Chinese Woman: చైనాలో విచిత్రకర ఘటన చోటుచేసుకుంది. షాన్‌గ్జి ప్రావిన్స్ (Shanxi province)కి చెందిన ఓ మహిళ జైలు శిక్ష నుంచి తప్పించుకునేందుకు తన గర్భాన్ని ఆయుధంగా వాడుకుంది. ప్రస్తుతం ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చెన్ హాంగ్ (Chen Hong) అనే మహిళకు మోసం (Fraud) కేసులో 5 ఏళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. అయితే చైనా చట్టంలోని ఒక లూప్‌హోల్‌ను (ఖాళీదారిని) ఉపయోగించుకుని ఆమె నాలుగేళ్లలో మూడు సార్లు గర్భం దాల్చి జైలు శిక్షను వాయిదా వేసుకుంది. చైనా చట్టం ప్రకారం గర్భిణులు లేదా పాలిచ్చే తల్లులు జైలు బయట (స్థానిక అధికారుల పర్యవేక్షణలో) శిక్ష అనుభవించవచ్చు. ఈ నిబంధనను చెన్ హాంగ్ వాడుకొని నాలుగు ఏళ్లలో ఒకే వ్యక్తితో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది.
కేసు వెలుగులోకి ఎలా వచ్చిందంటే?
2023 మేలో తనిఖీ సమయంలో అధికారులు ఆమెకు మూడో సంతానం పుట్టిందని గుర్తించారు. కానీ ఆ శిశువు హౌస్‌హోల్డ్ రిజిస్ట్రేషన్ (హౌస్ నంబర్) ఆమె మరిది భార్య (అంటే ఎక్స్-హస్బెండ్ సిస్టర్-ఇన్-లా) పేరుతో నమోదు చేయబడింది. విచారణలో చెన్ హాంగ్ తనకు విడాకులు అయ్యాయని మొదటి ఇద్దరు పిల్లలు మాజీ భర్త దగ్గరే ఉన్నారని మూడో బిడ్డను మాజీ భర్త సోదరికి ఇచ్చేశానని అంగీకరించింది.
అధికారుల చర్య
చెన్ హాంగ్ తన గర్భాన్ని ఉద్దేశపూర్వకంగా వాడుకొని జైలు తప్పించుకుంటోందని స్థానిక ప్రాసిక్యూటర్ కార్యాలయం గుర్తించింది. శిక్ష పూర్తవడానికి ఏడాది కంటే తక్కువ సమయం మిగిలి ఉండటంతో ఆమెను నేరుగా జైలుకు పంపకుండా డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. అక్కడ చట్టపరమైన బాధ్యతలు, విధులు వివరించి, శిక్షను పూర్తి చేయించేలా చర్యలు తీసుకున్నారు.
నెటిజన్ల రియాక్షన్..
ఈ ఘటనపై చైనా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక యూజర్ వ్యాఖ్యానిస్తూ ‘తల్లి జైలు శిక్ష తప్పించడానికి మాత్రమే పుట్టిన ఆ ముగ్గురు పిల్లలు దురదృష్టవంతులు’ అని అన్నాడు. మరొకరు స్పందిస్తూ.. ‘కోరుకున్న ప్రతీసారి గర్భం దాల్చగల ఆమె శక్తి, సామర్థ్యాలు చూస్తే ఆశ్చర్యంగా ఉంది’ అని కామెంట్ చేశారు.
గతంలోనూ అంతే..
జైలు శిక్ష తప్పించుకునేందుకు గర్భాన్ని ధరించడం ఇదే తొలిసారి కాదు. చైనాలో ఈ తరహా ఘటనలు గతంలోనూ నమోదయ్యాయి. జెంగ్ అనే మహిళకు 2005లో ఓ అవినీతి కేసులో జీవితఖైదు పడింది. దీంతో ఆమె 10 ఏళ్లలో 14 సార్లు గర్భం దాల్చానని క్లెయిమ్ చేసింది. అందులో 13 నిజమే అని తేలింది. ఈ కారణంగా ఆమె కూడా దశాబ్దం పాటు జైలు తప్పించుకొని చివరికి శిక్ష అనుభవించాల్సి వచ్చింది.
Also Read: Threat to TDP MLA: రూ.2 కోట్లు ఇస్తావా.. లేదంటే చస్తావా.. టీడీపీ ఎమ్మెల్యేకు వార్నింగ్
చైనాలో జైలు శిక్షకు మినహాయింపులు
కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేరస్తులు జైలు బయట శిక్ష అనుభవించేందుకు చైనాలోని చట్టాలు అనుమతి ఇచ్చాయి. తీవ్ర అనారోగ్యం – బలహీన ఆరోగ్య పరిస్థితి, గర్భం – పాలిచ్చే కాలం, స్వయం సంరక్షణలో అసమర్థత, మానసిక లేదా శారీరక లోపాలు ఉన్నవారు జైలు బయట శిక్ష అనుభవించేందుకు వెసులుబాటు ఉంది. పైన పేర్కొన్న సందర్భాల్లో కమ్యూనిటీ కరెక్షన్ పర్యవేక్షణలో వారు ఉంటారు. వారిని ఎప్పటికప్పుడు స్థానిక అధికారులు పర్యవేక్షిస్తుంటారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి గర్భం లేదా అనారోగ్య నివేదికలను వారు కోర్టు లేదా జైలు అధికారులకు సమర్పిస్తూ ఉండాలి.