Viral News: బీహార్ రాజధాని పట్నాలో ఇటీవల ‘డాగ్ బాబు’ (Dog Babu) అనే పేరు మీదుగా ఓ పెంపుడు కుక్కకు నివాస ధ్రువీకరణ పత్రం జారీ కావడం తీవ్ర వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ షాకింగ్ ఘటన మరవకముందే ఇదే తరహా మరో ఆసక్తికర ఘటన (Viral News) బీహార్‌లోనే చోటుచేసుకుంది. ఈసారి నవాదా జిల్లాలో ‘డాగేశ్ బాబు’ (Dogesh Babu) అనే పేరిట ఓ కుక్క ఫొటోతో నివాస ధ్రువీకరణ పత్రం కోసం అప్లికేషన్ పెట్టారు. దరఖాస్తుకు ఓ కుక్క ఫొటోను కూడా జత చేశారు. ఈ దరఖాస్తును గుర్తించిన జిల్లా అధికార యంత్రాంగం సీరియస్‌గా తీసుకుని చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది.
ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తీసుకున్న నవాదా జిల్లా కలెక్టర్ రవీ ప్రకాశ్ స్పందిస్తూ, ఆర్టీపీఎస్ (Right to Public Service) పోర్టల్ దుర్వినియోగంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలంటూ పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనపై ఎక్స్ వేదికగా కలెక్టర్ స్పందించారు. ‘‘కాపీక్యాట్స్ కాదు… కాపీ డాగ్స్!. రాజౌలి, సిర్దాలలో నివాస ధ్రువీకరణ కోసం కుక్కల పేరిట దరఖాస్తు చేసిన వారిని పట్టుకున్నాం. ఇదొక హాస్యప్రయోగమే కావచ్చు. కానీ, పటిష్టమైన పరిపాలనా వ్యవస్థను చెడగొట్టే ప్రయత్నం కూడా అవుతుంది. బాధ్యులపై చర్యలు తప్పవు’’ అని ఆయన హెచ్చరించారు. అధికారిక వ్యవస్థలు, ప్రక్రియలతో ఈ తరహాలో ఆటలాడుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన స్పష్టం చేశారు.
అప్లికేషన్‌లో వివరాలివే
పెంపుడు కుక్కకు నివాస ధ్రువీకరణ సర్టిఫికెట్ కోరుతూ ఆన్‌లైన్‌లో చేసిన దరఖాస్తు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కుక్క పేరు: ‘డాగేశ్ బాబు’, తండ్రి పేరు: డాగేష్ పప్పా, తల్లి పేరు: డాగేశ్ మామీ, గ్రామం: ఖరోంధ్, వార్డ్ నంబర్: 11, పోస్ట్: షెర్పూర్, బ్లాక్ అండ్ జోన్: షెర్పూర్, సిర్దాల, జిల్లా: నవాదా అని వివరాలు పేర్కొన్నారు. కుక్క లింగాన్ని ‘పురుషుడు’ అని పేర్కొన్నారు. ఈ విధంగా ఆర్టీపీఎస్ పౌర సేవా పోర్టల్‌ను తప్పుదారి పట్టించడంపై అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. దురుద్దేశంతో, మోదీ పథకాలను హాస్యాస్పదంగా మార్చేలా చేసిన ఈ ప్రయత్నంపై విచారణ మొదలైందని అధికారులు వివరించారు. ఎఫ్ఐఆర్ నమోదయిందని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
Read Also- Health: ఎక్స్‌ట్రా ఉప్పు వేసుకొని తింటున్నారా?.. శరీరంలో ఏం జరుగుతుందంటే?
ఈ ఘటనపై సంబంధిత అధికారులు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారత శిక్షాస్మృతి (IPC), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 (IT Act)లలోని పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సెక్షన్ 319(2)- మోసం (Fraud), సెక్షన్ 340(1), (2) -ఎలక్ట్రానిక్ రికార్డుల మోసపూరిత వినియోగం, సెక్షన్ 241 -ఏమార్చడం (Forgery), ఐటీ చట్టం సెక్షన్ 66డీ – కంప్యూటర్ వనరులను ఉపయోగించి తప్పుదారి పట్టించడం సెక్షన్లను పేర్కొన్నారు.
కాగా, ఇటీవలే బీహార్‌లోని పాట్నాలో మరో పెంపుడు కుక్క పేరిట కూడా నివాస ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు దాఖలైంది. పట్నా జిల్లా మసౌరిలో ‘డాగ్ బాబు’ (Dog Babu) పేరిట అప్లికేషన్ జారీ చేయగా, నివాస ధ్రువీకరణ పత్రం కూడా జారీ కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.