Viral News: భర్తలను మోసం చేస్తున్న భార్యలు.. భార్యలను మోసగిస్తున్న భర్తలకు సంబంధించిన ఉదంతాలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. అలాంటిదే మరో షాకింగ్ న్యూస్ బయటపడింది. ఉత్తర ప్రదేశ్‌లోని హర్దోయి జిల్లా అతమౌ గ్రామానికి చెందిన జితేంద్ర కుమార్ అనే వ్యక్తి తన మొదటి భార్యకు కలలో కూడా ఊహించని ట్విస్ట్ (Viral News) ఇచ్చాడు.
2017లో మురార్‌నగర్‌కు చెందిన షీలా అనే యువతిని పెళ్లాడిన జితేంద్రకు ఏడాది తిరిగేలోపే పండంటి మగబిడ్డ పుట్టాడు. కానీ, కొడుకు పుట్టిన వెంటనే జితేంద్ర అకస్మాత్తుగా మాయమైపోయాడు. ఎవరికీ కనిపించలేదు. ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో, 2018 ఏప్రిల్ నెలలో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు కూడా గాలించారు. అయినా ఎక్కడా అతడి ఆచూకీ దొరకలేదు. దీంతో, జితేంద్ర బంధువులంతా షీలా కుటుంబంపైనే అనుమానం వ్యక్తం చేశారు. ఏదో చేసి ఉంటారని ఆరోపణలు కూడా చేశారు.
ఎవరూ ఊహించని ట్విస్ట్..
ఇటీవలే భార్య షీలా ఖాళీ సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తుండగా, తన భర్త జితేంద్ర ఉన్న ఓ వీడియోను చూసింది. అది కూడా మరో మహిళతో కలిసి ఉండడాన్ని చూసి దిగ్భ్రాంతికి గురైంది. లుథియానాలో షూట్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భార్య షీలా కంటపడింది. దీంతో, ఆమె భర్త అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరో పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఆ మహిళతో జీవిస్తున్నాడని, ఈ విషయం అతడి కుటుంబానికి ముందే తెలుసునని షీలా చెప్పింది. కానీ, ఆ విషయాన్ని జితేంద్ర కుటుంబ సభ్యులు తనతో చెప్పలేదని ఆమె వాపోయింది. ప్రస్తుతం షీలా తన కొడుకుతో కలిసి తల్లిగారి ఇంట్లోనే ఉంటోంది.
Read Also- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫుల్ మీల్స్ పోస్టర్.. హరీష్‌కు ఈసారి టెంపులే!
షీలా ఆవేదన
‘‘2017లో మాకు సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది. నాకు ఒక కొడుకు ఉన్నాడు. నా భర్త అనూహ్యంగా అదృశ్యమయ్యాడు. అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదయిందనే విషయం ఇప్పుడే నాకు తెలిసింది. కానీ, అప్పట్లో విషయాన్ని దాచి నాకు, నా బంధువులకు తెలియకుండా చేశారు. ఇటీవల ఇన్‌స్టా రీల్స్ ద్వారా అసలు విషయం తెలుసుకున్నాను. ఆయన లూథియానాలో ఉండి, మరో మహిళతో కలిసి రీల్స్ చేస్తున్నాడు. అంతేకాదు, ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు’’ అని షీలా ఆవేదన వ్యక్తం చేసింది. ‘మా కొడుకుని చంపేశారంటూ అతడి కుటుంబ సభ్యులు.. నా కుటుంబంపై ఆరోపణలు చేశారు. కానీ నిజం ఏంటంటే, కుట్ర అంతా వాళ్లదే. వాళ్లు నన్ను మోసం చేశారు. నేటికీ నన్ను తప్పుదోవ పట్టిస్తూనే ఉన్నారు’’ అని ఆమె వాపోయింది.
Read Also- Ambulance Vehicle: అంబులెన్స్ రాకతో అత్యవసర వైద్య సేవలు.. నిలుస్తున్న బాధితుల ప్రాణాలు!
షీలా ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై స్థానిక ఏఎస్పీ నృపేంద్ర కుమార్ స్పందించారు. ‘‘వాళ్లిద్దరికీ గతంలో పెళ్లి జరిగింది. వివాహం జరిగిన ఏడాదికే, జితేంద్ర ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో ఓ ఎఫ్ఐఆర్ నమోదైంది. తాజాగా షీలా తన భర్త బతికే ఉన్నాడని ఓ వీడియో ద్వారా నిర్ధారించుకున్న తర్వాత, తొలుత ఫిర్యాదు చేసిన సంధిలా పోలీస్ స్టేషన్‌లోనే ఒక పిటిషన్ సమర్పించింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోంది. అవసరమైన చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటాం’’ అని నృపేంద్ర కుమార్ వెల్లడించారు.