Kerala Lottery: అదృష్టం ఎప్పుడు, ఎవరి తలుపు తడుతుందో ఊహించడం ఎవరి తరం కాదు. కేరళలోని ఆలప్పుళ జిల్లా తురవూరుకు చెందిన శరత్ ఎస్. నాయర్ అనే పెయింట్ షాప్ ఉద్యోగి జీవితం పూర్తిగా మారిపోయింది. కారణం? అతను ‘తిరువోణం బంపర్ లాటరీ 2025’లో ఏకంగా రూ.25 కోట్ల ప్రథమ బహుమతిని సొంతం చేసుకున్నాడు. దీంతో శరత్ ఒక్క రాత్రిలోనే స్టార్‌గా మారిపోయాడు.
కొచ్చిలోని నెట్టూరులో నిప్పాన్ పెయింట్స్ షాప్‌లో పనిచేసే శరత్, తన అదృష్ట టికెట్ (నంబర్: టీహెచ్ 577825)ని అదే నెట్టూరులో కొనుగోలు చేశాడు. సోమవారం నాడు తురవూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా థైకట్టుస్సేరి బ్రాంచ్‌లో ఈ టికెట్‌ను సమర్పించి, తన విజయాన్ని అధికారికంగా నమోదు చేశాడు. రూ.25 కోట్ల బహుమతిలో 30% ఆదాయపు పన్ను (సుమారు రూ.7.5 కోట్లు), ఏజెంట్ కమిషన్ (సుమారు రూ.2.5 కోట్లు) తగ్గించాక, శరత్ చేతికి రూ.15.75 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ మొత్తం డబ్బు శరత్ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది.
శరత్ ఎస్. నాయర్ రియాక్షన్ ఇదే
” లాటరీ ఫలితాలు వచ్చినప్పుడు నేను ఆఫీసులో ఉన్నాను. మొదట నా అన్నకు ఫోన్ చేశాను. మేమిద్దరం కలిసి టికెట్ నంబర్‌ను జాగ్రత్తగా చెక్ చేశాం. అది నిజంగా మా టికెట్ అని నమ్మకం కలిగిన తర్వాతే బ్యాంక్‌లో టికెట్ ఇచ్చాము. విషయం బయటకు చెప్పకుండా ఉంచాలని నిర్ణయించాం. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ డబ్బును ఎలా ఉపయోగించాలనే దానిపై ఇంకా ఆలోచన చేయలేదు,” అని శరత్ తెలిపాడు. ఆసక్తికరంగా, శరత్ ఈ ఓనం బంపర్ టికెట్‌ను మొదటిసారిగా కొన్నాడట. “ఇది నా మొదటి ఓనం బంపర్ టికెట్. ఇకపై కూడా లాటరీ టికెట్లు కొంటాను ” అని నవ్వుతూ చెప్పాడు. శరత్ తన తల్లిదండ్రులు, అన్న, భార్య, కుమారుడితో కలిసి తురవూరులో నివసిస్తున్నాడు. ఈ సంతోషకరమైన విషయం తన సన్నిహిత కుటుంబ సభ్యులు తప్ప ఎవరికీ తెలియదని, ఈ విజయాన్ని రహస్యంగా ఉంచాలని అనుకున్నాడని శరత్ వెల్లడించాడు.
