ్బందిపై దౌర్జన్యం, బెదిరింపులకు పాల్పడిన అతడి వద్ద, ట్యాక్స్ స్టాంపు లేకుండా తీసుకెళుతున్న అల్ప్రాజోలామ్ (Xanax) ట్యాబ్లెట్లు ఉన్నట్టు గుర్తించారు. యాంటీ-యాంగ్జైటీ కోసం ఈ టాబ్లెట్లు 41 ఉన్నట్టు గుర్తించి, అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ట్యాక్స్ స్టాంప్ లేకుండా తీసుకెళుతున్నందున నిందితుడిపై నమోదైన కేసులో అదనపు సెక్షన్ల కూడా జత చేస్తామని పేర్కొన్నారు. నిందిత యువకుడిని వచ్చేవారం ఫెడరల్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిందితుడి ప్రవర్తన మొదటి నుంచీ అనుమానాస్పదంగా అనిపించిందని తోటి ప్రయాణికులు చెప్పారు. ఫ్లైట్ టేకాఫ్ సమయంలోనే సీట్ బెల్ట్ తీసేసి నిలబడ్డాడని, డ్రింక్స్ సర్వ్ చేస్తున్న సమయంలో డోర్ వైపు ఎగిరి గంతేశాడని పేర్కొన్నారు.
Read Also- Tax Free: ఈ దేశాల్లో పన్నులు ఉండవు.. సంపాదనంతా వాడుకోవచ్చు
కాగా, నిందిత ప్యాసింజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత విమానం మళ్లీ బయలుదేరి డెట్రాయిట్ వెళ్లింది. ఈ ఘటనపై స్కైవెస్ట్ ఎయిర్‌లైన్స్ స్పందించింది. విమానాల్లో అనుచిత ప్రవర్తనను సహించలేమని, ప్రయాణికుల భద్రతకే తాము ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. ఈ ఘటనపై ఎఫ్‌బీఐ దర్యాప్తు మొదలుపెట్టిందని, నిందితుడు నిక్‌ప్రెలాజ్ బ్యాక్‌గ్రౌండ్‌ను పరిశీలిస్తోందని ప్రకటనలో పేర్కొంది.