MBBS Fees: భారతీయ విద్యార్థులు చాలామంది విదేశాల్లో వైద్య విద్య అభ్యసిస్తుంటారు. ఎక్కువగా రష్యా, ఫిలిప్పీన్స్, కజకిస్థాన్‌తో పాటు పలు దేశాలను ఎంచుకుంటుంటారు. ఇంతకీ ఎంబీబీఎస్ చేయడానికి విదేశాలకు ఎందుకు వెళుతున్నారు?, అక్కడ ఫీజులు ఏవిధంగా ఉంటాయి? అనే అంశాలను పరిశీలిద్దాం. మన దేశంలో ప్రభుత్వ వైద్య కాలేజీలు సీట్లు చాలా పరిమితంగా ఉంటాయి. ఇక, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజులు అధికంగా ఉంటున్నాయి. అందుకే ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్న విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే తక్కువ ఖర్చుతో, నాణ్యమైన విద్య అందిస్తున్న విదేశీ ఎంబీబీఎస్ కోర్సులవైపు మొగ్గు చూపుతున్నారు.
ఫీజులు ఎలా ఉంటాయి?
గ్లోబల్ మెడికల్ ఫౌండేషన్ వెబ్‌సైట్ డేటా ప్రకారం, రష్యా, కజకిస్థాన్ లేదా ఫిలిప్పీన్స్ దేశాలలో ఎంబీబీఎస్ ఏడాది ఫీజు సుమారు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. భారత్‌లో ప్రైవేటు కాలేజీలతో పోల్చితే ఈ మూడు దేశాల్లో ఫీజులు తక్కువగా ఉండడంతో విదేశాల్లో చదవేందుకు మన విద్యార్థులు మక్కువ చూపుతున్నారు. భారతదేశంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య విద్య అభ్యసించవచ్చు. అయితే, సీట్ల సంఖ్య పరిమితంగా ఉంటుంది. దీనిని బట్టి వైద్య విద్య చాలామందికి అందుబాటులో లేదని చెప్పవచ్చు. విదేశాల్లోని కాలేజీలో ఎక్కువ సీట్లు అందుబాటులో ఉండడం, తక్కువ ఖర్చు, ఇంగ్లీష్ మీడియంలో బోధన చేస్తుండడం వంటి ప్రయోజనాలను భారతీయ విద్యార్థులు దృష్టిలో పెట్టుకొని విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్సు చేయాలనుకుంటున్నారు.
రష్యాలో ఎంబీబీఎస్ ఖర్చు ఎంత?
రష్యాలో ఎంబీబీఎస్ కోర్సు సాధారణంగా ఆరేళ్లు ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుంది. ఏడాదికి ఫీజు సుమారు రూ.2 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఉంటుంది. మరో విషయం ఏంటంటే, రష్యాలో హాస్టల్ చార్జీలు తక్కువగా ఉంటాయి. అక్కడి ప్రభుత్వం కూడా వైద్యవిద్యకు సహకారం అందిస్తుంది. అయితే, రష్యాలో ఎంబీబీఎస్ చదవాలనుకునే విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇండియాలోని నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) రష్యాలోని కొన్ని యూనివర్సిటీల క్లినికల్ ట్రైనింగ్‌ను పూర్తిగా గుర్తించకపోతే, మరో ఏడాది పాటు కోర్సు కొనసాగించాల్సి ఉంటుంది.
Read Also- TCS layoffs 2025: టీసీఎస్ అనూహ్య ప్రకటన.. ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్
కజకిస్థాన్‌లో ఫీజు ఎంత?
కజకిస్థాన్‌లో మెడికల్ యూనివర్సిటీల్లో ఒక సంవత్సరం ఎంబీబీఎస్ ఫీజు సుమారు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుంది. మొత్తం ఆరేళ్ల పాటు కోర్సు ట్యూషన్ ఫీజు కింద రూ.18 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ ఫీజుతో పాటు బయట కూడా కొన్ని ఖర్చులు ఉంటాయి. హాస్టల్ (వసతి), భోజనం, మెడికల్ ఇన్సూరెన్స్, వీసా రెన్యూవల్, అడ్మిషన్ ఫీజు, ప్రయాణ ఖర్చులు వంటి అవసరమైన వ్యయాలు ఉన్నాయి. ఈ వివరాలు అన్ని తెలుసుకున్న తర్వాత, కుటుంబాలు ఆర్థిక స్థోమతకు తగ్గట్టుగానే అక్కడ ఎంబీబీఎస్ చదివేందుకు ప్రయత్నించాలి.
ఫిలిప్పీన్స్‌లో ఫీజు ఎంత?
ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్ చదువు ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అక్కడి ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు సుమారు రూ.2.10 లక్షల ప్రారంభ వార్షిక ఫీజుతో మెడికల్ విద్యను విదేశీ విద్యార్థులకు అందిస్తున్నాయి. అయితే, అక్కడ చదవాలనుకు విద్యార్థులు కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక చేసుకునే యూనివర్సిటీకి భారత నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) గుర్తింపు ఉందా లేదా అనే విషయాన్ని కచ్చితంగా నిర్ధారించుకోవాలి. వసతి, భోజనం, వీసా, ప్రయాణం వంటి వాటి ఖర్చులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ట్యూషన్ ఫీజు, బస, ఆహారం వంటి ఇతర ఖర్చులు అన్నింటినీ లెక్కలోకి తీసుకోవాలి. అంతేకాదు, స్కాలర్‌షిప్‌లు, స్టూడెంట్ లోన్లు వంటి ఆర్థిక సహాయ ఆప్షన్ల గురించి కూడా తెలుసుకోవాలి. అన్ని విషయాలను సమగ్రంగా తెలుసుకున్న తర్వాతే ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్ చదవడంపై తుది నిర్ణయం తీసుకోవాలి. అవగాహనం లేకుండా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు.
Read Also- Thai Vs Cambodia: ట్రంప్ చెప్పినా తగ్గని థాయ్‌లాండ్, కాంబోడియా