Bride Murder: పెళ్లి వేళల్లో వరుడు, వధువు ఇరువైపుల కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య కొన్నిసార్లు చిన్నపాటి అభిప్రాయ బేధాలు ఏర్పడుతుంటాయి. కొన్నిసార్లు అవి పెద్ద గొడవలుగా మారడం కొత్తేమీ కాదు. అలంకరణ నుంచి వంటల వరకూ ఏదో ఒక చిన్నవిషయంలోనైనా ఇది బాగోలేదు, అవి సరిగా లేవంటూ వాగ్వాదాలు పెట్టుకుంటుంటారు. దీంతో, ఆనందోత్సాహాల మధ్య జరగాల్సిన వేడుకల్లో తగాదాలు, ఘర్షణలు చోటుచేసుకుంటుంటాయి. ఇరు కుటుంబ సభ్యుల మధ్య కొట్లాటలు, దాడులు జరిగిన శుభకార్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో తాజాగా ఇలాంటి ఘటన ఒకటి (Viral News) వెలుగుచూసింది.
పెళ్లికి గంట ముందు దారుణం జరిగిపోయింది. చీర, డబ్బు విషయంలో చోటుచేసుకున్న గొడవ కాబోయే వధువు హత్యకు (Bride Murder) దారితీసింది. అది కూడా కాబోయే వరుడే ఈ నేరానికి పాల్పడ్డాడు. శనివారం రాత్రి వివాహం జరగడానికి కేవలం గంట ముందు, ఒక యువతిని ఆమెకు కాబోయే భర్త హత్య చేశాడు. అది కూడా యువతి ఇంట్లోనే హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. ప్రభుదాస్ లేక్‌లోని టేకిరి చౌక్ దగ్గర ఈ ఘటన జరిగిందని చెప్పారు. చీర, డబ్బు విషయంలో జంట మధ్య వాగ్వాదం జరిగిందని, ఈ ఘర్షణే ఈ దారుణానికి దారితీసిందని వివరించారు.
Read Also- Warangal Cold Wave: ఉమ్మడి వరంగల్ జిల్లాలో చలి పంజా.. వృద్ధులు, పిల్లలు జాగ్రత్త అంటూ వైద్యుల సూచన
నిందితుడి పేరు సజన్ బారైయా అని, మృతురాలి పేరు సోనీ హిమ్మత్ రాథోడ్ అని పోలీసులు ప్రకటించారు. గత ఏడాదిన్నర కాలంగా వీరిద్దరూ కలిసి జీవించారని చెప్పారు. వివాహ నిశ్చితార్థం జరగడంతో వివాహ సంప్రదాయాలు చాలా వరకు పూర్తయ్యాయని, శనివారం రాత్రి వారికి పెళ్లి జరగాల్సి ఉండగా, ఘోరం జరిగిపోయిందని పేర్కొన్నారు. పెళ్లికి కేవలం గంట సమయం ముందు చీర, డబ్బు విషయంలో ఘర్షణ పడ్డారని తెలిపారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన సజన్, ఐరన్ పైపుతో సోనీని కొట్టాడని, ఆ తర్వాత ఆమె తలను గోడకేసి కొట్టాడని వివరించారు.
హత్య చేసిన తర్వాత మృతురాలి ఇంటిని కూడా నిందితుడు ధ్వంసం చేశాడని, అనంతరం అక్కడి పారిపోయాడని పోలీసులు వివరించారు. సమాచారం అందగానే తాము అక్కడికి చేరుకున్నామని వివరించారు. ఇరు కుటుంబాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ, ఆ జంట కలిసి ఉంటూ వచ్చారని, ఏడాదిన్నరపాటు సహజీవనం చేశారని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్ఆర్ సింఘాల్ మీడియాకు తెలిపారు.
మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించామని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ హత్య జరిగిన శనివారం నాడు నిందితుడు మరో వ్యక్తితో కూడా గొడవ పడ్డాడని, ఫిర్యాదు మేరకు దానిపై కూడా కేసు నమోదయిందని వివరించారు. ఇక, హత్య ఘటనపై కూడా ఫిర్యాదు అందిందని వెల్లడించారు.
