Health: ఆరోగ్యానికి సంబంధించి చాలా మందిలో కొన్ని అపోహలు (Myths) ఉంటాయి. అవగాహనా లోపాలు, పూర్వీకులు లేదా తెలిసినవారి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి కారణంగా ఈ అపోహలు బలంగా నాటుకుపోతుంటాయి. అల్సర్‌కు (కడుపులో పుండ్లు) (Health) సంబంధించిన కొన్ని సాధారణ అపోహలు ఉన్నాయి. కారం లేదా మసాలా పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల లేదా ఎక్కువ ఒత్తిడి కారణంగా అల్సర్లు వస్తాయని చాలామంది భావిస్తుంటారు. అయితే, అల్సర్ల వెనుకున్న అసలు నిజాలను సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజీ, హేపటాలజీ డా. సురక్షిత్ టీకే ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
అల్సర్లకు అసలైన కారణాలను తెలుసుకుంటే చాలామంది నమ్మే ప్రమాదకరమైన అపోహలను తొలగించవచ్చని సురక్షిత్ అన్నారు. అల్సర్లు వైద్యపరమైన వ్యాధులే అయినప్పటికీ సరైన నిర్ధారణ, చికిత్స అవసరమవుతుందన్నారు. ఒత్తిడి తగ్గించుకోవడం, మద్యం, పొగతాగడం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిదే కానీ, అల్సర్లకు ఇవే కారణమవుతాయనుకోవడంలో నిజం లేదని ఆయన చెప్పారు. అల్సర్లకు సంబంధించిన కొన్ని అపోహలపై ఆయన వివరణ ఇచ్చారు.
అపోహ 1: ఒత్తిడి అల్సర్లకు కారణం
అసలు నిజం: అల్సర్లకు సంబంధించిన అతిపెద్ద అపోహల్లో ఇదొకటి. భావోద్వేగం లేదా శారీరక ఒత్తిడి అల్సర్ సమస్యను మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది. అంతేకానీ, అల్సర్‌కు ఒత్తిడి మూలకారణం కానే కాదు. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ లేదా కొన్ని మందుల వాడకం ఎక్కువశాతం అల్సర్లకు కారణమని అనేక అధ్యయనాల్లో తేలింది.
అపోహ 2: మసాలా పదార్థాలు అల్సర్లకు కారణం
నిజం ఇదే: మసాలా పదార్థాలు (Spicy foods) అల్సర్ ఉన్నవారికి మరింత అసౌకర్యాన్ని కలగజేస్తాయి. అయితే, అల్సర్ రావడానికి ప్రధాన కారణం మాత్రం కాదు. మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ (Capsaicin) అనే పదార్థానికి కడుపులో అంతఃపొరను కొంతవరకు రక్షించే లక్షణాలు ఉన్నట్టు పలు పరిశోధనలు తేలింది. హెలికోబ్యాక్టర్ పైలోరి (Helicobacter pylori) అనే బ్యాక్టీరియా లేదా ఎన్‌ఎస్ఏఐడీల ((నాన్-స్టీరాయిడల్ యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ ఔషధాలు) వంటివి ఎక్కువగా ఉపయోగించడం వల్ల అల్సర్లు వస్తాయని గుర్తుంచుకోవాలి. మసాలాలు, ఒత్తిడి వంటి కారణాలు సమస్య తీవ్రతను పెంచుతాయి.
Read Also- PM Modi: యూకేతో భారత్ కీలక ఒప్పందం.. మోదీ సంచలన వ్యాఖ్యలు
అపోహ 3: అల్సర్లు జీవితాంతం ఉంటాయి
అసలు నిజం: ఒకసారి అల్సర్ వచ్చిందంటే జీవితాంతం బాధపడాల్సిందేనని చాలామంది అనుకుంటారు. కానీ, ఇది నిజం కాదు. హెచ్.పైలోరి బ్యాక్టీరియా లేదా నొప్పి నివారణ మందుల వల్ల కలిగే అల్సర్లకు సరైన వైద్యం తీసుకుంటే పూర్తిగా నయం అవుతాయి. అల్సర్‌కు కారణమైన అంశానికి దూరంగా ఉండి, కడుపు అంతఃపొరకు విరామం ఇవ్వగలిగితే పేషెంట్లు పూర్తిగా కోలుకునే ఛాన్స్ ఉంటుంది.
Read Also- NISAR: 30న ఇస్రో భారీ ప్రయోగం.. రూ.10,816 కోట్ల ఖర్చు
అపోహ 4: అల్సర్లు పెద్దవాళ్లకే వస్తాయి
నిజం ఇదే: ఎక్కువ ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడిపే పెద్దవాళ్లకే అల్సర్లు వస్తాయని భావిస్తుంటారు. కానీ, హెచ్.పైలోరి ఇన్ఫెక్షన్ చిన్నతనంలోనే కూడా వస్తుంది. ఇలాంటివారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. పిల్లలకు కూడా అల్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. సహజంగా అయితే పెద్దవారిలో అల్సర్ లక్షణాలను నమోదు చేస్తుంటారు. అల్సర్లు ఏ వయసులోనైనా వచ్చే అవకాశం ఉంది. చిన్నపిల్లలు లేదా టీనేజర్లు పదేపదే పొట్ట నొప్పి అంటూ బాధపడుతుంటే అలసత్వం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
అపోహ 5: అల్సర్లకు స్పష్టమైన లక్షణాలు ఉంటాయి
వాస్తవం ఇదే: అల్సర్లు వస్తే కచ్చితంగా తీవ్రమైన కడుపు నొప్పి వంటి స్పష్టమైన లక్షణాలు ఉంటాయని చాలా మంది అపోహపడుతుంటారు. కానీ, కొన్ని అల్సర్లు నిశ్శబ్దంగా, అంటే బయటకు తెలియని లక్షణాలతో కూడా ఉండవచ్చు. మొదట్లో పెద్దగా ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు. కొందరిలో కొద్దిపాటి అసౌకర్యం, వాంతులు అవుతాయనే భావన ఉంటుంది. అల్సర్ రక్తస్రావాన్ని మొదలుపెట్టినప్పుడే దానిని గుర్తింపు సాధ్యమవుతుంది.
గమనిక: సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథాతథంగా అందించాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.