TS News:
నిజాయితీ చాటుకున్న జూనియర్ లైన్‌మెన్
దొరికిన రూ.7 లక్షల బంగారు నగల సొత్తు అప్పగింత
మధిర, స్వేచ్ఛ: నిజాయితీ కనుమరుగైందన్న కొందరి అభిప్రాయం తప్పు అని ఓ వ్యక్తి నిరూపించాడు. నిజాయితీ ఇంకా బతికే ఉందని, తన చర్యతో చాటి చెప్పాడు. తాను వెళ్తున్న దారిలో దొరికిన ఓ బ్యాగులో ఉన్న ఏడు తులాల బంగారు నగలు, రూ.20వేల నగదుపై ఓ వ్యక్తి ఆశపడలేదు. నిజాయితీగా తీసుకెళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మధిరకు చెందిన విద్యుత్ శాఖ ఉద్యోగి అయిన జూనియర్ లైన్‌మెన్ దారెల్లి బాబురావు నిజాయితీకి నిలువెత్తు రూపంగా (TS News) నిలిచాడు.
Read Also- Nitin Gadkari: కేంద్రమంత్రి నివాసంలో బాంబు పెట్టా.. 10 నిమిషాల్లో పేలుతుందంటూ ఫోన్‌కాల్..
మధిర పట్టణంలో ఆదివారం డ్యూటీలో భాగంగా కేవీఆర్ హాస్పిటల్ వెనుక రోడ్‌లో వెళ్తుండగా అతడికి రోడ్డుపై ఓ బ్యాగు అనుమానాస్పదంగా కనిపించింది. దానిని తెరిచి చూడగా, 70 గ్రాముల బంగార నగలు, రూ.20 వేల నగదు ఉన్నట్టు గుర్తించాడు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేశారు. ఆ తర్వాత మధిర పట్టణ సీఐ దోమల రమేష్ వద్దకు వెళ్లి నగల సమాచారం ఇచ్చాడు. బ్యాగును కూడా పోలీసులకు అప్పగించాడు. దీంతో, లైన్‌మెన్, విద్యుత్ శాఖ సిబ్బందిని సీఐ రమేష్ అభినందించారు. బ్యాగు యజమాని సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంతలోనే సదరు బ్యాగ్ హుజూర్‌నగర్‌కు చెందిన తంగేళ్లపల్లి రవికుమార్ అనే వ్యక్తిది అని సమాచారం వచ్చింది.
Read Also- Hero Krishnasai: సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు హీరో కృష్ణసాయి ఏం చేశారో చూశారా?
శనివారం రాత్రి సిద్ధారెడ్డి బజార్‌లో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో బ్యాగును పోగొట్టుకున్నట్లు రవికుమార్ చెప్పాడు. విషయాన్ని నిర్ధారించున్న తర్వాత అతడిని స్టేషన్‌కు పిలిపించి.. జూనియర్ లైన్‌మెన్ దారెల్లి బాబురావు చేతుల మీదుగా బ్యాగును అందజేశారు. పట్టణ లైన్ ఇన్స్పెక్టర్ రాజా రత్నం, లైన్‌మెన్ కోటేశ్వరరావు, అసిస్టెంట్ లైన్మెన్ క్రాంతి కిరణ్‌తో కలిసి నగలు, నగదు ఉన్న బ్యాగును అప్పగించారు. సుమారు రూ.7 లక్షల విలువైన బంగారు నగలు, రూ.20 వేల నగదును చెక్కు చెదరకుండా అప్పగించారు. బాబురావు నిజాయితీని మెచ్చుకొని మధిర టౌన్ పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది సమక్షంలో సీఐ ఘనంగా సన్మానించారు. ఇదే క్రమంలో విద్యుత్ శాఖ వైరా డివిజన్ డీఈ బండి శ్రీనివాసరావు, ఏడీఈ ఎం.అనురాధ, మధిర పట్టణ ఏఈ ఎస్. అనిల్ కుమార్, ఇతర విద్యుత్ శాఖ సిబ్బంది బాబురావును అభినందించారు.
Read Also- Warangal News: వరంగల్లో ఘర్షణకు దారి తీసిన భూ వివాదం.. తరిమికొట్టిన గ్రామస్తులు