Vegetarian In China: చైనీయుల ఆహారం చాలా విభిన్నంగా ఉంటుంది. పట్టుపురుగులు మొదలుకొని, తేళ్లు, జెర్రులు, పాములు, కప్పలు చాలా ఇష్టంగా ఆరగిస్తారు. అంతేకాదు, పంది రక్తంతో స్పెషల్ కర్రీలు, కోడి కాళ్లతో వేపుళ్లు చేసుకొని లాగించేస్తారు. అంతేకాదు, ఇంకా చాలా రకాల వింతైన వంటకాలు వండుతారు. ఎవరూ ఊహించలేని వాటిని ఆహార పదార్థాలుగా తింటారు. చైనాలో దొరికితే వింత వంటకాలకు సంబంధించిన చాలా వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాంటి దేశంలోకి ఒక ‘ప్యూర్ వెజిటేరియన్’ వెళ్తే ఎలా ఉంటుంది?, నిజంగా అక్కడ జీవించలరా? ఈ ప్రశ్నలకు అక్కడ నివసిస్తున్న ఒక యూట్యూబర్ తన స్వీయ అనుభూతితో సమాధానం చెప్పాడు. సాధారణంగా అయితే, శాఖాహారులు చైనాలో బతకడం చాలా కష్టమేనని సాధారణ వ్యక్తులు అనుకుంటుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ భావన ఉంది. అయితే, చైనాలోని గ్వాంగ్‌జౌలో నివసిస్తున్న ఒక భారతీయుడు ప్రత్యేక వీడియో ద్వారా అక్కడి వాస్తవిక పరిస్థితులను వివరించాడు.
‘‘ శాఖాహారులకు చైనా ఒక పీడకలనా?. అందరిలో ఉన్న అపోహలను తొలగించాలనుకుంటున్నాను’ అనే టైటిల్‌తో అధర్వ మహేశ్వరి అనే యూట్యూబర్ ఒక వీడియో షేర్ చేశాడు. కున్నింగ్‌లోని తెగ రద్దీగా ఉన్న ఓ పెద్ద మార్కెట్‌కు వెళ్లిన అధర్వ అక్కడ ఎలాంటి వాతావరణం ఉందో వివరించాడు. ఏమాత్రం ఫిల్డర్ చేయకుండా కూరగాయల మార్కెట్‌ను యథాతథంగా చూపించాడు. భారతదేశంలోని అనేక మార్కెట్ల కంటే ఈ మార్కెట్ చాలా వైవిధ్యంగా ఉందని, శాఖాహారానికి నిజమైన స్వర్గధామమని అతడు వ్యాఖ్యానించాడు.
Read also- Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై ఆర్మీ జనరల్ కీలక ప్రకటన
రకరకాల కూరగాయలు
ఆ మార్కెట్‌లో సరసమైన ధరలకే వివిధ రకాల తాజా కూరగాయాలు కనిపించాయి. ఆకుకూరలు లేతగా, కూరగాయలు చక్కగా పచ్చ రంగులో ఉన్నాయి. ‘‘చైనా ప్రజల ఆహారమంతా మాంసమేననే అపోహలను ఇక మరచిపోండి’’ అని అధర్వ చెప్పాడు. అతడు షేర్ చేసిన వీడియోలో కాకరకాయలు, బీరకాయలు, సొరకాయలు, పచ్చి ఉల్లిపాయలు, స్వీట్ కార్న్స్, క్యారెట్, అల్లం, వెల్లుల్లి, ఎర్ర ఉల్లిపాయలు, చిలగడదుంపలు, వంకాయలు, బెండకాయలు వంటి భారతీయులకు బాగా తెలిసిన కూరగాయలు కనిపించాయి. చైనాలో ప్రత్యేకంగా పండే బోక్ చోయ్, గై లాన్, లోటస్ రూట్, పలు రకాల పుట్టగొడుగులు (షిటేక్, ఎనోకి, వుడ్ చెవి), వెదురు రెమ్మలు, దబ్బకాయలు వంటి వెజిటీరియన్ కూరగాయలు కనిపించాయి.
Read also- Rupee Bond Market: రూపీ బాండ్ మార్కెట్‌కు కష్టకాలం.. ఆర్‌బీఐ సంకేతాలతో మందగమనం తప్పదా!
అంతేకాదు, తాజా అరటిపండ్లు, జామ, పుచ్చకాయ, నారింజ, లిచీ, మామిడి, డ్రాగన్ ఫ్రూట్స్, మరెన్నో పండ్లు ఉన్న ఫ్రూట్ మార్కెట్‌ను కూడా యూట్యూబర్ అధర్వ తన వీడియోలో చూపించాడు. బయట లోకానికి చైనా గురించి పెద్దగా తెలియని నిజాలు ఈ వీడియోలు బయటపడ్డాయి. ఆహారం, సంస్కృతికి సంబంధించి బయట ప్రపంచానికి తెలియని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కాబట్టి, చైనాకు ట్రిప్ ప్లాన్ చేసే ఏ శాఖాహార వ్యక్తైనా, వేగన్ వ్యక్తి (Vegan ) అయినా వెనుకా ముందు ఆలోచించకుండా వెళ్లిపోవచ్చని పలువురు కామెంట్లు చేస్తున్నారు.