Iceland Mosquitoes: మనదేశంతో పాటు మరికొన్ని దేశాల్లో దోమల బెడద చాలా ఎక్కువగా ఉంది. ఎంతలా అంటే, ఈ దోమల కారణంగా ప్రతిఏటా లక్షలాది మంది రోగాల బారిన పడుతున్నారు. ఇందుకు పూర్తి విరుద్ధంగా ఐస్‌లాండ్ దేశస్థులకు ఇంతవరకు అసలు దోమకాటు ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ, అదంతా చరిత్రగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే, ఆ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి దోమల జాడను శాస్త్రవేత్తలు (Iceland Mosquitoes) గుర్తించారు. చల్లని గాలులు, మంచుతో కప్పి అద్భుత దృశ్యాలు కనిపించే ఆ దేశంలో దోమల జాడను ఈ వారంలో అధికారికంగా ధ్రువీకరించారు. దీంతో, ఈ భూమిపై ప్రస్తుతం ఒక్క అంటార్కిటికా మాత్రమే దోమలు లేని ఏకైక ప్రాంతంగా మిగిలిపోయింది.
ఐస్‌లాండ్ రాజధాని రెయ్‌క్యావిక్‌కు ఉత్తర దిశలో ఉండే క్జోస్ ప్రాంతంలోని ఒక పొలంలో మూడు ‘క్యూలిసెటా అన్నులటా’ (Culiseta annulata) జాతి దోమలను గుర్తించినట్టు ‘నేచురల్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఐస్‌లాండ్’ అక్టోబర్ 21న అధికారిక ప్రకటన చేసింది. బ్యార్న్ హాల్టాసన్ అనే కీటకాల ఔత్సాహికుడు వీటి జాడను పసిగట్టారు. అక్టోబర్ 16న సాయంత్రం సమయంలో ఎర్రని రంగులో ఉన్న వైన్ రిబ్బన్‌పై ఒక వింతగా ఉన్న కీటకాన్ని చూసి, వెంటనే దాన్ని పట్టుకున్నాని ఆయన తెలిపారు. దానిని పరిశీలించగా అదొక ఆడ దోమ అని అర్థమైందన్నారు. ఆ తర్వాత మరికొన్నింటిని గుర్తించి పట్టుకున్నానని, వాటిని అధికారులకు అప్పగించానని వివరించారు. తాను పట్టుకున్న మూడు దోమల్లు రెండు ఆడవి, ఒక మగ దోమ ఉన్నట్టు ధృవీకరించారని బ్యార్న్ హాల్టాసన్ వివరించారు.
ఇది దేనికి సంకేతం?
ఐస్‌లాండ్‌లో దోమల ఉనికి గుర్తించడాన్ని కేవలం దోమకాటు ఇబ్బందులకు సంబంధించిన అంశంగా పరిగణించలేం. వాతావరణ మార్పులకు ఒక సంకేతంగా భావించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐస్‌లాండ్‌లో వాతావరణం వేడెక్కుతోందని చెప్పే లక్షణమని విశ్లేషిస్తున్నారు. ప్రపంచ వాతావరణ మార్పు (Climate Change) తీవ్ర ప్రభావాన్ని సూచిస్తుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా, ఆర్కిటిక్ ప్రాంతం ప్రపంచ సగటు కంటే రెట్టింపు వేగంతో హీటెక్కుతోందని సూచిస్తున్నారు. నిజానికి క్యూలిసెటా అన్నులటా దోమలు యూరప్‌తో పాటు చల్లటి వాతావరణం ఉండే మరికొన్ని దేశాల్లో కనిపిస్తుంటాయి. ఇవి కొంతవరకు చలిని తట్టుకోగలవు. పాత భవనాలు, భూమిలోపలి రంద్రాలు, లేదా గోతుల్లో ఉంటాయి. అయితే, విపరీతమైన చల్లటి వాతావరణం ఉండే ఐస్‌లాండ్‌లో మాత్రం గతంలో ఎప్పుడూ దోమలు పెరిగిన దాఖలాలు లేవు. గతంలో కొన్నిసార్లు కేవలం విమానాల్లో మాత్రమే గుర్తించారు. ఇతర దేశాల నుంచి వచ్చినట్టుగా గుర్తించారు.
Read Also- Hydra: మూసీ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్.. ఆధారాలతో నోటీసులు ఇవ్వడానికి సిద్ధం!
కానీ, ప్రస్తుతం దోమలు గుర్తించడాన్ని పూర్తిగా భిన్నంగా చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు సంకేతమని వాతావరణ నిపుణులు అంటున్నారు. దోమలు వంటి కీటకాలు స్థిరంగా బతకగలిగేలా వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని భావిస్తున్నారు. ప్రస్తుతం గుర్తించిన దోమలు అంటువ్యాధులకు కారణం కాకపోవచ్చు. కానీ, ఈ పరిస్థితులు భవిష్యత్తులో మరింత హానికరమైన దోమల జాతులు పెరగడానికి దారి తీయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దోమలు మాత్రమే కాకుండా, ఇటీవలి కొన్ని సంవత్సరాల్లో మరిన్ని కొత్త కీటక జాతులను గుర్తించడంతో అక్కడి మారిపోతున్న వాతావరణ పరిస్థితులకు, అక్కడి జీవావరణం మారిపోతోందనడానికి నిదర్శనమని విశ్లేషిస్తున్నారు. దోమలు చాలా చిన్నవే అయినా ఐస్‌లాండ్‌లో వాటి గుర్తింపుతో, మొత్తం భూమిపై వేడెక్కుతున్న మంచు ఖండాలు, నెమ్మదిగా కరిగిపోతున్న పరిస్థితికి ఒక గట్టి హెచ్చరికగా భావించవచ్చు.
Read Also- Mehul Choksi: రూ.13 వేల కోట్లు దోచిన మెహుల్ ఛోక్సీకి.. జైల్లో రాజ భోగాలు.. సౌకర్యాలు తెలిస్తే షాకే!
మరోవైపు, అంతర్జాతీయ ప్రయాణాల కారణంగా మొక్కలు, లేదా కీటకాలు తమ సహజ ఆవాసాలను దాటి ఇతర కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తాయని చెప్పడానికి చక్కని ఉదాహరణ అని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. తాజాగా, ఐస్‌లాండ్‌లో గుర్తించిన దోమలు పెద్ద మొత్తంలో దేశంలోకి వస్తున్న సరుకు రవాణా ద్వారా ప్రవేశించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రపంచీకరణ పెరిగే కొద్దీ ఇలాంటి మార్పులు కనిపించడం సర్వసాధారణమని అంటున్నారు. ఏదేమైతేనేం.. చివరికి, ఐస్‌లాండ్ ప్రజలు కూడా త్వరలోనే దోమకాటుకు గురవ్వబోతున్నారన్న మాట!
