Meta: గ్లోబల్ టెక్ దిగ్గజం మెటా (Meta) మునుపెన్నడూ లేనంత దూకుడుగా వ్యవహరిస్తోంది. ట్రాపిట్ బన్సల్ (Trapit Bansal), రూమింగ్ పాంగ్ (Ruoming Pang) అనే ఇద్దరు ఏఐ ఇంజనీర్లను రికార్డ్ స్థాయి జీతాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చింది. అత్యున్నత నైపుణ్యాలు, ప్రతిభ ఉన్న ఏఐ ఇంజనీర్ల కోసం సిలికాన్ వ్యాలీలో పోటీ తారాస్థాయికి చేరిన నేపథ్యంలో మెటా యాజమాన్యం అత్యంత దూకుడుగా వ్యవహరిస్తోంది. పాపులారిటీ సంపాదించిన ఏఐ శాస్త్రవేత్తలను ఆకర్షించేందుకు భారీ మొత్తంలో వెచ్చిస్తోంది. మెటా సంస్థ ఇటీవల ‘సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్’ అనే కొత్త విభాగాన్ని మొదలుపెట్టింది. ఇందులో పనిచేసేందుకు భారతీయ మూలాలున్న ట్రాపిట్ బన్సల్‌కు రూ.800 కోట్లు, రూమింగ్ పాంగ్‌కు ఏకంగా రూ.1,600 కోట్లు జాయినింగ్ బోనస్‌గా ప్రకటించి టెక్ రంగంలో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓపెన్ ఏఐ, గూగుల్ డీప్‌మైండ్, యాపిల్, అంథ్రోపిక్ లాంటి టెక్ దిగ్గజాలతో పోటీపడేందుకు సన్నద్ధమవుతున్న వేళ మెటా ఈ దిశగా అడుగులు వేస్తోంది.
ఎవరీ ఏఐ నిపుణులు?
భారతీయ మూలాలున్న ట్రాపిట్ బన్సల్, ఐఐటీ కాన్పూర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 2022లో ఓపెన్ ఏఐలో చేరారు. రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్, రీజనింగ్ మోడల్స్ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఓపెన్ఏఐలో ‘O1’ అనే రీజనింగ్ మోడల్ డెవలప్‌మెంట్‌లో కీలక భాగస్వామిగా ఉన్నారు. ఓపెన్ ఏఐ సహవ్యవస్థాపకుడు ఇల్యా సట్స్‌కేవర్‌తో కలిసి సన్నిహితంగా పనిచేశారు. ‘మెటాలో చేరబోతుండడం చాలా ఆనందంగా ఉంది!. సూపర్‌ఇంటెలిజెన్స్ కనుచూపు మేరల్లోనే ఉంది’’ అంటూ మెటాలో చేరబోతున్న విషయాన్ని ట్రాపిక్ బన్సల్ ఎక్స్ వేదికగా వివరించారు.
ఇక, ఏకంగా రూ.1600 కోట్ల పారితోషికాన్ని అందుకోబోతున్న రూమింగ్ పాంగ్ చాలా టాలెంటెడ్ ఏఐ ఇంజనీర్. యాపిల్ కంపెనీలో పనిచేసేటప్పుడు ఫౌండేషన్ మోడల్స్ బృందానికి నేతృత్వం వహించారు. అత్యాధునిక ఏఐ సిస్టమ్‌లను డెవలప్‌చేశారు. జులై మొదటివారంలో మెటాలో చేరిన ఆయన యాపిల్‌కు ఊహించని గట్టి షాక్ ఇచ్చారు. మెటా సంస్థ సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్‌కు రూమింగ్ పాంగ్ నాయకత్వం వహిస్తున్నారు.
Read Also- Viral News: ఒకప్పుడు సచిన్‌కు ప్రత్యర్థి.. నేడు ఆయన బతుకుదెరువు ఏంటో తెలుసా?
మెటా ఎందుకింత దూకుడు?
టెక్ మార్కెట్‌లో ప్రతిభ కలిగిన శాస్త్రవేత్తల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ఏఐ నిపుణులను తీసుకునేందుకు కంపెనీలు విపరీతంగా పోటీ పడుతున్నాయి. అందుకే, టాలెంటెడ్ ఉద్యోగులను తీసుకునేందుకు సీఈవోల కన్నా అధిక జీతాలు ఇచ్చేందుకు మెటా సిద్ధపడింది. కాగా, ఏకీకృత ఏఐ వ్యూహాన్ని అమలు చేయాలని మెటా భావిస్తోంది. కంపెనీ కింద ఉన్న వివిధ ఏఐ టీమ్‌లను ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చేందుకు ‘సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్’ను (Superintelligence Labs) ఏర్పాటు చేసింది. ఏజీఐ (Artificial General Intelligence) డెవలప్ చేయడమే దీని లక్ష్యం. భవిష్యత్ మౌలిక వసతుల ఏర్పాటులో భాగంగా 2026 నాటికి ‘ప్రొమెథెస్’ అనే సూపర్‌క్లస్టర్ కంప్యూటింగ్ వ్యవస్థను మెటా అందుబాటులోకి తీసుకురానుంది. అంతేకాదు, భారీ ఏఐ డేటా సెంటర్లను కూడా నిర్మిస్తోంది. వీటన్నింటికి ట్రాపిట్ బన్సల్, రూమింగ్ పాంగ్‌తో పాటు అలెగ్జాండర్ వాంగ్, నాట్ ఫ్రైడ్మాన్, డేనియల్ గ్రోస్‌తో పాటు ఓపెన్ ఏఐ, డీప్‌మైండ్ వంటి కంపెనీల నుంచి వచ్చిన ఏఐ ఇంజనీర్లు మెటా ఏఐ విభాగాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. మెటా ఏఐ విభాగాలు ఇప్పటివరకు విడివిడిగా పనిచేస్తూ వచ్చాయి. ఇకపై ఒకే చోట పనిచేయనుండడంతో ఈ నియామకాలతో మెటా ఎనలేని ప్రాధాన్యత ఇస్తోంది. భవిష్యత్‌లో ఏఐ రంగంలో అగ్రస్థానాన్ని పొందాలనేదే ఏఐ లక్ష్యంగా ఉంది.
Read Also- Nimisha Priya: నిమిషా మరణశిక్షపై మరోసారి స్పందించిన కేంద్రం