Thailand Combodia
అంతర్జాతీయం, లేటెస్ట్ న్యూస్

Thai Vs Cambodia: ట్రంప్ చెప్పినా తగ్గని థాయ్‌లాండ్, కాంబోడియా

Thai Vs Cambodia: థాయ్‌లాండ్‌-కాంబోడియా (Thai Vs Cambodia) దేశాల మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు ఏమాత్రం చల్లారలేదు. వివాదాస్పద సరిహద్దు విషయంలో వరుసగా నాలుగవ రోజైన ఆదివారం కూడా సైనిక ఘర్షణలు కొనసాగుతున్నాయి. స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ రంగంలోకి దిగినా ఈ రెండు దేశాలూ లెక్కచేయడం లేదు. సైనిక ఘర్షణను వెంటనే ఆపివేయాలని, శాంతిని పునరుద్ధరించేంత వరకు ఈ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోమంటూ అమెరికా ప్రకటించినప్పటికీ థాయ్‌లాండ్, కాంబోడియా ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయి. ఆదివారం తెల్లవారుజామున కాంబోడియా బలగాలు తమ పౌరుల ఇళ్లపై కాల్పులకు తెగబడినట్టు థాయ్‌‌లాండ్ ఆర్మీ ఆరోపణలు చేసింది. థాయ్‌ సైన్యం కూడా ప్రతిదాడి మొదలుపెట్టి కాల్పులు జరుపుతూనే ఉందని, కంబోడియాలోని అనేక ప్రాంతాలపై షెల్లింగ్ జరుపుతోందని స్థానిక మీడియా వెల్లడించింది.

ఘర్షణ ఆపండి.. ట్రంప్‌ ఒత్తిడి
థాయ్‌లాండ్, కాంబోడియా సైనిక ఘర్షణకు ముగింపు పలకడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం రంగంలోకి దిగారు. ఇరుదేశాల అధినేతలతో శనివారం ఆయన ఫోన్‌లో మాట్లాడారు. కాల్పుల విరమణపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకునేందుకు ఇరు దేశాలూ అంగీకరించాయంటూ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఆయన ప్రకటించారు. అయితే, స్వయంగా ట్రంప్ కల్పించుకున్నప్పటికీ థాయ్‌లాండ్, కాంబోడియా పట్టించుకోలేదు. ఆదివారం నాడు కూడా సరిహద్దులోని అనేక ప్రాంతాల్లో భారీగా తుపాకీ దాడులు, షెల్లింగ్ జరిగాయి.

స్పందించిన ఇరుదేశాలు
కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునివ్వడాన్ని కంబోడియా ప్రధాని హున్ మానేట్ స్వాగతించారు. తమ విదేశాంగ మంత్రి త్వరలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో సంప్రదింపులు జరుపుతారని వెల్లడించారు. మరోవైపు, థాయ్‌లాండ్ తాత్కాలిక ప్రధాని పుమ్థమ్ వెచయాచాయ్ కాల్పుల విరమణకు సూత్రప్రాయంగా అంగీకరించారు. అయితే, కాంబోడియాకు నిజంగా విరమణ ఉద్దేశం ఉందా? లేదా? అనే అంశంపై స్పష్టత కావాలని ఆయన డిమాండ్ చేశారు. థాయ్‌లాండ్‌-కాంబోడియాల మధ్య నెలకొన్న సైనిక ఘర్షణలను ముగింపు పలికేందుకు వాణిజ్య ఒప్పందాలను ఆయుధంగా వాడుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. మే నెలలో భారత్-పాక్‌ మధ్య సైనిక ఘర్షణలను ఇదే రీతిలో ఆపివేశానంటూ ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా అదే మాదిరిగా, అమెరికాతో వాణిజ్య ఒప్పందాల ఆశ చూపి థాయ్‌లాండ్, కాంబోడియాలను దారికి తేవాలని భావించారు. కానీ, ఆ దిశగా ఇప్పటికైతే పురోగతి కనిపించడం లేదు.

ఇప్పటికే 24 మంది మృతి
థాయ్‌లాండ్, కాంబోడియా మధ్య జులై 24న సైనిక ఘర్షణ ప్రారంభమైంది. ఈ ఘర్షణల్లో ఇప్పటికే 30 మందికిపైగా చనిపోగా, రెండు దేశాల్లో కలిపి 1.5 లక్షల మందికిపైగా పౌరులు సరిహద్దు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది. క్రమక్రమంగా ఇరు దేశాల మధ్య యుద్ధం తిరిగి భీకర రూపం దాల్చుతోంది. ఈ ఘర్షణ నేపథ్యం విషయానికి వస్తే, థాయ్‌లాండ్, కాంబోడియాల మధ్య సరిహద్దు వివాదాలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి.

ఎందుకీ ఘర్షణ?

ప్రస్తుత ఉద్రిక్తతలకు ప్రహా విహార్ ఆలయం కేంద్ర బిందువుగా మారింది. ఫ్రెంచ్ వలస పాలన కాలంలో రూపొందించిన సరిహద్దు పటాలు రెండు దేశాల మధ్య వివాదాలకు దారి తీస్తున్నాయి. ఈ ఆలయం కాంబోడియాలో ఉన్నా, అక్కడికి చేరే మార్గం థాయ్‌లాండ్ నుంచే ఉండటంతో ఇరుదేశాలూ దీన్ని తమ హక్కుగా భావిస్తున్నాయి. నాటి సరిహద్దు పటాలను ఎవరికి వారు అనుకూలంగా అర్థం చేసుకోవడం ఇందుకు కారణమవుతోంది. 2025 జూలై 23న సరిహద్దు ప్రాంతంలో ల్యాండ్ మైన్ పేలడంతో ఒక థాయ్ సైనికుడు మరణించగా, నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన థాయ్ ప్రభుత్వం, కాంబోడియా రాయబారిని వెళ్ళిపోవాలని ఆదేశించి, తమ రాయబారిని వెనక్కు పిలిపించుకుంది. అనంతరం పరిస్థితులు మరింత దిగజారిపోతూ రాకెట్ దాడులు, యుద్ధవిమానాల మోహరింపు వరకు వెళ్లాయి.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం