MP Strange Incident: మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో విచిత్రకర ఘటన చోటు చేసుకుంది. ఓ గ్రామస్తుడు అతి సాధారణమైన లడ్డు సమస్యను ఏకంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించడం దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తాను ఒక లడ్డు మాత్రమే పొందగా.. పక్కవారికి రెండు లడ్లు ఇచ్చారని సీఎం హెల్ప్ లైన్ కు ఆ వ్యక్తి కాల్ చేయడం షాక్ కు గురి చేస్తోంది.
అసలేం జరిగిందంటే?
ఈ సంఘటన మధ్యప్రదేశ్ భింద్ జిల్లా (Bhind district)లోని ఓ గ్రామ పంచాయతీ భవన్ లో చోటుచేసుకుంది. అన్ని గ్రామ పంచాయతీల్లో లాగానే ఆగస్టు 15న అక్కడ కూడా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించారు. జెండా ఆవిష్కరణ అనంతరం అక్కడి వచ్చిన వారికి పంచాయతీ అధికారులు లడ్లు పంచిపెట్టారు. ఈ క్రమంలో గ్రామస్థుడు కమ్లేశ్ ఖుష్వాహా (Kamlesh Khushwaha) కు ఒకటే లడ్డు ఇచ్చారు. పక్కవారికి మాత్రం రెండు లడ్లు ఇవ్వడంతో తనకూ అలాగే ఇవ్వాలని కమ్లేశ్ పట్టుబట్టాడు. అందుకు వారు నిరాకరించడంతో పంచాయతీ భవన్ వెలుపల నుంచే సీఎం హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేశారు.
WATCH | MP अजब है! 15 अगस्त पर नहीं मिला लड्डू..तो भिंड के शख्स ने सीधे CM से की शिकायत
⬥गांव के सरपंच और सचिव अब शिकायतकर्ता को बाजार से खरीद कर भरपेट खिलाएंगे लड्डू#MadhyaPradesh #Bhind #laddoo #MohanYadav #CMHelpline #Trending pic.twitter.com/0hldCrzqxt
— Times Now Navbharat (@TNNavbharat) August 22, 2025
పంచాయతీ కార్యదర్శి ఏమన్నారంటే?
కమ్లేశ్ తన ఫిర్యాదులో ‘జెండా ఆవిష్కరణ అనంతరం పంచాయతీ సరైన రీతిలో మిఠాయిలు పంచలేదు. దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు. సీఎంకు ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి (Panchayat Secretary) రవీంద్ర శ్రీవాస్తవ (Ravindra Srivastava) ధృవీకరించారు. ‘ఆ వ్యక్తి రోడ్డుపై నిలబడి ఉన్నాడు. మా సిబ్బంది ఒక లడ్డు ఇచ్చారు. కానీ అతడు రెండు కావాలని పట్టుబట్టాడు. నిరాకరించడంతో వెంటనే హెల్ప్‌లైన్‌కు కాల్ చేశాడు’ అని తెలిపారు.
కేజీ మిఠాయిలు.. క్షమాపణలు
మరోవైపు చిన్న లడ్డు పంచాయతీలో ఏకంగా ముఖ్యమంత్రిని ఇన్ వాల్వ్ చేయాలని ప్రయత్నం జరగడంతో కామ్లేశ్ విషయంలో గ్రామ పంచాయతీ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఒక కేజీ మిఠాయిలు కొనుగోలు చేసి కమ్లేశ్ కు అందజేయడంతో పాటు క్షమాపణలు చెప్పాలని నిర్ణయించింది. తద్వారా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సమస్యకు ముగింపు పలకాలని తీర్మానించింది.
Also Read: Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్నిపరీక్షలో భార్యభర్తల పంచాయితీ.. జడ్జెస్ ను ఏకిపారేస్తున్న నెటిజన్లు!
గతంలోనూ అంతే..!
2020 జనవరిలో కూడా ఇలాంటి వివాదమే భింద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ గ్రామస్థుడు పాడైన హ్యాండ్‌పంప్ గురించి సీఎం హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు. దానికి అప్పటి పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ (PHE) విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.ఆర్. గోయల్ (PR Goyal) ఆశ్చర్యకరమైన సమాధానం రాశారు. ‘ఫిర్యాదు చేసిన వ్యక్తి పిచ్చివాడు. అతనికి ఎపిలెప్సీ ఉంది. అతని కుటుంబమంతటికీ అదే సమస్య ఉంది. హ్యాండ్‌పంప్ సరిగానే ఉంది. సమస్య అతని మెదడులోనే ఉంది. మా డిపార్ట్‌మెంట్ మొత్తానికి ఇది తెలిసిందే. మా మెకానిక్ బట్టలు కూడా అతనే చింపేశాడు’ అని రాశారు. అయితే ఈ సమాధానం పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది. అనంతరం ఇంజనీర్‌కు నోటీసు జారీ చేశారు. తర్వాత గోయల్ స్పష్టీకరిస్తూ తన ఐడీని ఎవరో హ్యాక్ చేశారని పేర్కొన్నారు.