Viral News: దక్షిణ థాయ్‌లాండ్ భారీ వర్షాల కారణంగా తీవ్ర వరదల ముప్పులో ఉంది. 12 ప్రావిన్సుల్లో పరిస్థితి దారుణంగా మారగా, హాట్ యాయ్ సహా అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ఇప్పటివరకు 80 మందికి పైగా మరణించగా, దాదాపు 30 లక్షల మంది ప్రజలు వరద ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ హడావిడిలో ఒక వ్యక్తిగత ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యి అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఈ ఘటనలో మలేషియాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యకు ‘కంపెనీ బిజినెస్ ట్రిప్‌కి వెళుతున్నాను’ అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. అయితే వరదల్లో చిక్కుకున్నాడేమోనని భార్య ఆందోళన చెంది సోషల్ మీడియాలో సహాయం కోరింది. ఆమె నాలుగో బిడ్డకు గర్భవతిగా ఉండటంతో, భర్త సురక్షితంగా ఉన్నాడో లేదో తెలుసుకోవాలని తీవ్రంగా తపించింది. ఈ విషయాన్ని మలేషియా మహిళ @psmommyhannah సోషల్ మీడియా పోస్ట్‌లో వివరించింది.
ఆ మహిళ తన బంధువులను హాట్ యాయ్‌లోని హోటల్‌కు పంపి ఆ వ్యక్తిని చెక్ చేయమని చెప్పింది. అయితే, అక్కడ లభించిన సమాచారం భార్యకే కాకుండా అందరికీ షాక్ ఇచ్చింది. ఆ వ్యక్తితో ‘ కోలీగ్స్ ’ ఎవరూ లేరు. పైగా గత నాలుగు రోజులుగా ఒక మహిళతో అదే రూమ్‌లో ఉండిపోవడం బయటపడింది. భర్త వరదల్లో చిక్కుకున్నాడెమో భావించిన భార్య, వాస్తవానికి ప్రేయసితో ఎంజాయ్ చేస్తూ ఉండటం పెద్ద వివాదంగా మారింది.
ఈ కథ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో 5,000కి పైగా లైకులు, వందలాది కామెంట్లు వచ్చాయి. “ ఎంత బాధైనా నిజం భార్యకు చెప్పాలి ” అని పలువురు సూచించారు. పోస్ట్ చేసిన మహిళ స్పందిస్తూ, “అటెన్షన్ కోసం కాదు.. భార్యలు అలా నమ్మకం పెట్టుకునే సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలని గుర్తు చేయడానికి మాత్రమే ఈ కథ చెప్పాను” అని వెల్లడించింది.
భర్త తరచూ మెసేజ్ చేస్తుండటంతో భార్యకు ఏ మాత్రం అనుమానం రాలేదని తెలిపింది. ఇప్పుడు ఆ మహిళ భార్యకు నిజం ఎలా చెప్పాలి, ఎవరిని సంప్రదించాలి అనే విషయంపై ఆలోచిస్తోంది. థాయ్‌లాండ్ వరదల గందరగోళంలో బయటకు వచ్చిన ఈ వ్యక్తిగత ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

