Viral News: గూగుల్ మాజీ ఉద్యోగిని తీసుకున్న ఓ కఠిన నిర్ణయం నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్ అయిన 37 ఏళ్ల ఫ్లోరెన్స్ పోరెల్ (Florence Poirel) వయసులో తనకంటే 17 ఏళ్లు పెద్దవాడైన జీవిత భాగస్వామితో హాయిగా గడిపేందుకు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రియుడి కోసం రూ.3.40 కోట్ల వార్షిక ఆదాయం వచ్చే ఉద్యోగాన్ని వదులుకున్నట్లు పోరెల్ స్వయంగా ప్రకటించడంతో ఆమె వ్యాఖ్యలు తీవ్ర చర్చకు కారణమయ్యాయి.
‘జీవితంలో అది ముఖ్యం’
స్విట్జర్లాండ్ జ్యూరిచ్ లోని గూగుల్ కంపెనీలో సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ గా ఫ్లోరెన్స్ పోరెల్ పనిచేశారు. అయితే ఉద్యోగంలో ఒత్తిడి, కుటుంబ సభ్యులకు సమయాన్ని కేటాయించలేకపోవడం వంటి ఇబ్బందుల కారణంగా తన జాబ్ కు రిజైన్ చేసినట్లు పోరెల్ ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. జాబ్, జీవితాన్ని సమతుల్యం చేయడం చాలా అవసరమని.. అది కుదరని పక్షంలో మీకు ఏది ముఖ్యమో తేల్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని పోరెల్ పేర్కొన్నారు.
రోజంతా ఉద్యోగానికే..
అయితే తన ఉద్యోగ జీవితం బాగానే ఉండేదని ఫ్లోరెన్స్ పోరెల్ తెలిపారు. మంచి టీమ్ తో పాటు పని ప్రదేశం ఆహ్లాదకరంగా ఉండేదని పేర్కొన్నారు. కానీ ప్రతీ రోజూ ఉద్యోగానికి తన పూర్తి సమయం అంకితమయ్యేదని పేర్కొన్నారు. కాబట్టి తన జీవిత భాగస్వామి అయిన జాన్ తో గడిపేందుకు అస్సలు టైమ్ కేటాయించలేకపోయానని వాపోయారు. రిటైర్ అయ్యాక జాన్ తో సమయం కేటాయించవచ్చులే అన్న ఆలోచనలకు తాను తలొగ్గలేకపోయానని పేర్కొన్నారు. దీంతో జాన్ కోసం తన జాబ్ ను వదులుకొని.. పూర్తి సమయాన్ని అతడితో గడపుతున్నట్లు తెలియజేశారు.
పదేళ్లుగా గూగుల్‌లోనే..
ఫ్లోరెన్స్ పోరెల్ జాబ్ విషయానికి వస్తే.. ఆమె పదేళ్ల పాటు గూగుల్ లో పనిచేశారు. డబ్లిన్ (ఐర్లాండ్) నుంచి జ్యూరిచ్ వరకు వివిధ యూరోపియన్ కార్యాలయాల్లో ఆమె వర్క్ చేశారు. 2024 నాటికి ఆమె సంవత్సరానికి $390,000 (రూ.3.40 కోట్లు) గా ఉంది. కానీ FIRE (Financial Independence, Retire Early) అనే ఆర్థిక స్వాతంత్రం ఉద్యమంలో భాగంగా ఆమె తన ఉద్యోగానికి రిజైన్ చేశారు. ఇప్పుడు విభిన్నమైన లక్ష్యాలతో ఆమె జీవితంలో చాలా సంతోషంగా ముందుకు సాగుతున్నారు. జాబ్ నుంచి తప్పుకునే సమయానికి తన సేవింగ్స్ $1.5 మిలియన్ (సుమారు రూ.12.6 కోట్లు)గా ఉందని పోరెల్ తెలిపారు. జాన్ సైతం తన ఉద్యోగానికి రిజైన్ చేశారని.. 18 నెలల పాటు ప్రపంచాన్ని చుట్టి రావాలని తాము నిర్ణయించుకున్నట్లు పోరెల్ వివరించారు.
Also Read: Ponnam Prabhakar: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అస్తవ్యస్తం.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
‘ప్రతీ క్షణాన్ని ఆస్వాదించడమే’
ఉద్యోగానికి రిజైన్ తర్వాత ఫ్లోరెన్స్ పోరెల్.. గతంలో ఎన్నడూ లేని విధంగా జీవితాన్ని ఆస్వాదిస్తోంది. జ్యూరిచ్ సరస్సులో ఈత కొట్టడం, ట్రావెల్ చేయడం, కెరీర్ పరంగా మహిళలకు మార్గ నిర్దేశం చేయడం వంటి పనుల్లో బిజీ బిజీ గడుపుతోంది. పెద్ద ఉద్యోగాన్ని వదులుకోవడం ఆర్థికంగా ఇబ్బందే అయినప్పటికీ.. గతంతో పోలిస్తే ఇప్పుడు తన జీవితం చాలా ప్రశాంతంగా సాగిపోతోందని అన్నారు. ‘జీవితం చాలా చిన్నది. చాలా అందమైనది కూడా. దానిలో ఎక్కువ భాగాన్ని పనిలో గడపడం కంటే మనసుకు ఆనందం ఇచ్చే వారితో అనుభవాలతో గడపడం బెటర్’ అని పోరెల్ చెప్పుకొచ్చారు.
