Shuttlecock shortage: ప్రపంచ బాడ్మింటన్ క్రీడాకారులు ఊహించని రీతిలో షటిల్‌కాక్స్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. అనూహ్యంగా ఫెదర్ షటిల్‌కాక్‌లకు (Shuttlecock shortage) తీవ్ర కొరత ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా జాతీయ బ్యాడ్మింటన్ సంఘాలు తమ ఆటగాళ్లకు నాణ్యమైన షటిల్స్‌కాక్స్ తెప్పించేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. కొన్ని సంఘాలైతే అధిక ధరలకు షటిల్‌కాక్స్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోంది. భారత బ్యాడ్మింటన్‌లో టాప్ ప్లేయర్లకు కేంద్రమైన హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో అయితే కేవలం రెండు వారాలకు సరిపడా కాక్స్ మాత్రమే ఉన్నాయని ‘ఇండియా టుడే’ కథనం పేర్కొంది. యూరప్‌లోని ఫ్రాన్స్ వంటి దేశాల్లో కూడా ఇదే సమస్య ఉన్నట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల అయితే జూనియర్ స్థాయి పోటీల్లో ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలన్న యోచన కూడా జరుగుతోంది. ఈ పరిణామం బాడ్మింటన్ క్రీడను ఒకింత షాక్‌కు గురిచేస్తోందని చెప్పాలి. షటిల్ లేకపోతే ఆటే జరగదని ప్లేయర్లు వాపోతున్నారు.
చైనాలో మారిన ఆహారపు అలవాట్లే కారణం..
అకస్మాత్తుగా షటిల్‌కాక్స్ కొరత ఏర్పడడంపై బాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) కార్యదర్శి సంజయ్ మిశ్రా స్పందించారు. కాక్స్ కొరత నిజమేనని ఆయన ధృవీకరించారు. చైనాలో మారిన ఆహారపు అలవాట్లు ఇందుకు కారణమని ఆయన చెప్పారు. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉండే చైనాలో ప్రస్తుతం ఆహార అలవాట్లు క్రమంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు బాతు (డక్), పెద్దబాతు (గూస్) మాంసాన్ని చైనీయులు బాగా ఇష్టంగా తినేవారు. అయితే, ప్రస్తుతం చైనా జనాలు ఎక్కువగా పంది మాంసం (పోర్క్) తింటున్నారు. చాలామంది ఈ మేరకు తమ అలవాటును మార్చుకున్నారు. చైనీయుల ఆహారపు అలవాట్లలో చోటుచేసుకున్న ఈ మార్పు కారణంగా, స్థానికంగా బాతు, పెద్దబాతు మాంసానికి డిమాండ్ గణనీయంగా పడిపోయింది. పర్యావసానంగా రైతులు కూడా బాతులు, పెద్దబాతుల పెంపకాన్ని తగ్గించేశారు. దీంతో, షటిల్‌కాక్ తయారీకి అవసరమన ఈకల సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
Read Also- GHMC: ప్రోపర్టీ ట్యాక్స్ వసూలుపై ఆఫీసర్లకు జీహెచ్‌ఎంసీ టార్గెట్లు!
రెక్కలు లేకంటే కాక్స్ కష్టమే
షటిల్‌కాక్‌ల తయారీలో పౌల్ట్రీ పరిశ్రమ చాలా కీలకమైనది. బాతుల రెక్కలను పౌల్ట్రీ పరిశ్రమలే అందిస్తుంటాయి. సాధారణ షటిల్స్‌కాక్‌లను బాతు ఈకలతో తయారు చేస్తారు. అత్యుత్తమ ప్రమాణం కలిగిన షటిల్స్‌కాక్స్ కావాలంటే పెద్దబాతు (గూస్) ఈకలు తయారవుతాయి. క్వాలిటీ కలిగిన షటిల్‌కాక్స్ అన్నీ పెద్దబాతు రెక్కలతోనే తయారవుతాయని బాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి సంజయ్ మిశ్రా తెలిపారు. కాక్స్ తయారు చేసే యోనెక్స్ కంపెనీ జపాన్‌కి చెందినదే అయినా, షటిల్స్ తయారీ మొత్తం చైనాలోనే జరుగుతుందని వెల్లడించారు. ప్రస్తుతం చైనాలో బాతు, పెద్దబాతు మాంసం తినేవారు తగ్గిపోయారని, ఈ కారణంగా ఫ్యాక్టరీలకు రెక్కలు అందడం లేదని వివరించారు. కాగా, ఒక్క షటిల్‌కాక్ తయారికి 16 రెక్కలు అవసరం అవుతాయి. ఎంత క్వాలిటీతో తయారు చేసినా త్వరగానే పాడైపోతాయి. ఒక్క సింగిల్స్ మ్యాచ్‌కే సుమారు రెండు డజన్ల షటిల్స్ అవసరమవుతాయి. అందుకే ప్రస్తుతం షటిల్‌కాక్స్ కొరత ముదురుతోంది. ప్లేయర్లకు, అకాడమీలకు, దేశవాళీ బ్యాడ్మింటన్ సంఘాలకు సంక్షోభంగా మారింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చర్యలు మొదలుపెట్టిందని, విషయాన్ని బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) దృష్టికి తీసుకెళ్లినట్టు సంజయ్ మిశ్రా తెలిపారు.
Read also- Election Commission: ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఈసీ కీలక ప్రకటన