Canadian women: కెనడా వైద్యులు అద్భుతం చేశారు. 10 ఏళ్ల క్రితం చూపు కోల్పోయిన 75 ఏళ్ల మహిళకు తిరిగి చూపు తెప్పించారు. ఆమె నోటిలోని పంటిని తీసి కంటిలో అమర్చడం ద్వారా ఈ అద్భుతాన్ని చేసి చూపించారు. ప్రస్తుతం తాను తన భర్త, పెంపుడు కుక్కను చూడగలుతున్నానని మహిళ ఆనందం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆమెకు చేసిన చికిత్స ఏంటీ? వైద్యులు ఆమెకు ఏ విధంగా చూపు తెప్పించారు? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వివరాల్లోకి వెళ్తే..
కెనడాలోని బ్రిటిష్ కొలంబియాకు చెందిన గైల్ లేన్ (75) అనే మహిళ.. 10 సంవత్సరాల క్రితం ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధికి గురైంది. దీంతో ఆమె (Gail Lane) కంటి కార్నియాలు తీవ్రంగా దెబ్బతిని చూపు కోల్పోయింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెకు ‘టూత్ ఇన్ ఐ సర్జరీ’ అనే అరుదైన చికిత్సను వైద్యులు చేశారు. దీంతో ఆమెకు తన కంటి చూపు తిరిగి వచ్చింది.
చికిత్స సంక్లిష్టమైనదే.. కానీ
ఈ శస్త్ర చికిత్సను వాంకోవర్ (Vancouver)లోని మౌంట్ సెయింట్ జోసెఫ్ (Mount Saint Joseph Hospital) ఆసుపత్రిలో నేత్ర వైద్య నిపుణుడు డా. గ్రెగ్ మాలోనీ (Dr Greg Moloney) నిర్వహించారు. కెనడాలో ఇప్పటివరకు ఈ చికిత్స పొందినవారు ముగ్గురేనని ఆయన తెలిపారు. టూత్ ఇన్ ఐ సర్జరీ అనే అరుదైన టెక్నిక్‌ను కెనడాకు పరిచయం చేసిన వ్యక్తి కూడా మాలోనీ కావడం విశేషం. ఆయన ఈ చికిత్సను ‘సంక్లిష్టమైనదే కానీ జీవితాన్ని మార్చివేసే విధానం’గా అభివర్ణించారు.
శస్త్ర చికిత్స విధానం..
కంటికి సహజంగా ఉండే కార్నియా పనిచేయనప్పుడు దానిని భర్తీ చేసేందుకు ఈ టూత్-ఇన్-ఐ సర్జరీ (Tooth-in-Eye Surgery)ని రోగికి చేస్తారు. చికిత్సలో భాగంగా రోగి నోటిలోని పంటి ముక్క (సాధారణంగా కేనైన్ పన్ను)ను తీసి అందులో లెన్స్ లేదా సూక్ష్మ దూరదర్శినిని అమరుస్తారు. దీనిని వైద్యపరంగా ‘Osteo-Odonto Keratoprosthesis’ (OOKP) అని పిలుస్తారు. లెన్స్ అమర్చిన పంటి భాగాన్ని తొలుత చెంప దగ్గరే అమర్చి దాని చుట్టూ కణజాలం పెరిగేలా చేస్తారు. కొన్ని నెలల తర్వాత ఆ పంటిని తీసి దెబ్బతిన్న కార్నియాకు బదులుగా రీప్లేస్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ లెన్స్ కంటిలో ‘కొత్త కార్నియా’లా పనిచేస్తుంది. దాని ద్వారా వెలుతురు, చిత్రాలు లోపలికి ప్రవేశించి మళ్లీ చూపు వస్తుంది. దీనిని చివరి ప్రత్యామ్నాయ చికిత్సగా వైద్యులు చెబుతుంటారు.

Also Read: Khazana Jewellers Robbery: ఖజానా దోపిడి దొంగలు మామూలోళ్లు కాదు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన డీసీపీ!
‘ఇప్పుడు నేను చూడగలుగుతున్నా’
శస్త్రచికిత్స అనంతరం గైల్ లేన్ క్రమంగా వెలుగును చూడం ప్రారంభించింది. ఆ తర్వాత చిన్నగా కదలికలు ఆమెకు కంటికి కనిపించాయి. తన కుక్క పైపర్ తోక ఊపడం మొదటిసారి గుర్తించానని గైల్ లేన్ అన్నారు. ఆరు నెలల తర్వాత తన జీవిత భాగస్వామి ఫిల్ ముఖం తొలిసారిగా చూశానని చెప్పారు. ‘ఇప్పుడు నేను చాలా రంగులు చూడగలుగుతున్నాను. బయట చెట్లు, గడ్డి, పూలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ మళ్లీ చూడగలగడం అద్భుతమైన అనుభూతి’ అని ఆమె చెప్పారు. ఇతరుల ముఖ లక్షణాలను గుర్తించడం ప్రారంభించానని.. ఇప్పుడు కొద్దికొద్దిగా స్వతంత్రంగా తిరగడం ప్రారంభించానని ఆమె పేర్కొన్నారు. గతంలో లాగా ఎవరో ఒకరి చేయి పట్టుకోవాల్సిన పని లేకుండా చిన్నచిన్న ప్రయాణాలు చేయగలుగుతున్నట్లు చెప్పారు.