Online Shopping Fraud: ఆన్‌లైన్ షాపింగ్‌లో (Online Shopping Fraud) మోసాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. వినియోగదారులు వెబ్‌సైట్‌లు, యాప్‌ల ద్వారా తమకు నచ్చిన వస్తువులను ఆర్డర్ చేస్తే, వాటికి బదులుగా నాసిరకమైన, లేదా పూర్తిగా వేరే వస్తువులు వస్తున్న ఘటనలు సాధారణంగా మారిపోతున్నాయి. డెలివరీ అయిన పార్శిల్ ఓపెన్ చేసి చూసి, చాలామంది షాక్ అవుతున్నారు. లోపల రాళ్లు, ఇటుకలు, పాత వస్తువులు, లేదా ఖాళీ బాక్సులు వచ్చిన సందర్భాలు లెక్కకు మించి నమోదయ్యాయి. ఇలాంటి ఘటనలపై వినియోగదారులు ఫిర్యాదులు చేస్తున్నా విధానాల్లో మాత్రం పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఫలితం పెద్దగా కనిపించడం లేదు. అందుకే, అద్దం పట్టే ఘటన ఒకటి తాజాగా చోటుచేసుకుంది.
బెంగళూరులో ప్రేమానంద్ అనే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఏరికోరి మరీ, ఏకంగా రూ.1.86 లక్షల విలువైన సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 (Samsung Galaxy Z Fold 7) స్మార్ట్‌ఫోన్‌ను ఆర్డర్ ఇచ్చాడు. ఈ హై-ఎండ్ ఫోన్ కావడంతో పేమెంట్ కూడా ముందే చేసేశాడు. అక్టోబర్ 14న ఆర్డర్ ఇస్తే అక్టోబర్ 17న పార్శిల్ డెలివరీ అయింది. ఎంతో ఉత్సాహంతో అన్‌బాక్స్ చేసి చూడగా, బాగా కాస్ట్లీ ఫోన్ ఉండాల్సిన స్థానంలో చతురస్రాకారంలో కట్ చేసిన టైల్ ముక్క కనిపించింది. బెంగళూరులోని యలచెనహళ్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఈ అవాక్కయ్యే పరిస్థితి ఎదురైంది. తన హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ మొత్తం చెల్లించానని, మోసం జరిగిపోయిందని అతడు వాపోయాడు.
Read Also- Bhadradri Kothagudem: రోడ్డు సౌకర్యం లేని గిరిజన గ్రామాలు.. వర్షాకాలం వచ్చిందంటే నరకయాతనే!
వెంటనే ఫిర్యాదు
ఫోన్‌కు బదులు టైల్ రావడంతో మోసపోయినట్టు గుర్తించిన ప్రేమానంద్ వెంటనే సైబర్ క్రైమ్ విభాగానికి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముందు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసి, ఆ తర్వాత కుమారస్వామి లేఅవుట్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినట్టు తెలిపాడు. బీఎన్ఎస్‌లోని సెక్షన్లు 318(4) (మోసం), 319 (నకిలీ మోసం), ఐటీ చట్టంలోని సెక్షన్ 66డీ (కంప్యూటర్ వనరుల ఉపయోగించి మోసం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదయిందని, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని అతడు తెలిపాడు.
Read Also- Viral News: తన డెత్ సర్టిఫికేట్ పోయిందని.. పేపర్‌లో బహిరంగ ప్రకటన.. ఇదేందయ్యా ఇది!
పాలు ఆర్డర్ ఇస్తే.. రూ.18.5 లక్షలు గోవిందా
ముంబైలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని వడాలాకు చెందిన 71 ఏళ్ల ఓ వృద్ధురాలు ఒక ఆన్‌లైన్ డెలివరీ యాప్ ద్వారా ఒక లీటర్ పాలుకు ఆర్డర్ ఇచ్చారు. దీంతో, ‘దీపక్’ అనే పాల కంపెనీ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేశాడు. ఆర్డర్ కంప్లీట్ చేయడానికి కొన్ని వివరాలు నింపాలంటూ ఓ లింక్‌ను పంపించాడు. మోసగాడనే విషయాన్ని గుర్తించలేకపోయిన ఆ వృద్ధురాలు దాదాపు గంటసేపు ఫోన్ లైన్‌లోనే ఉండి, కేటుగాడు అడిగిన అన్ని వివరాలు చెప్పేసింది. కొద్ది రోజుల తర్వాత చూస్తే, ఆ పెద్దావిడకు చెందిన మూడు బ్యాంక్ ఖాతాల్లో డబ్బు మాయమైంది. సైబర్ కేటుగాడు ఏకంగా రూ.18.5 లక్షల రూపాయలు కొల్లగొట్టాడు. వృద్ధురాలి పొదుపునకు సంబంధించిన డబ్బు మొత్తం కాజేశాడు. ఆ మోసగాడు పంపిన లింక్‌పై వృద్ధురాలు క్లిక్ చేయడంతో ఆమె ఫోన్‌కు యాక్సెస్ అయ్యి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఆగస్టులో జరగగా దర్యాప్తు కొనసాగుతోంది. కాబట్టి, ఆన్‌లైన్ కొనుగోళ్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత వివరాలను అస్సలు పంచుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				