Viral news: భారతదేశంలో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల పట్ల ఎంత నిర్దయతో ప్రవర్తిస్తున్నాయో కళ్లకు కట్టినట్టు చూపించే ఘటన ఒకటి తాజాగా (Viral news) వెలుగుచూసింది. బెంగళూరులో పనిచేస్తున్న ఓ ఐటీ ఉద్యోగినికి చేదు అనుభవం ఎదురైంది. కన్నతల్లి రోడ్డు ప్రమాదానికి గురయ్యి, ఒక చెయ్యి ఫ్రాక్చర్ కావడంతో నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెకు సాయంగా ఉండేందుకు నెల రోజులపాటు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని సదరు లేడీ ఎంప్లాయ్ కోరింది. కానీ, కంపెనీ కనికరం లేకుండా వ్యవహరించింది. అభ్యర్థనను తిరస్కరించింది. మెడికల్ రిపోర్టులు, పోలీసు ఎఫ్‌ఐఆర్ కాపీలు సబ్‌మిట్ చేసినప్పటికీ అస్సలు పట్టించుకోలేదు.
తన మరదలకు (భార్య చెల్లెలు) ఎదురైన ఈ ఘటనపై ఓ వ్యక్తి రెడిట్‌లో పోస్ట్ పెట్టాడు. ‘భారతదేశంలో వర్క్ కల్చర్ పిచ్చెక్కినట్టు తయారైంది’ అనే టైటిల్‌తో రాసుకొచ్చాడు. ఆమె బెంగళూరులోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తోందని చెప్పాడు. తన అత్తయ్య, బావమరిది స్కూటర్‌పై వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగిందని, అత్తయ్యకు చెయ్యి ఫ్రాక్చర్ అయిందని వివరించాడు. బావమరిదికి కూడా ముఖం, చేతులకు దెబ్బలు తగిలాయని, కానీ, అదృష్టవశాత్తూ ఎలాంటి ఫ్రాక్చర్లు కాలేదని చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఐటీ ఎంప్లాయి అయిన తన మరదలు వర్క్ ఫ్రం హోం కోరితే నిరాకరించారని విమర్శించాడు. వారి ఇబ్బందులను అర్థం చేసుకొని తన భార్యను పుట్టింటికి సాయంగా పంపానని వెల్లడించాడు.
Read Also- BC Reservation: బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డికి నేతలు ఇచ్చిన సలహా ఇదే!
‘‘వర్క్ ఫ్రమ్ హోం అనుమతి ఇవ్వాలంటూ యాక్సిడెంట్ ఆధారాలు చూపించాలని తొలుత చెప్పారు. దీంతో, ఎంఆర్ఐ స్కాన్లు, పోలీస్ రిపోర్టు పంపించింది. అయినా వారు ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసి మరీ, వర్క్ ఫ్రమ్ హోం నిరాకరిస్తున్నట్టు చెప్పారు. ఆమేం సెలవు కూడా అడగలేదు. కేవలం వర్క్ ఫ్రం హోమ్ మాత్రమే కోరింది. ఆమె చేసే పని కూడా ఆఫీసులో ఉండాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నా భార్యే మా అత్తగారిని చూసుకుంటోంది’’ అని వివరించాడు.
Read Also- Lulu Mall Controversy: లులూ మాల్‌పై పవన్ కళ్యాణ్ కన్నెర్ర..! మద్దతుగా చంద్రబాబు స్పందన!
కార్పొరేట్ వర్క్ కల్చర్ నానాటికీ దిగజారుతోందని విమర్శించాడు. ఎందుకంటే, అదే కంపెనీలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి పట్ల ఇంత నిర్దయగా వ్యవహారించడం తీవ్ర నిరాశ కలిగిస్తుందని సదరు వ్యక్తి పేర్కొన్నారు. మరో దారుణమైన విషయం ఏంటంటే, ప్రమాదంలో గాయపడిన తన బావమరిదికి కూడా ఆఫీసులో రెండు రోజులు మాత్రమే సెలవు ఇచ్చారని, వెంటనే ఆఫీస్‌కు రావాలంటూ సమాచారం ఇచ్చారని వాపోయాడు. అతడు ఇంకా నొప్పితోనే బాధపడుతున్నాడని, ప్రతిరోజూ ఎవరో ఒకరు ఆఫీసుకు తీసుకెళ్లాల్సి వస్తోందని ఆయన రాసుకొచ్చాడు.
పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలు ఎలాంటి జాలి, దయలేకుండా వ్యవహరిస్తాయని ఇంతకుముందు వినేవాడినని, ఇప్పుడు నిజంగా తన ముందు జరుగుతోందని విస్మయం వ్యక్తం చేశాడు. ఈ పరిణామం చాలా కష్టంగా, అసహ్యంగా అనిపిస్తోందని వ్యాఖ్యానించాడు. ఈ పోస్టుపై చాలామంది నెటిజన్లు స్పందించారు. తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను చాలామంది పంచుకున్నారు.
