Danish Zoo: డెన్మార్క్‌లోని ఆల్బోర్గ్ జూ (Aalborg Zoo) నిర్వాహకులు ప్రజలకు విచిత్రమైన విజ్ఞప్తిని చేశారు. మీకు అవసరంలేని పెంపుడు జంతువులను.. జూలోని క్రూరమృగాలకు ఆహారంగా ఇవ్వాలని ఇన్ స్టాగ్రామ్ వేదికగా కోరారు. దీనిపై పన్నురాయితీని సైతం అందిస్తామని ఆఫర్ ఇచ్చారు. అయితే దీనికి ప్రజల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు జూ నిర్వాహకుల ప్రకటనను తప్పుబడుతుంటే.. మరికొందరు వారి సూచన మేరకు కోళ్లు, కుందేళ్లు, గినియా పిగ్స్ వంటి వాటిని జూలో విడిచిపెడుతున్నారు. అయితే జూ అలా ఎందుకు పిలుపునిచ్చింది? దీనిపై స్థానికుల రియాక్షన్ ఏ విధంగా ఉంది? ఈ కథనంలో పరిశీలిద్దాం.
జూ అధికారులు ఏమంటున్నారంటే?
జూ నిర్వాహకులు వివరణ ప్రకారం.. ప్రజలు పెంచుకునే కొన్ని పెంపుడు జంతువులు.. జూలోని క్రూరమృగాల ఆహారంలో ముఖ్యమైన భాగం. కాబట్టి వృత్తిపరమైన బాధ్యత రిత్యా జంతువుల సంక్షేమం మాకు అత్యంత కీలకం. రొటీన్ గా ఒకటే పెట్టడం కంటే అడవిలో అవి వేటాడే విభిన్నమైన జంతువులను ఆహారంగా అందించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల జంతువుల సహజమైన ప్రవర్తనను కాపాడంతో పాటు వాటికి పోషకాహారం అందించనట్లు అవుతుంది. ఆహారం కూడా వృథా కాదు’ అని జూ చెప్పుకొచ్చింది.
గుర్రాన్ని దానం చేసిన మహిళ
జూ అధికారులు ఇచ్చిన పిలుపుతో పెర్నిల్లే సోహల్ (44) అనే మహిళ ముందుకు వచ్చారు. కూతురు పెంచుకుంటున్న పోనీ (చిన్న గుర్రం)ని జూ అధికారులకు ఇచ్చివేశారు. పోనీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని సోహల్ తెలిపారు. ఇది తన కూతురికి షాకింగ్ ఉన్నప్పటికీ దానిని జూ అధికారులకు ఇచ్చివేసినట్లు చెప్పారు. ‘మీ పెంపుడు జంతువును జూలోని మృగాలకు ఆహారంగా ఇవ్వడం బాధగా, వింతగా అనిపించవచ్చు. కానీ అవి అనారోగ్యం వల్ల అప్పటికే చనిపోయిన స్థితిలో ఉంటాయి. వాటిని ఇవ్వడం ద్వారా మరో జీవిని బతికించే అవకాశం ఉంటుంది’ అని సోహల్ చెప్పుకొచ్చారు.
జూ పిలుపునకు విశేష స్పందన
ఆల్బోర్గ్ జూ ఇచ్చిన పిలుపునకు స్థానికుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇప్పటివరకు 22 గుర్రాలు, 18 గినియా పిగ్స్, 53 కోళ్లు, 137 కుందేళ్లను ప్రజలు దానం చేశారు. దాతలకు చిన్న జంతువులపై DKK 100 (సుమారు రూ.1,364), పెద్ద జంతువుల (గుర్రాలు వంటి) బరువును బట్టి కిలోకు DKK 5 (రూ.68) పన్ను రాయితీ లభిస్తుంది. అయితే దాతలు ఇచ్చిన పెంపుడు జంతువులను నేరుగా క్రూరమృగాలు ఆహారంగా పెట్టమని జూ అధికారులు తెలిపారు. వాటి వల్ల మృగాలకు ఎలాంటి అనారోగ్య సమస్య రాదని నిర్ధారించుకున్న తర్వాతే అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
Also Read: Viral Video: ఎద్దుల బండి చక్రాలతో.. విచిత్రమైన కారు.. ఇక వరద నీటిలోనూ ఆగేదేలే!
తప్పుబడుతున్న పలువురు
జూ అధికారుల విజ్ఞప్తిని పలువురు స్వాగతిస్తున్నప్పటికీ మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. దీనిని హేయమైన నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు. ఈ వివాదస్పద పద్దతిని జూ అధికారులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంతో ప్రేమగా పెంచుకునే పెంపుడు జంతువులను.. చూస్తూ చూస్తూ క్రూరమృగాలకు ఆహారంగా పెట్టాలా? అంటూ మండిపడుతున్నారు. మెుత్తంగా ఆల్బోర్గ్ జూ ఇచ్చిన పిలుపు.. డెన్మార్క్ సహా ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.