Nitish Reddy: తెలుగు కుర్రాడు, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Reddy).. ఐపీఎల్‌లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీని వీడాలనుకుంటున్నాడా?. గుడ్ బై చెప్పే యోచన చేస్తున్నాడా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఎస్‌ఆర్‌హెచ్‌కు గుడ్‌బై చెప్పి, తద్వారా కెరీర్‌లో కొత్త ఆరంభాన్ని అందుకోవాలని నితీశ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్టు ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న సన్నిహిత వర్గాలు తెలిపాయని ‘ఇండియా టుడే’ ఒక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. ఐపీఎల్ 2024 మెగా వేలంలో నితీశ్ కుమార్ రెడ్డిని సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ భారీ ధరకు రిటెయిన్ చేసుకుంది. ఒక్క ఏడాది లోపే ఫ్రాంచైజీ వీడాలనుకుంటున్నాడనే ఊహాగానాలు ఆసక్తికరంగా మారాయి.
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్ చేరుకుంది. ఆ తర్వాత కొన్ని నెలల వ్యవధిలోనే జరిగిన మెగా వేలానికి ముందు కేవలం ఐదుగురు ప్లేయర్లను మాత్రమే అట్టిపెట్టుకుంది. వారిలో నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ ఇద్దరు భారతీయ క్రికెటర్లుగా ఉన్నారు. నితీశ్‌ను నిలుపుదల చేసుకునేందుకు ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ రూ.6 కోట్లు భారీ మొత్తం వెచ్చించింది.
ప్రదర్శనపై అసంతృప్తి
2025 ఐపీఎల్ సీజన్‌లో నితీశ్ కుమార్ రెడ్డి ఆకట్టుకోలేకపోయాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమయ్యాడు. దీంతో, జట్టులో తన పాత్ర పట్ల నితీశ్ అసంతృప్తిగా ఉన్నాడని సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. 2025 ఐపీఎల్‌లో నితీష్ మొత్తం 13 మ్యాచ్‌లు ఆడినా, బౌలింగ్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు దక్కలేదు. ఎక్కువగా బ్యాట్స్‌మెన్‌గానే జట్టులో చోటుదక్కించుకున్నాడు. సీజన్ మొత్తం మీద కలిపి కేవలం 5 ఓవర్లు బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్‌లో కూడా అతడిని 5వ స్థానం నుంచి 7వ స్థానానికి డిమోట్ చేశారు. సీజన్‌లో 6 లేదా 7వ స్థానాల్లో బ్యాటింగ్ చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్ మారడంతో పరుగుల సాధించే అవకాశం కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఎంతలా అంటే, 2024లో 303 పరుగులు సాధించిన నితీశ్.. 2025లో కేవలం 182 పరుగులకే పరిమితమయ్యాడు.
Read Also- NALSA: సైనికులు, వారి కుటుంబాలకు గుడ్‌న్యూస్
4వ స్థానంలో బ్యాటింగ్ ఇవ్వలేదు
4వ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు అవకాశం ఇస్తామంటూ హామీ ఇచ్చిన తర్వాతే నితీశ్ రెడ్డి రిటెన్షన్‌కు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే, 2025 సీజన్‌లో పిచ్‌లు కాస్త సంక్లిష్టంగా రూపొందించడంతో ఆ స్థానంలో అనుభవజ్ఞుడైన హార్డ్ హిట్టర్ హైన్నిచ్ క్లాసెన్‌తో భర్తీ చేసినట్టు సమాచారం. క్లాసెన్ తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 4వ స్థానంలో తన ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. 2025 ఐపీఎల్ సీజన్‌లో 487 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేట్ 172.70గా ఉంది. ఇందులో ఓ శతకం కూడా ఉంది. ఏదేమైనా, నితీశ్ కుమార్ రెడ్డి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుని వీడి వేలంలోకి వస్తే, అతడిని దక్కించుకునేందుకు పలు జట్లు ఆసక్తి చూపే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పేస్ బౌలింగ్‌తో పాటు భారీ షాట్లు కొట్టగలిగే సామర్థ్యం ఉండడంతో ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉండొచ్చు.
Read Also- Asia Cup: భారత్-పాక్ మధ్య 3 మ్యాచ్‌లు!.. ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్