Class 9 Girl: కర్ణాటక యాదగిరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విచిత్రకర ఘటన చోటుచేసుకుంది. స్కూల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థిని.. టాయిలెట్ అని చెప్పి బాత్రూమ్ కు వెళ్లి బిడ్డకు జన్మనిచ్చింది. సహచర విద్యార్థినులు గమనించి.. టీచర్లకు చెప్పడంతో వారు తల్లి, బిడ్డను హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు బాలిక మైనర్ కావడంతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే..
పోలీసులు ఎఫ్ఐఆర్ ప్రకారం.. బుధవారం (ఆగస్టు 27) మధ్యాహ్నం 2 గంటల సమయంలో బాలికకు ప్రసవం జరిగింది. దాదాపు 9–10 నెలల క్రితం గుర్తు తెలియని వ్యక్తి బాలికపై లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అయితే బాలిక ఆ విషయాన్ని ఇప్పటివరకూ ఎవరితోనూ చెప్పలేదని తెలిపారు. అంతేకాదు బిడ్డను ప్రసవించిన ఘటన కూడా తాజాగా తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. బాధితురాలి అన్న అభ్యర్థన మేరకు స్కూల్ ఉపాధ్యాయులు సైలెంట్ గా ఉండిపోయారని ఎఫ్ఐఆర్ లో రాసుకొచ్చారు.
Also Read: BiTV Premium Pack: కేవలం రూ.151తో.. 25 ఓటీటీలు, 450 ఛానళ్లు.. ఈ ఛాన్స్ మళ్లీ రాదు!
రంగంలోకి కలెక్టర్
మరోవైపు ప్రభుత్వ పాఠశాలలోనే బాలిక బిడ్డకు జన్మనివ్వడంపై కలెక్టర్ స్పందించారు. యాదగిరి జిల్లా కలెక్టర్ హర్షల్ భోయర్ తో పాటు ఎస్పీ పృథ్వీక్ శంకర్ ఆస్పత్రికి వెళ్లి బాలికను పరామర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ ‘పాఠశాల అధికారుల నిర్లక్ష్యం బహిర్గతమవుతోంది’ అని అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగురు స్కూల్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ బసమ్మతో పాటు గీత (వార్డెన్), నరసింహమూర్తి (సైన్స్ టీచర్), శ్రీధర్ (పీఈటీ)ను కొద్ది రోజుల పాటు విధుల నుంచి తొలగించారు. సస్పెన్షన్ ఆర్డర్ ప్రకారం.. విద్యార్థినికి ఆరోగ్య పరీక్షలు చేయించడంలో, హాజరు పర్యవేక్షణలో వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. విద్యార్థిని నెలలో సగటున 10 రోజులు మాత్రమే తరగతులకు హాజరయ్యిందని రికార్డులు చూపుతున్నాయి.
Also Read: Russia Ukraine War: ఉక్రెయిన్ యుద్ధ నౌకను.. డ్రోన్ దాడితో పేల్చేసిన రష్యా.. వీడియో వైరల్
బాలల హక్కుల సంఘాల స్పందన
కర్ణాటక స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (KSCPCR) ఈ ఘటనను ఖండించింది. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. KSCPCR ఆదేశాల మేరకు జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ నిర్మల హోంబన్నా.. సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. సామాజిక కార్యకర్త చన్నప్ప అనేగుండి మాట్లాడుతూ ‘బాలికల ఆరోగ్యంపై పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత గలవారు తమ విధుల్లో విఫలమయ్యారు. తరచుగా హెల్త్ చెకప్స్ చేయమని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ ఎందుకు విస్మరించారు?’ అని స్కూల్ టీచర్లను ప్రశ్నించారు.
కేసు నమోదు చేసిన పోలీసులు
మరోవైపు బాలిక ప్రసవించిన ఘటనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 64, POCSO చట్టంలోని 4, 6, 19 సెక్షన్స్, జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) చట్టంలోని 33, 34 సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ప్రధాన నేరస్థుడ్ని గుర్తుతెలియని వ్యక్తిగా చేర్చారు. వారితో పాటు సస్పెన్షన్ కు గురైన టీచర్ల పేర్లు ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు.