Threat to TDP MLA: అధికార టీడీపీ ఎమ్మెల్యేకు అందిన ఓ బెదిరింపు లేఖ ఏపీలో సంచలనం సృష్టిస్తోంది. నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి (Vemireddy Prashanthi Reddy)ని బెదిరిస్తూ ఓ వ్యక్తి లేఖ రాశారు. రూ. 2 కోట్లు ఇవ్వాలని.. లేదంటే చంపేస్తానని లేఖలో బెదిరించాడు. ఈనెల 17న ఎమ్మెల్యే ఇంటికి మాస్క్ పెట్టుకొని వచ్చిన నిందితుడు.. ఆమె సిబ్బందికి ఈ లేఖ అందజేసినట్లు తెలుస్తోంది. తాజాగా దానిని తెరిచి చూడగా అందులో బెదిరింపులు ఉండటాన్ని చూసి ఎమ్మెల్యే షాక్ కు గురైనట్లు సమాచారం. దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
పోలీసుల అదుపులో అనుమానితులు!
ఎమ్మెల్యే ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కోవూరు పోలీసులు.. ఈ వ్యవహారంలో అల్లూరు మండలం ఇస్కంపాళెంకు చెందిన ఓ వ్యక్తిని అనుమాతుడిగా గుర్తించినట్లు తెలుస్తోంది. అతడ్ని అదుపులోకి సైతం తీసుకున్నట్లు సమాచారం. అతడితో పాటు ఎమ్మెల్యే ఇంటి వద్ద అనుమానస్పదంగా తిరుగుతున్న మరో వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నారని సమాచారం. మరోవైపు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ (SP Krishnakanth) సైతం బెదిరింపు లేఖను ధ్రువీకరించారు. విచారణ అనంతరం త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.
Also Read: Indian Railways: రైళ్లల్లో బాగా వేధిస్తున్న సమస్య ఎంటో తెలుసా? లక్షకు పైగా ఫిర్యాదులు దానిపైనే!
వైసీపీ నేతతో మాటల యుద్ధం
వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (Nallapareddy Prasanna Kumar Reddy), టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మధ్య జరిగిన మాటల యుద్ధం ఇటీవలే రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 2025 జూలై 7న నెల్లూరు జిల్లాలోని పడుగుపాడు గ్రామంలో జరిగిన ఒక వైసీపీ (YSRCP) సమావేశంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె వివాహం గురించి వ్యక్తిగత ఆరోపణలు చేశారు. ఆమె తన భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బ్లాక్‌మెయిల్ చేసి వివాహం చేసుకున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర వివాదాన్ని రేకెత్తించాయి. ప్రశాంతి రెడ్డి ఈ వ్యాఖ్యలపై నెల్లూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
Also Read: Hydraa: హైడ్రా దూకుడు.. జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో ఆక్రమణలు తొలగింపు.. రూ.400 కోట్ల ఆస్తులు సేఫ్!
నల్లపురెడ్డి నివాసంపై దాడి
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మర్నాడే కొందరు వ్యక్తులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో ఫర్నిచర్ ధ్వంసమైంది. ప్రసన్నకుమార్ రెడ్డి తల్లిని సైతం దాడి చేసిన వ్యక్తులు బెదిరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే వైసీపీ ఈ దాడిని టీడీపీ కార్యకర్తలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (ప్రశాంతి రెడ్డి భర్త) అనుచరులు చేసినట్లు ఆరోపించింది. దీనిని రాజకీయ ప్రతీకారంగా అభివర్ణించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమెకు తాజాగా బెదిరింపు లేఖ అందడం ఆసక్తికరంగా మారింది. దీని వెనక రాజకీయ కుట్ర దాగుందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
