120 marks for 100: బుద్ధిగా చదువుకొని, బ్రహ్మాండమైన జ్ఞాపకశక్తి ఉన్న విద్యార్థులకు పరీక్షల్లో మహా అయితే 100 శాతం మార్కులు వస్తాయి. కానీ, ఓ యూనివర్సిటీ విద్యార్థులకు కొంచెం విచిత్రంగా 100కి ఏకంగా 120 వరకు మార్కులు (120 marks for 100) వచ్చాయి. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న ఎంబీఎం ఇంజినీరింగ్ యూనివర్సిటీలో ఈ నిర్వాకం చోటుచేసుకుంది. బీఈ సెకండ్ సెమిస్టర్ విద్యార్థులకు 100 మార్కుల పేపర్‌లో గరిష్టంగా 120 వరకు మార్కులు ఇచ్చారు. యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో రిలీజ్ చేసిన రిజల్ట్స్ చూసుకొని విద్యార్థులు నమ్మలేకపోయారు. ఆశ్చర్యానికి గురయ్యారు. విషయం అర్థంకాక విషయాన్ని విద్యార్థులు యూనివర్సిటీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ఇదేం నిర్వాకమంటూ నిలదీశారు. ఈ విషయం బయటకు రావడంతో వివాదాస్పదంగా మారింది. తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డ్యామేజీని గుర్తించిన యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ వెంటనే ఫలితాలను వెబ్‌సైట్ నుంచి తొలగించింది.
కాగా, గ్రేడ్ షీట్ తయారీ సమయంలో ఈ తప్పిదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇంటర్నల్ మార్కులను సాధారణ మార్కులకు కలిపి అప్‌లోడ్ చేయడంతో 120 వరకు మార్కులు ఇచ్చినట్టుగా ఉందని సమాచారం. అయితే, ఈ నిర్లక్ష్యపూరిత ఘటనపై యూనివర్సిటీ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామం యూనివర్సిటీ విశ్వసనీయత, పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. విద్య, యూనివర్సిటీ నిర్వహణలో పర్యవేక్షణ లోపాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also- Muslim Population: దేశంలో ముస్లిం జనాభా పెరుగుదల వెనుక అసలు కారణం ఇదేనా?
తప్పుల మీద తప్పులు..
ఎంబీఎం యూనివర్సిటీలో నిర్వహణలో తప్పు చేసుకోవడం ఇదే తొలిసారికాదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొరపాట్లు గుర్తించి గతంలోనూ మార్కుల సవరణలు చేశారని, డిగ్రీ పట్టాలు ఆలస్యంగా ఇవ్వడం, తేదీల్లో సమస్యలు, ఇలా ఏదో ఒక సమస్య వస్తూనే ఉందని విద్యార్థులు వాపోతున్నారు. ఓ విద్యార్థి మాట్లాడుతూ, యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో చెప్పడానికి ఇంతకుమించి ఇంకేం కావాలని వ్యాఖ్యానించాడు. రిజల్ట్స్‌ను వెబ్‌సైట్‌లో పెట్టడానికి ముందు కనీసం ఒకసారి సరిచూసుకోవాలి కదా? అని మండిపడ్డాడు. యూనివర్సిటీ నిర్వాకం కారణంగా ఇప్పుడు విద్యార్థులు మార్కుల షీట్లు పట్టుకొని అధికారులు చుట్టూ తిరగాల్సి వస్తోందని, పూర్తిగా యాజమాన్యం వైఫల్యం కారణంగానే తప్పిందని జరిగిందని, కానీ, విద్యార్థులు బాధపడాల్సి వస్తోందని వాపోయాడు.
Read Also- Viral Video: రైల్వే వంతెనపై రీల్స్.. వెనుక నుంచి దూసుకొచ్చిన వందే భారత్ రైలు, జస్ట్ మిస్!
తప్పు ఒప్పుకున్న వీసీ
మార్కులు ఇవ్వడంలో జరిగిన పొరపాటును వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అజయ్ శర్మ అంగీకరించారు. టెస్టింగ్ ఏజెన్సీ పరిశీలిస్తుండగానే ఇంటర్నల్ మార్కులు తప్పుగా అప్‌లోడ్ అయ్యాయని వివరణ ఇచ్చారు. పొరపాటును గుర్తించిన వెంటనే ఫలితాలను వెంటనే తొలగించామని శర్మ చెప్పారు. ఇందుకు బాధ్యత వహించాల్సిన విభాగానికి నోటీసు జారీ చేశామని వెల్లడించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి నివేదికను కోరిందని, రిపోర్టును పంపించామని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ మీడియాకు తెలిపారు.
ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఎన్ఎస్‌యూఐ జోధ్‌పూర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బబ్లూ సోలంకీ, కొంతమంది విద్యార్థి నాయకులు బాధ్యులపై మూడు రోజుల్లోగా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఛాన్సలర్‌కు ఒక మెమొరాండం సమర్పించారు. ఇది ఘోరమైన నిర్లక్ష్యమని సోలంకీ విమర్శించారు. కనీసం క్రాస్ వెరిఫికేషన్ చేసుకోకుండా రిజల్ట్స్ ఎలా అప్‌లోడ్ చేస్తారని ప్రశ్నించారు. కాగా, ఈ వ్యవహారంపై ఎంబీఎం యూనివర్సిటీ తదుపరి చర్యలు ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.
