Kurnool News: సార్.. నా ఆటో పోయింది. ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆటోను దొంగిలించారు. కర్నూలు జిల్లా డయల్ 100 కు అర్ధరాత్రి ఓ వ్యక్తి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు వెంటనే స్థానిక టోల్‌గేట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. టోల్ గేట్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలను తనిఖీలు చేయగా, అసలు ఆ దారిలో ఆటోనే వెళ్లలేదని తెలిసింది. పోలీసులు తనిఖీలు చేసినా ఆటో దొరకకపోవడంతో ఆ వ్యక్తిని పోలీసులు విచారించారు.
అయితే తాను మద్యం మత్తులో ఫోన్ చేశానని, అసలు ఏం మాట్లాడానో తనకు గుర్తు లేదని తెలిపాడు. దీంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. అనంతరం పోలీసులు విచారణ జరపగా.. దిమ్మ తిరిగేలా షాకింగ్ విషయాలు తెలిసాయి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు..? అతని ఆటో ఎక్కడ..? విచారణలో పోలీసులకు తెలిసిన నిజాలు ఏంటో తెలుసుకోవాలనుందా.. అయితే ఈ కథనం చదవాల్సిందే..
మద్యం మత్తులో ఫిర్యాదు..
నల్గొండ జిల్లా, మిర్యాలగూడకు చెందిన మనోజ్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల విభేదాల కారణంగా అతడి భార్య జమ్మలమడుగు వెళ్లిపోయింది. తన భార్యను వెతికేందుకు మనోజ్ తన ఆటోను నడుపుకుంటూ ఒక వారం క్రితమే జమ్ములమడుగు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో నంద్యాల నుంచి రాత్రి 11 గంటలకు కర్నూలుకు బయలుదేరాడు. కానీ, ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని కాల్వబుగ్గ వద్ద అదుపుతప్పి ఆటో లోయలో పడిపోయింది. మద్యం మత్తులో గల మనోజ్ కు ఏమి కానీ అర్థం కాని పరిస్థితి. ఆ మత్తులో చేసిన నిర్వాకమే ఇది.
సీసీ కెమెరాలతో అసలు నిజం వెల్లడి
ఆటో దొంగలించారని ఫిర్యాదు చేసిన మనోజ్‌ను పోలీసులు విచారించగా, తాను ఏమి మాట్లాడానో గుర్తు లేదని, మద్యం మత్తులో తన బ్రెయిన్ సరిగ్గా పని చేయలేదని చెప్పాడు. నన్నూరు టోల్‌గేట్ వద్ద సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా, ఆటో అటువైపుగా వెళ్లలేదని పోలీసులు నిర్ధారించారు. చివరికి కాల్వబుగ్గ వద్ద జరిగిన ప్రమాదంలో ఆటో పడిపోయిందని గుర్తించారు.
Also Read: Ganja Smuggler Arrested: హీరోయిన్లను మించిన లైఫ్ స్టైల్.. చేసేది గంజాయి దందా.. ఎట్టకేలకు?
పోలీసుల కౌన్సిలింగ్
ఈ తప్పుడు ఫిర్యాదు, మద్యం మత్తులో చేసిన అల్లరిని దృష్టిలో ఉంచుకుని కర్నూలు పోలీసులు మనోజ్‌కు కౌన్సిలింగ్ ఇచ్చారు. మద్యం తాగి వాహనం నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ ఘటన కర్నూలులో వైరల్ గా మారింది.