Clerk Assets: అతడొక ప్రభుత్వ విభాగంలో పనిచేసే క్లర్క్ (Clerk Assets). నెల జీతం రూ.15 వేలు మాత్రమే. కానీ, నమ్మశక్యంకాని రీతిలో ఏకంగా 24 ఇళ్లు, 40 ఎకరాల భూమి, 4 వాహనాలు సంపాదించాడు. ఇదంతా ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారా?.. దీనికి సమాధానం అవినీతి. కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలో (KRIDL) పనిచేసిన ఓ మాజీ క్లర్క్ ఇంటిపై లోకాయుక్త అధికారులు శుక్రవారం రోజున దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆ మాజీ క్లర్క్ వద్ద ఏకంగా రూ.30 కోట్లకు మించిన అక్రమాస్తులను గుర్తించారు.
నెల జీతం రూ.15,000 అయినప్పటికీ పెద్ద మొత్తంలో అక్రమ సంపద కూడబెట్టాడని తేల్చారు. ఏకంగా 24 ఇళ్లు, 40 ఎకరాల వ్యవసాయ భూమి సంపాదించాడని పత్రాల ద్వారా గుర్తించారు. జిల్లా కేంద్రమైన కోప్పల్‌లో పనిచేసిన కలకప్ప నీడగుండి అనే వ్యక్తి భారీ అవినీతికి పాల్పడ్డాడని అధికారులు గుర్తించారు. 24 ఇళ్లు మాత్రమే కాదు, 4 ప్లాట్లు, 4 వాహనాలు, 350 గ్రాముల బంగారం, 1.5 కిలోల వెండి అతడి వద్ద ఉన్నాయని గుర్తించారు. ఈ ఆస్తులన్నీ అతడి పేరు మీద, అతడి భార్య, భార్య సోదరుడి పేర్లపై రిజిస్టర్ చేయించాడని అధికారులు వెల్లడించారు.
Read Also- Anil Ambani: అనిల్ అంబానీకి ఈడీ ఊహించని షాక్.. రెండు కీలక పరిణామాలు
రూ.72 కోట్లు మాయం
క్లర్క్ కలకప్ప నీడగుండి, మాజీ ఇంజనీర్ జేఎం చించోల్కర్ ఇద్దరూ కుమ్మక్కు అయ్యి 96 అసంపూర్తి ప్రాజెక్టులకు సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, ప్రభుత్వానికి ఏకంగా రూ.72 కోట్లకు పైగా నష్టం కలిగించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం లోకాయుక్త అధికారులు ఈ కేసును పూర్తిగా విచారిస్తున్నారు.
కర్ణాటకలో ముమ్మరంగా దాడులు
స్థాయికి మించి ఎక్కువ ఆస్తులు కూడబెట్టిన ప్రభుత్వ ఉద్యోగులపై కర్ణాటక లోకాయుక్త అధికారులు వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భారీ స్థాయిలో అక్రమ ఆస్తులను వెలికి తీస్తున్నారు. జులై 23న లెక్కకు మించిన ఆస్తుల కేసులో ఓ ఐఏఎస్ అధికారితో పాటు 8 మంది అధికారుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. మొత్తం రూ. 37.42 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులు బెంగళూరు అర్బన్, మైసూరు, తుమకూరు, కలబుర్గి, కొప్పల్, కొడుగు జిల్లాల్లోని 41 ప్రాంతాల్లో కొనసాగాయి. ఏఎస్ అధికారిణి వసంతి అమర్ బీవీ.. బెంగళూరు సబ్ అర్బన్ రైల్వే ప్రాజెక్ట్ (BSRP) భూ సేకరణ బాధ్యతను నిర్వహించారు. ఆ సమయంలో భారీగా ఆస్తులు కూడబెట్టారు. ప్రస్తుతం కర్ణాటక రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కంపెనీలో (K-RIDE) స్పెషల్ డెప్యూటీ కమీషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వసంతి నివాసంలో రూ. 9.03 కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. ఇందులో 3 స్థలాలు, 4 ఇళ్లు, 3 ఎకరాల వ్యవసాయ భూమి (రూ. 7.4 కోట్లు), బంగారు నగలు (రూ. 12 లక్షలు), వాహనాలు (రూ. 90 లక్షలు) ఉన్నాయి. జులై 30న (మంగళవారం) కూడా రాష్ట్రంలో మరో దఫా దాడులు జరిగాయి. హసన్, చిక్కబళ్లాపుర, చిత్రదుర్గ, బెంగళూరు జిల్లాల్లోని ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లపై లోకాయుక్త అధికారులు దాడులు నిర్వహించారు.
Read also- Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రాపై బీసీసీఐ కీలక ప్రకటన